AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5,700 కిలోమీటర్లు.. 101 గంటలు! మణిపూర్ నుంచి సోమాలియా వరకు.. చిన్న పక్షి చేసిన భారీ సాహసం!

చూడటానికి చిన్న పక్షి.. కానీ దాని ప్రయాణం మాత్రం అసాధారణం. కేవలం 150 గ్రాముల బరువుండే ఓ అమూర్ ఫాల్కన్ ఏకంగా 5,700 కిలోమీటర్లు సముద్రం మీదుగా నిరంతరాయంగా ప్రయాణించింది. అది కూడా ఒక్కసారి ఆగకుండా, ఆహారం తీసుకోకుండా, విశ్రాంతి లేకుండా ఏకంగా 101 గంటల పాటు గాలిలోనే ఎగిరింది. మణిపూర్ నుంచి సోమాలియా వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం ఇప్పుడు వన్యప్రాణి పరిశోధకులను ఆశ్చర్యపరుస్తోంది.

5,700 కిలోమీటర్లు.. 101 గంటలు! మణిపూర్ నుంచి సోమాలియా వరకు.. చిన్న పక్షి చేసిన భారీ సాహసం!
Amur Falcon Alang
Balaraju Goud
| Edited By: |

Updated on: Nov 23, 2026 | 12:32 AM

Share

చూడటానికి చిన్న పక్షి.. కానీ దాని ప్రయాణం మాత్రం అసాధారణం. కేవలం 150 గ్రాముల బరువుండే ఓ అమూర్ ఫాల్కన్ ఏకంగా 5,700 కిలోమీటర్లు సముద్రం మీదుగా నిరంతరాయంగా ప్రయాణించింది. అది కూడా ఒక్కసారి ఆగకుండా, ఆహారం తీసుకోకుండా, విశ్రాంతి లేకుండా ఏకంగా 101 గంటల పాటు గాలిలోనే ఎగిరింది. మణిపూర్ నుంచి సోమాలియా వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం ఇప్పుడు వన్యప్రాణి పరిశోధకులను ఆశ్చర్యపరుస్తోంది. అలాంగ్ అనే పేరుగల ఈ యువ పక్షి అసాధారణమైన ఓర్పు, వలస పక్షుల సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది.

101 గంటల్లో 5,700 కిలోమీటర్లు!

మణిపూర్‌లోని తమెంగ్లాంగ్ జిల్లా నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన అలాంగ్.. సుమారు నాలుగు రోజుల ఐదు గంటల్లోనే ఆఫ్రికా తీరానికి చేరుకుంది. ఉపగ్రహ ట్రాకింగ్ ద్వారా అందిన సమాచారం ప్రకారం, అరేబియా సముద్రాన్ని దాటే క్రమంలో ఎక్కడా ఆగకుండా ప్రయాణించింది. అలాంగ్ సహచరుడైన అపపాంగ్ అనే వయోజన మగ అమూర్ ఫాల్కన్ కూడా ఈ వలస ప్రయాణంలో ఉంది. అది 95 గంటల్లో సుమారు 4,100 కిలోమీటర్లు ప్రయాణించి, అప్పటికి అరేబియా సముద్రం మీదుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

చిన్న పక్షులు.. వేల కిలోమీటర్ల ప్రయాణం!

అమూర్ ఫాల్కన్‌లు సాధారణంగా 150 గ్రాముల బరువు మాత్రమే ఉంటాయి. అయినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత సుదూర వలస ప్రయాణాలు చేసే పక్షుల్లో ఇవి ఒకటి. ప్రతి ఏడాది తూర్పు రష్యా, ఈశాన్య చైనా, మంగోలియా ప్రాంతాల నుంచి దక్షిణ, తూర్పు ఆఫ్రికా వరకు వలస వెళ్తాయి. ఈ ప్రయాణంలో ఈశాన్య భారతదేశం కీలకమైన విడిది ప్రాంతంగా ఉంటుంది. మణిపూర్, నాగాలాండ్‌లలో వేల సంఖ్యలో గుమిగూడి కీటకాలను తింటూ, సుదీర్ఘ ప్రయాణానికి అవసరమైన శక్తిని కూడగట్టుకుంటాయి.

శాటిలైట్ ట్రాకింగ్‌తో పరిశోధన

మణిపూర్ అమూర్ ఫాల్కన్ ట్రాకింగ్ ప్రాజెక్టులో భాగంగా వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) శాస్త్రవేత్తలు 2025 నవంబర్‌లో అలాంగ్, అపపాంగ్‌లకు తేలికపాటి శాటిలైట్ ట్రాన్స్‌మిటర్లను అమర్చారు. వీటి ద్వారా పక్షుల ప్రయాణ మార్గాలు, వేగం, ప్రయాణ సమయాన్ని పరిశోధకులు పర్యవేక్షిస్తున్నారు. ఈ తాజా వివరాలను తమిళనాడు అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహు కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

మరోవైపు, తమెంగ్లాంగ్ ప్రాంత ప్రజలు అమూర్ ఫాల్కన్‌ల విడిది ప్రాంతాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. స్థానికుల సహకారంతో ఈ వలస పక్షులకు సురక్షితమైన ఆవాసాలు లభిస్తున్నాయి. అలాంగ్ ప్రయాణం కేవలం ఒక పక్షి సాహసమే కాదు.. ప్రకృతిలోని అద్భుతమైన జీవన సామర్థ్యానికి, వన్యప్రాణి సంరక్షణ ప్రాధాన్యతకు నిదర్శనం.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us