AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Rules: ఒకరి కోసం బుక్ చేసిన రైలు టికెట్‌పై.. కుటుంబ సభ్యులు ప్రయాణించొచ్చా?

Indian Railways: రైలు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఏదైనా అనుకోని కారణాలతో ప్రయాణికుడు వెళ్లలేని పరిస్థితి రావచ్చు. ఇలాంటి సమయంలో అతని పేరుపై ఉన్న కన్‌ఫర్మ్‌డ్ టికెట్‌పై కుటుంబ సభ్యులు ప్రయాణించవచ్చా? భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం టికెట్‌ను తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, కుమారుడు, కుమార్తె, భార్య లేదా భర్త వంటి కుటుంబ సభ్యుల పేరుకు కొన్ని నిబంధనల ప్రకారం బదిలీ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ఏం చేయాలో? పూర్తి వివరాలు తెలుసుకోండి.

Railway Rules: ఒకరి కోసం బుక్ చేసిన రైలు టికెట్‌పై.. కుటుంబ సభ్యులు ప్రయాణించొచ్చా?
Indian Railways Rules
Janardhan Veluru
|

Updated on: Oct 08, 2026 | 1:51 PM

Share

రైలు ప్రయాణం కోసం ముందుగానే టికెట్ రిజర్వేషన్ చేసుకున్న తర్వాత ఏదైనా అనుకోని కారణాలతో ప్రయాణం చేయలేని పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో మన పేరుపై ఉన్న రిజర్వ్‌డ్ టికెట్‌పై కుటుంబంలోని మరో వ్యక్తి ప్రయాణించవచ్చా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. అయితే కన్ఫర్మ్ టికెట్ ఉన్నంత మాత్రాన కుటుంబ సభ్యుడు నేరుగా ఆ టికెట్‌పై ప్రయాణించడానికి అనుమతి ఉండదు. భారతీయ రైల్వే (Indian Railways) నిబంధనల ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే టికెట్‌ను కుటుంబ సభ్యుడి పేరుకు బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది.

రిజర్వ్‌డ్ టికెట్‌పై కేటాయించిన సీటు లేదా బెర్త్ సాధారణంగా టికెట్‌లో పేరు ఉన్న ప్రయాణికుడికి మాత్రమే చెల్లుతుంది. ఉదాహరణకు తండ్రి పేరుపై కన్‌ఫర్మ్‌డ్ టికెట్ ఉండి, ఏదైనా తండ్రి ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడొచ్చు. అలాంటి సమయంలో తండ్రి పేరిట ఉన్న రిజర్వ్‌డ్ టికెట్‌పై కుమారుడు ప్రయాణించాలంటే కొన్ని నిబంధనలు ఫాలో అవ్వాలి. తండ్రి పేరిట ఉన్న టికెట్‌లో అతని కుమారుడి పేరు మార్చకుండా ప్రయాణించడం రైల్వే నిబంధనలకు విరుద్ధమే అవుతుంది.

భారతీయ రైల్వే కొన్ని సందర్భాల్లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్‌ను కుటుంబ సభ్యుడి పేరుకు బదిలీ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందులో తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, కుమారుడు, కుమార్తె, భర్త, భార్య ఉన్నారు. అంటే మీ పేరుపై ఉన్న కన్‌ఫర్మ్‌డ్ టికెట్‌ను నిబంధనల ప్రకారం మీ తండ్రి, తల్లి, అన్న/తమ్ముడు, అక్క/చెల్లి, కొడుకు, కూతురు లేదా భార్య/భర్త పేరుకు మార్చుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ప్రయాణానికి ఎంత ముందుగా దరఖాస్తు చేయాలి?

టికెట్‌ను కుటుంబ సభ్యుడి పేరుకు బదిలీ చేయాలంటే సాధారణంగా రైలు బయలుదేరే సమయానికి కనీసం 24 గంటల ముందు రాతపూర్వకంగా అభ్యర్థన ఇవ్వాలి. ఇందుకోసం రైల్వే రిజర్వేషన్ కార్యాలయాన్ని సంప్రదించాలి. ఆన్‌లైన్‌లో బుక్ చేసిన టికెట్ విషయంలో కూడా సంబంధిత రిజర్వేషన్ కార్యాలయాన్ని సంప్రదించి, ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్‌తో పాటు అవసరమైన ఒరిజినల్ ఐడీ, సంబంధానికి సంబంధించిన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది.

స్నేహితుడి పేరిట టికెట్ మార్చుకోవచ్చా?

కుటుంబ సభ్యుల విషయంలో ఉన్న ఈ వెసులుబాటు ఎవరికి పడితే వారికి వర్తింపజేయడానికి రైల్వే నిబంధనలు అనుమతించవు. కాబట్టి మీ పేరుపై ఉన్న టికెట్‌ను స్నేహితుడి పేరు మీదకు మార్చి అతడిని ప్రయాణానికి పంపడం సాధారణంగా సాధ్యం కాదు. రైల్వే నిబంధనల్లో పేర్కొన్న ప్రత్యేక పరిస్థితులు, అనుమతులు ఉంటేనే ఇతర బదిలీలు సాధ్యమవుతాయి.

విద్యార్థులు, వివాహ బృందాలకు ప్రత్యేక నిబంధనలు

గుర్తింపు పొందిన విద్యాసంస్థకు చెందిన విద్యార్థుల బృందం, వివాహ బృందం, NCC క్యాడెట్ల వంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కూడా టికెట్ పేరు మార్పునకు నిబంధనలు ఉన్నాయి. వీటికి సంబంధిత సంస్థ లేదా బృందం అధిపతి నుంచి రాతపూర్వక అభ్యర్థన చేసుకోవాలి. సాధారణంగా ఈ అభ్యర్థనను ప్రయాణానికి 48 గంటల ముందు చేయాల్సి ఉంటుంది. కొన్ని గ్రూప్ సందర్భాల్లో మొత్తం సభ్యుల సంఖ్యలో 10 శాతానికి మించి పేరు మార్పులు అనుమతించరు.

టికెట్‌ను ఒకసారి మరొకరి పేరుకు బదిలీ చేసిన తర్వాత మళ్లీ ఇంకొకరి పేరుకు బదిలీ చేసే అవకాశం ఉండదు. అందువల్ల ప్రయాణికుడు మారాల్సిన పరిస్థితి ఉంటే చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే రైల్వే రిజర్వేషన్ కార్యాలయాన్ని సంప్రదించడం మంచిది.

మొత్తంగా చెప్పాలంటే.. మీ పేరుపై ఉన్న కన్‌ఫర్మ్‌డ్ రైలు టికెట్‌ను కుటుంబ సభ్యుడు నేరుగా ఉపయోగించలేడు. ముందుగా రైల్వే నిబంధనల ప్రకారం పేరు బదిలీ చేయించుకోవాలి. ప్రయాణ సమయానికి కనీసం 24 గంటల ముందు దరఖాస్తు చేయడం, అవసరమైన గుర్తింపు, సంబంధ ధ్రువీకరణ పత్రాలను సమర్పించి టికెట్‌లో పేరు మార్చుకోవడం ముఖ్యం.

Follow Us