యూపీ అసెంబ్లీ ఎన్నికలపై కమలనాథుల ఫోకస్..వ్యూహాత్మక అడుగులు
UP Elections 2022: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగియకముందే ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అక్కడ ఎన్నికల జోష్ తారస్థాయికి చేరింది.
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగియకముందే ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అక్కడ ఎన్నికల జోష్ తారస్థాయికి చేరింది. వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటి నుంచే వ్యూహ, ప్రతివ్యూహాల్లో ఆయా పార్టీలు తలమునకలయ్యాయి. మరీ ముఖ్యంగా యూపీలో అధికార బీజేపీ ప్రత్యర్థులకంటే ఓ అడుగు ముందే నిలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అక్కడ కీలకంగా మారనున్నారు. దీంతో ప్రియాంక మానియాను ఎదుర్కొని తిరిగి అక్కడ అధికారాన్ని సొంతం చేసుకునేందుకు కమలనాథులు ఇప్పటి నుంచే వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.
యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలతో కలిసి 325 స్థానాల్లో విజయం సాధించి అధికార పగ్గాలు సొంతం చేసుకుంది. గత ఎన్నికల్లో పార్టీ గెలిచిన 312 స్థానాలను తిరిగి దక్కించుకోవడంతో పాటు పార్టీ కోల్పోయిన 84 స్థానాలనూ కైవసం చేసుకునేందుకు కమలనాథులు పక్కా ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిన స్థానాలపై ఇప్పటికే ప్రత్యేక ఫోకస్ పెట్టారు. 2017 ఎన్నికలకంటే మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కమలనాథులు. మొత్తం 403 స్థానాల్లో అన్ని స్థానాల్లోనూ గెలుపొందడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఆ 84 స్థానాలపై స్పెషల్ ఫోకస్… ప్రధానంగా గత ఎన్నికల్లో పార్టీ కోల్పోయిన 84 అసెంబ్లీ స్థానాలపై బీజేపీ నేతలు ప్రత్యేక దృష్టిసారించారు. అక్కడ పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించుకుని…వచ్చే ఎన్నికల్లో అక్కడ విజయం సాధించేందుకు పక్కా ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నారు. అక్కడ పార్టీ ఓటమికి ఒకటికంటే మించిన కారణాలున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. అన్ని అవరోధాలను అధిగమించి అక్కడ పార్టీని విజయం వైపు నడిపిస్తామని..యోగి ఆదిత్యనాథ్ ను రెండోసారి సీఎం చేస్తామని ధీమా వ్యక్తంచేశారు.
ఇప్పటికే రంగంలోకి దిగిన నేతలు.. పార్టీ ఓటమి చెందిన స్థానాల్లో ఆరు మాసాల మునుపటి నుంచే కమలనాథులు గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. బలహీన జోన్స్‌ను గుర్తించి…అక్కడ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతలను స్థానిక సీనియర్ నేతలకు అప్పగించారు. ఈ నియోజకవర్గాల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. నియోజకవర్గ ప్రజలతో పార్టీ మమేకమయ్యే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తద్వారా పార్టీ పట్ల వారికున్న అపోహలు, అనుమానాలను తొలగిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
మిత్రపక్ష స్థానాలపైనా బీజేపీ ఫోకస్.. త్వరలో యూపీ పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ ఓటమి చెందిన స్థానాల్లో ఇప్పుడు తమ బలాన్ని చాటేందుకు పంచాయితీ ఎన్నికలను వేదికగా మార్చుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. పొత్తులతో సంబంధం లేకుండా అన్ని బలహీన నియోజకవర్గాల్లో బలపడటమే లక్ష్యంగా బీజేపీ నేతలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టిన ఈ 84 స్థానాల్లోని 9 స్థానాల్లో 2017 ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షం అప్నా దళ్ విజయం సాధించింది. ఇప్పటికే బీజేపీ మిత్రపక్షంగా అప్నా దళ్ కొనసాగుతోంది. అయితే అప్నా దళ్ గెలిచిన స్థానాలపై కూడా బీజేపీ ఫోకస్ పెట్టడంతో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అప్నా దళ్‌తో బీజేపీ పొత్తు ఉంటుందా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది.
ఇవి కూడా చదవండి..West Bengal Election 2021: పశ్చిమ బెంగాల్ ఎన్నికల సిత్రాలు.. 25శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులు
NTR Political Entry: ఊపిరి ఊదవయ్యా.. రామయ్యా..!.. ఏపీలో హాట్ టాపిక్‌గా తారక్ పొలిటికల్ ఎంట్రీ..