‘రూ.13 లక్షల కారు కావాలంటూ పెళ్లి కొడుకు పేచీ..’ మండపంలోనే వధువును వదిలేసిన వరుడు!
హర్యానాలోని సోనిపట్‌లో పెళ్లి వేడుకలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తనకు రూ.13 లక్షల విలువైన మారుతీ సుజుకీ బ్రెజ్జా కారు కావాలంటూ ఢిల్లీ పోలీస్ ఉద్యోగి కుల్దీప్ పెళ్లికి నిరాకరించినట్లు వధువు కుటుంబం ఆరోపించింది. ఇప్పటికే రూ.9.5 లక్షల విలువైన హ్యుందాయ్ ఆరా కారును సిద్ధం చేసినప్పటికీ వరుడు అంగీకరించలేదని తెలిపింది. చివరకు పెళ్లి మండపంలో వధువును వదిలేసి సుమారు 30 మంది బంధువులతో కలిసి వెళ్లిపోయినట్లు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై వధువు కుటుంబం పోలీసులను ఆశ్రయించింది..

హర్యానా, నవంబర్ 23: పెళ్లి వేడుకలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. వరకట్నంగా కోరిన కారు ఇవ్వలేదనే కారణంతో ఓ పెళ్లి కొడుకు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. పెళ్లి మండపానికి వధువు పెళ్లి దుస్తుల్లో సిద్ధంగా ఉండగా.. వరుడు మాత్రం తనకు కావాల్సిన కారు ఇవ్వలేదంటూ వివాహ వేడుకను మధ్యలోనే వదిలి వెళ్లిపోయాడు. చివరకు వధువు కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. హర్యానాలోని సోనిపట్‌లో నవంబర్ 20న ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
‘రూ.9.5 లక్షల కారు వద్దు.. రూ.13 లక్షల కారు కావాలి’
సోనిపట్‌లోని మమ్చంద్ వాటికలో నవంబర్ 20న హీనా అనే యువతికి, ఢిల్లీ పోలీస్ విభాగంలో పనిచేస్తున్న కుల్దీప్ అనే వ్యక్తితో వివాహం జరగాల్సి ఉంది. వీరి పెళ్లి సంబంధం ఆరు నెలల క్రితమే కుదిరింది. పెళ్లి కోసం ఇరు కుటుంబాలు ఎంతోకాలంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే పెళ్లికి ఒక రోజు ముందు అసలు వివాదం మొదలైంది. వధువు కుటుంబం వరుడి కోసం సుమారు రూ.9.5 లక్షల విలువైన హ్యుందాయ్ ఆరా కారును బుక్ చేసింది. కానీ తనకు ఆ కారు వద్దని, దాని స్థానంలో సుమారు రూ.13 లక్షల విలువైన మారుతీ సుజుకీ బ్రెజ్జా కావాలని కుల్దీప్ పట్టుబట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. హ్యుందాయ్ ఆరా కారును ట్యాక్సీతో పోల్చుతూ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వధువు కుటుంబం ఫిర్యాదులో పేర్కొంది. దీంతో వధువు తండ్రి సుభాష్ కుమార్ ఆ కార్ బుకింగ్‌ను రద్దు చేసి, సోనిపట్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పలు షోరూమ్‌లను సంప్రదించారు. అయితే పెళ్లికి ఒక్కరోజే సమయం ఉండటంతో బ్రెజ్జా కారును సమకూర్చలేకపోయారు.
కేవలం కారు విషయంలోనే కాకుండా వరుడి కుటుంబం ఇతర వస్తువులు కూడా డిమాండ్ చేసినట్లు వధువు తండ్రి ఆరోపించారు. వరుడికి రెండు తులాల బంగారు గొలుసు, అతడి తల్లికి నాలుగు తులాల బంగారు చెవిపోగులు, వెండి పట్టీలు సిద్ధం చేసినట్లు తెలిపారు. వరుడి అన్నయ్య, వదినకు కూడా నగలు ఇవ్వాలని కోరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇవే కాకుండా సుమారు రూ.1.32 లక్షల విలువైన ఫర్నిచర్, ఇతర గృహోపకరణాలను కూడా వధువు కుటుంబం ఏర్పాటు చేసింది. పెళ్లి సంబంధం కుదిరిన సమయంలో తాము ఎలాంటి కట్నం అడగబోమని, తీసుకోబోమని వరుడి కుటుంబం హామీ ఇచ్చిందని సుభాష్ ఆరోపించారు. పెళ్లి రోజు కుల్దీప్ తన తల్లితో కలిసి సాధారణ దుస్తుల్లోనే వివాహ వేదికకు వచ్చినట్లు వధువు కుటుంబం తెలిపింది. సంప్రదాయ వివాహ వేడుకలకు సిద్ధం కాకుండా బ్రెజ్జా కారు గురించి ఆరా తీశాడని ఆరోపించింది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ గొడవలో వరుడు, అతడి బంధువులు వధువు కుటుంబ సభ్యులను దూషించినట్లు సుభాష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. వరుడి వదిన తాను న్యాయవాదినని పరిచయం చేసుకుంటూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించినట్లు ఆరోపించారు. గొడవ సమయంలో కుల్దీప్ ఢిల్లీ పోలీస్‌లో తన ఉద్యోగాన్ని ప్రస్తావించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. వధువు కుటుంబ సభ్యులు, బంధువులు ఎంతగా నచ్చజెప్పినా కుల్దీప్ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదని తెలిపారు. చివరకు సుమారు 30 మంది బంధువులతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఆరోపించారు. వరుడు పెళ్లికి నిరాకరించి వెళ్లిపోవడంతో వధువు హీనా పెళ్లి దుస్తుల్లోనే మండపంలో ఎదురుచూడాల్సి వచ్చింది. పెళ్లి వేడుక కోసం కుటుంబం భారీగా ఏర్పాట్లు చేసింది. సుమారు 1,200 మంది అతిథుల కోసం భోజనాలు సిద్ధం చేశారు. వివాహ ఏర్పాట్ల కోసం రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేసినట్లు వధువు తండ్రి తెలిపారు. వరుడి కుటుంబం వెళ్లిపోవడంతో పలువురు అతిథులు భోజనం చేయకుండానే వెనుదిరిగినట్లు చెప్పారు.
ఈ ఘటన అనంతరం వధువు కుటుంబం అత్యవసర సహాయ నంబర్ 112కు ఫోన్ చేసింది. అనంతరం సెక్టార్ 27 పోలీస్ స్టేషన్లో వరుడు కుల్దీప్, అతడి కుటుంబ సభ్యులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. తన కుమార్తె హీనా ఎంఏ, జేటీబీ కోర్సులు పూర్తి చేసిందని, అయినప్పటికీ వరుడి కుటుంబం తమ ఆర్థిక స్థోమతకు మించి డిమాండ్లు చేసిందని సుభాష్ ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై సెక్టార్ 27 పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సవిత్ కుమార్ స్పందించారు. వధువు కుటుంబం నుంచి ఫిర్యాదు అందిందని, ఇరు కుటుంబాల వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.




