AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: కన్ఫర్మ్ టికెట్ కోసం మరో ఛాన్స్.. చార్ట్ ప్రిపరేషన్ తర్వాత ఇలా ట్రై చేయండి

Train Ticket Booking: రైలు రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైన తర్వాత కూడా కన్ఫర్మ్ టికెట్ పొందే అవకాశం ఉంటుంది. రైలులో ఖాళీగా ఉన్న బెర్త్‌లను కరెంట్ బుకింగ్ ద్వారా ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చు. కరెంట్ బుకింగ్ ఎలా పనిచేస్తుంది? చార్ట్ ఎప్పుడు సిద్ధమవుతుంది? టికెట్ బుకింగ్‌కు ఉన్న ముఖ్యమైన నిబంధనలు ఏంటి? తెలుసుకోండి.

Indian Railways: కన్ఫర్మ్ టికెట్ కోసం మరో ఛాన్స్.. చార్ట్ ప్రిపరేషన్ తర్వాత ఇలా ట్రై చేయండి
Rain Ticket Booking
Janardhan Veluru
|

Updated on: Oct 03, 2026 | 6:53 PM

Share

Indian Railways Reservation: రైలు ప్రయాణం ప్లాన్ చేస్తున్నప్పుడు కన్ఫర్మ్ టికెట్ దొరకడం చాలామందికి పెద్ద సమస్యగా ఉంటుంది. ముఖ్యంగా పండుగలు, సెలవుల సమయంలో ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నా వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉండిపోతాయి. అయితే రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైన తర్వాత కూడా కన్ఫర్మ్ టికెట్ దొరికే అవకాశం ఉందని మీకు తెలుసా? రైలులో ఖాళీగా ఉన్న సీట్లు లేదా బెర్త్‌లను కరెంట్ బుకింగ్ (Current Booking) ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని కొంత మందికి మాత్రమే తెలుసు.

రిజర్వేషన్ చార్ట్ తయారైన తర్వాత కూడా కొన్ని సీట్లు ఖాళీగా ఉంటే వాటిని కరెంట్ బుకింగ్ కోసం అందుబాటులో ఉంచుతారు. అయితే ఇది ప్రతి రైలులోనూ ఖాళీ సీట్లు ఉంటాయని చెప్పలేం. రైలు, ప్రయాణ తేదీ, మార్గం, అందుబాటులో ఉన్న ఖాళీ బెర్త్‌లను బట్టి అవకాశం మారుతుంది. కరెంట్ బుకింగ్‌లో కన్ఫర్మ్ టికెట్లు మాత్రమే జారీ అవుతాయి. RAC లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఈ విధానంలో ఇవ్వరు. కాబట్టి చార్ట్ తయారైన తర్వాత ఖాళీ బెర్త్ కనిపిస్తే కరెంట్ బుకింగ్ ద్వారా వెంటనే బుక్ చేసుకోవచ్చు.

సీట్లు ఎలా ఖాళీ అవుతాయి?

ఫస్ట్ రిజర్వేషన్ చార్ట్ తయారైన తర్వాత కొందరు ప్రయాణికులు టికెట్లు క్యాన్సిల్ చేయడం, రిజర్వేషన్‌లో మార్పులు చేయడం వంటి కారణాలతో కొన్ని బెర్త్‌లు ఖాళీగా ఉండొచ్చు. అలాగే ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్ వరకు మాత్రమే ప్రయాణికుడు బుక్ చేసుకున్న బెర్త్.. ఆ తర్వాతి మార్గంలో ఖాళీగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి ఖాళీ సీట్లను కరెంట్ బుకింగ్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అయితే కరెంట్ బుకింగ్ ద్వారా రైలులో అదనపు సీట్లు సృష్టించరు. ఇప్పటికే ఖాళీగా ఉన్న బెర్త్‌లను మాత్రమే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తారు. అందుకే చివరి నిమిషంలో సీట్ల లభ్యత ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది.

కరెంట్ బుకింగ్‌లో ముఖ్యమైన నిబంధనలు

  • సాధారణ ప్రయాణికులతో పాటు ఏజెంట్లు కూడా కరెంట్ బుకింగ్ చేసుకోవచ్చు.
  • ఈ విధానంలో ఈ-టికెట్ మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
  • కన్ఫర్మ్ టికెట్ మాత్రమే జారీ అవుతుంది.
  • వర్తించే నిబంధనల ప్రకారం సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు రాయితీలు అందుబాటులో ఉంటాయి.
  • చార్ట్ సిద్ధమైన తర్వాత కూడా నిర్ణయించిన సమయ పరిమితిలో కరెంట్ బుకింగ్ చేసుకోవచ్చు.
  • కరెంట్ బుకింగ్ చేసిన తర్వాత బోర్డింగ్ పాయింట్ మార్చుకునే అవకాశం ఉండదు.
  • PNRలో ప్రయాణికుడి పేరు, వయసు, లింగం వంటి వివరాలను మార్చడం సాధ్యం కాదు.
  • కొన్ని ప్రత్యేక రైళ్లలో వర్తించే నిబంధనల ప్రకారం ఛార్జీలు ఉండవచ్చు.

మొదటి రిజర్వేషన్ చార్ట్ ఎప్పుడు తయారవుతుంది?

రైల్వే రిజర్వేషన్ విధానంలో భాగంగా మొదటి చార్ట్‌ను ముందుగానే సిద్ధం చేస్తున్నారు. ఉదయం 5:01 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు మొదటి రిజర్వేషన్ చార్ట్‌ను సాధ్యమైనంత వరకు ముందు రోజు రాత్రి 8 గంటలలోపు సిద్ధం చేస్తారు. మధ్యాహ్నం 2:01 గంటల నుంచి రాత్రి 11:59 గంటల వరకు, అలాగే అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బయలుదేరే రైళ్లకు మొదటి చార్ట్‌ను సాధ్యమైనంత వరకు రైలు బయలుదేరడానికి కనీసం 10 గంటల ముందే సిద్ధం చేస్తారు.

ఫైనల్ చార్ట్ ఎప్పుడు?

మొదటి చార్ట్ సిద్ధమైన తర్వాత కూడా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. చివరి రిజర్వేషన్ చార్ట్‌ను సాధారణంగా రైలు బయలుదేరే సమయానికి సుమారు 30 నిమిషాల ముందు సిద్ధం చేస్తారు. అందువల్ల మొదటి చార్ట్ తయారైందంటే ఇక టికెట్ దొరకదని అనుకోవాల్సిన అవసరం లేదు. మధ్యలో ఖాళీ బెర్త్ అందుబాటులోకి వస్తే కరెంట్ బుకింగ్ ద్వారా కన్ఫర్మ్ టికెట్ పొందే అవకాశం ఉంటుంది. రైలులో టికెట్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మొదటి చార్ట్ తర్వాత కూడా సీట్ల లభ్యతను చెక్ చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. ఖాళీ బెర్త్ కనిపిస్తే కరెంట్ బుకింగ్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు.

అయితే ప్రతి రైలులోనూ ఖాళీ బెర్త్ అందుబాటులో ఉంటుందని హామీ లేదు. ప్రయాణ తేదీ, రైలు, మార్గం, క్యాన్సిలేషన్లు, ఖాళీగా ఉన్న బెర్త్‌లను బట్టి కరెంట్ బుకింగ్ అవకాశం మారుతుంది. అందుకే చివరి నిమిషంలో ప్రయాణం చేయాల్సి వస్తే టికెట్ లభ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించడం మంచిది.

Follow Us