AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నో ప్రశ్నలు.. ఈ పాపం ఎవరిదీ..? ఢిల్లీ రావ్స్‌ కోచింగ్‌ సెంటర్‌ ఘటనపై విద్యార్ధుల ఆందోళన..

UPSC aspirants death: ఢిల్లీ రావ్స్‌ కోచింగ్‌ సెంటర్‌ ఘటనపై విద్యార్ధి లోకం భగ్గుమంటోంది. కోచింగ్‌ సెంటర్‌ సెల్లార్‌లో వరదనీటిలో మునిగి ముగ్గురు విద్యార్ధులు చనిపోవడానికి నిర్వాహకులే కారణమంటూ స్టూడెంట్స్‌ భారీ ఆందోళన చేపట్టారు. కరోల్‌బాట్‌ మెట్రో స్టేషన్‌ దగ్గర విద్యార్ధులు బైఠాయించారు.

ఎన్నో ప్రశ్నలు.. ఈ పాపం ఎవరిదీ..? ఢిల్లీ రావ్స్‌ కోచింగ్‌ సెంటర్‌ ఘటనపై విద్యార్ధుల ఆందోళన..
Upsc Aspirants Death
Shaik Madar Saheb
|

Updated on: Jul 28, 2024 | 6:35 PM

Share

UPSC aspirants death: ఢిల్లీ రావ్స్‌ కోచింగ్‌ సెంటర్‌ ఘటనపై విద్యార్ధి లోకం భగ్గుమంటోంది. కోచింగ్‌ సెంటర్‌ సెల్లార్‌లో వరదనీటిలో మునిగి ముగ్గురు విద్యార్ధులు చనిపోవడానికి నిర్వాహకులే కారణమంటూ స్టూడెంట్స్‌ భారీ ఆందోళన చేపట్టారు. కరోల్‌బాట్‌ మెట్రో స్టేషన్‌ దగ్గర విద్యార్ధులు బైఠాయించారు. దీంతో పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. కరోల్‌బాగ్‌ మెట్రోస్టేషన్‌ను ముట్టడించిన వందలాదిమంది విద్యార్ధులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇది ప్రమాదం కాదని , కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు , అధికారులు చేసిన హత్యలేనని విద్యార్ధులు నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

రావ్స్ కోచింగ్ సెంటర్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు చనిపోయారు. ఇప్పటికే కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. కోచింగ్ సెంటర్‌ దగ్గర విద్యార్థుల ఆందోళనతో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. సహచరుల మృతిపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై విచారణకు ఆదేశించిన మంత్రి ఆతిషి.. నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించారు.

శనివారం సాయంత్రం రాజేంద్రనగర్‌ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో వర్షపు నీటితో రావ్స్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ సెల్లార్‌ మునిగిపోయింది. సెల్లార్‌లో లైబ్రరీలో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. రాత్రి 7 గంటల సమయంలోనే తాము నీటిలో చిక్కుకున్నామంటూ పలువురు అభ్యర్థులు ఫైర్‌ స్టేషన్‌కు కాల్‌ చేశారు. కాని ఫైర్‌ సిబ్బంది రాడానికి ఆలస్యమైంది. ట్రాఫిక్‌ కారణంగా రెండు గంటల ఆలస్యంగా రావడంతో.. అప్పటికే నీటిలో చిక్కుకున్న వారిలో ఒకరు చనిపోయారు. పోలీసులు అక్కడకు వచ్చినా.. కొందరినే రక్షించగలిగారు. ఫైర్‌ సిబ్బందితోపాటు.. NDRF కూడా అక్కడకు చేరుకుని కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌ నుంచి నీటిని తోడే ప్రక్రియ ప్రారంభించారు. దాదాపు ఐదు గంటల పాటు శ్రమించినా… ముగ్గురు అభ్యర్థుల్ని కాపాడలేకపోయారు.

రావ్స్ కోచింగ్ సెంటర్‌ రోడ్డు కంటే కిందకు ఉండటంతో.. వరద నీరు భారీగా వచ్చి చేరింది. వరద వస్తున్న సమయంలో సెల్లార్‌లోని లైబ్రరీలో దాదాపు 30మంది ఉన్నట్లు సివిల్ సర్వీస్ అభ్యర్థులు చెబుతున్నారు. చాలామంది వరద నుంచి తప్పించుకున్నా.. ముగ్గురు మాత్రం సెల్లార్‌లో చిక్కుకుని బయటకు రాలేక చనిపోయారు. వర్షం, వరదతో.. షార్ట్ సర్క్యూట్ కారణంగా.. లైబ్రరీలో బయోమెట్రిక్ డోర్స్ క్లోజ్ అయ్యాయని.. ప్రమాదం నుంచి బయటపడ్డవారు చెబుతున్నారు.

మృతుల్లో ఒకరు సింగరేణి మేనేజర్ కూతురు తాన్య సోనిగా గుర్తించారు. తాన్య స్వస్థలం బీహార్. మరో ఇద్దరు యూపీ, కేరళకు చెందిన అభ్యర్థులుగా పోలీసులు తేల్చారు. తాన్య మృతితో ఆమె తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

నిబంధనల ప్రకారం సెల్లార్ పార్కింగ్ అవసరాలకు మాత్రమే వాడుకోవాలి. సెల్లార్‌లో లైబ్రరీలు, క్యాంటీన్‌లు ఏర్పాటు చేయొద్దు. సెల్లార్స్‌లో నివాసం కూడా ఉండొద్దు. పార్కింగ్‌కు తప్ప.. కమర్షియల్‌గా సెల్లార్స్ అస్సలు వాడొద్దు. బిల్డింగ్ కోడ్‌ కూడా ఇదే చెప్తోంది. అయినా.. నిబంధనలు ఎవ్వరూ పాటించడం లేదు. వాహనాల పార్కింగ్‌ అంతా రోడ్లపై చేస్తూ.. రూల్స్ విరుద్ధంగా లైబ్రరీలు, ఇతర అవసరాలకు సెల్లార్స్ వినియోగిస్తున్నారు. దీంతో రావ్స్ కోచింగ్ సెంటర్‌లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా కోచింగ్ సెంటర్లలో సెల్లార్స్‌లో లైబ్రరీలు ఉన్నాయని స్టూడెంట్స్ చెబుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఎవ్వరూ పట్టించుకోరని.. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు హడావుడి చేస్తారే తప్ప ఆ తర్వాత అంతా షరా మామూలే అనే వాదనలు స్టూడెంట్స్‌ నుంచి వినిపిస్తున్నాయి.

సివిల్స్‌ అభ్యర్థుల మృతిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలో కోచింగ్‌ సెంటర్‌లో వరదలతో మృతిచెందిన.. సికింద్రాబాద్‌ యువతి తన్యా సోని తండ్రికి ఫోన్‌ చేశారు. ఫోన్‌లో విజయ్‌కుమార్‌ను పరామర్శించారు.

ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన బాధాకరమన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. హైదరాబాద్‌లోనూ నిబంధనలకు విరుద్ధంగా నడిచే కోచింగ్ సెంటర్లు చాలా ఉన్నాయని చెప్పారు. టౌన్ ప్లానింగ్ అధికారులు అవినీతికి పాల్పడి.. అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు రాజాసింగ్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..