AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడుతున్నారా? భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే!

జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపించగానే సొంతంగా యాంటీబయాటిక్స్ తీసుకోవడం ప్రమాదకరం. వైరల్ ఇన్ఫెక్షన్లకు ఇవి పనిచేయవు. వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడితే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌తో పాటు దుష్ప్రభావాలు, తప్పు మోతాదు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడుతున్నారా? భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే!
Antibiotics Without Doctor Prescription
Janardhan Veluru
|

Updated on: Sep 30, 2026 | 3:56 PM

Share

జలుబు, జ్వరం, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపించగానే చాలామంది సొంత వైద్యం మొదలుపెట్టేస్తారు. డాక్టర్‌ను సంప్రదించకుండానే తమకు తెలిసిన ఏవో యాంటీబయాటిక్స్ తీసుకుంటుంటారు. ఇంట్లో గతంలో మిగిలిపోయిన మందులను కూడా వైద్యుడి సలహా లేకుండా మళ్లీ ఉపయోగించే సందర్భాలు ఉన్నాయి. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, సమాజానికి కూడా తీవ్రమైన సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని ఇంటెర్నల్ మెడిసిన్ వైద్య నిపుణుడు డాక్టర్ పల్లవ్ మిశ్రా హెచ్చరిస్తున్నారు. యాంటీబయాటిక్స్ మందులు కొన్ని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను చికిత్స చేయడంలో కీలకమైనవి. అయితే సరైన ఇన్ఫెక్షన్‌కు, సరైన మోతాదులో, వైద్యుల సూచన మేరకు మాత్రమే వీటిని ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

సాధారణ జలుబు, ఫ్లూ, అనేక రకాల గొంతు నొప్పులు వైరస్‌ల వల్ల వస్తాయి. ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్లపై యాంటీబయాటిక్స్ ప్రభావం చూపవు. అయినప్పటికీ లక్షణాలు కనిపించిన వెంటనే యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల శరీరంలోని బ్యాక్టీరియా ఈ మందులకు అలవాటు పడే అవకాశం ఉంటుంది. దీన్నే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు. అంటే భవిష్యత్తులో కొన్ని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు సాధారణంగా ఉపయోగించే మందులు పనిచేయని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఇన్ఫెక్షన్ల చికిత్స మరింత కష్టతరమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఖరీదైన లేదా ఎక్కువ శక్తివంతమైన మందులు వాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. తీవ్రమైన పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాల్సిన పరిస్థితి కూడా ఎదురయ్యే ప్రమాదముంది.

వైద్యుడి సలహా లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకునేటప్పుడు సరైన మందును ఎంచుకోకపోవడం, తప్పు మోతాదు తీసుకోవడం, సరైన టైమ్‌లో కాకుండా మరో టైమ్‌లో తీసుకోవడం లేదా సూచించిన వ్యవధి పూర్తికాకముందే మందులను ఆపేయడం వంటి తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. లక్షణాలు కొంతవరకు తగ్గినంత మాత్రాన ఇన్ఫెక్షన్ పూర్తిగా నయమైందని భావించకూడదు. వైద్యుడు సూచించిన విధంగానే యాంటిబయాటిక్ మందులను తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

పాత యాంటీబయాటిక్స్‌ను మళ్లీ వాడొద్దు

గతంలో అనారోగ్య సమయంలో మిగిలిపోయిన యాంటీబయాటిక్స్‌ను మరోసారి ఉపయోగించడం కూడా సరికాదని డాక్టర్ మిశ్రా సూచిస్తున్నారు. ప్రస్తుత అనారోగ్యానికి కారణం వేరే ఇన్ఫెక్షన్ కావచ్చు. అందువల్ల గతంలో ఉపయోగించిన మందు ఇప్పుడు పనిచేస్తుందని భావించడం ప్రమాదకరం. అలాగే ఇతరులకు సూచించిన యాంటీబయాటిక్స్‌ను సొంతంగా తీసుకోవడం లేదా తమ మందులను ఇతరులతో పంచుకోవడం కూడా చేయకూడదు.

దుష్ప్రభావాలు కూడా ఉండొచ్చు

యాంటీబయాటిక్స్ వల్ల కొందరిలో వికారం, విరేచనాలు, కడుపు నొప్పి, అలర్జీ వంటి దుష్ప్రభావాలు కనిపించే అవకాశముంది. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు కూడా సంభవించే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. యాంటీబయాటిక్స్ పేగుల్లో ఉండే సాధారణ బ్యాక్టీరియా సమతుల్యతను ప్రభావితం చేసే అవకాశముంది. ఇతర మందులు ఉపయోగిస్తున్న వారికి కొన్ని సందర్భాల్లో డ్రగ్ ఇంటరాక్షన్స్ సమస్య కూడా ఉండొచ్చు.

యాంటీబయాటిక్స్‌ను సురక్షితంగా ఎలా వాడాలి?

స్నేహితులు, కుటుంబ సభ్యుల సూచనలు, పాత ప్రిస్క్రిప్షన్లు లేదా ఆన్‌లైన్‌లో కనిపించే సిఫార్సుల ఆధారంగా యాంటీబయాటిక్స్ తీసుకోకూడదు. వైద్యుడు సూచించినప్పుడు మాత్రమే, ఆయన చెప్పిన మోతాదు,  సమయానికి అనుగుణంగా మందులను ఉపయోగించాలి.

మందులు తీసుకున్న తర్వాత దుష్ప్రభావాలు కనిపించినా, అనారోగ్య లక్షణాలు తగ్గకపోయినా సొంతంగా మందులను మార్చడం లేదా నిలిపివేయడం కాకుండా వైద్యుడిని సంప్రదించాలి.

ప్రతి జ్వరం, దగ్గు లేదా గొంతు నొప్పికి యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు. ఇన్ఫెక్షన్‌కు కారణం ఏమిటో తెలుసుకున్న తర్వాతే సరైన చికిత్సను ఎంచుకోవాలి.

యాంటీబయాటిక్స్‌ను పూర్తిగా నివారించడం కాదు.. అవసరమైనప్పుడు, సరైన మందును, సరైన మోతాదులో, వైద్యుల సూచన మేరకు బాధ్యతాయుతంగా యాంటీబయాటిక్ వినియోగించాలి.

Follow Us