AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack: ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు లక్షణాలు కనిపిస్తే.. ఏం చేయాలి? ఏం చేయకూడదు?

Heart Attack Alone: ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు లక్షణాలు కనిపిస్తే భయపడకుండా వెంటనే స్పందించడం చాలా ముఖ్యం. ఛాతిలో నొప్పి లేదా ఒత్తిడి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చల్లటి చెమటలు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తే అవి తగ్గుతాయేమోనని వేచి చూడకూడదు. లక్షణాలకు కారణమేంటో మీరే తెలుసుకునే ప్రయత్నంలో విలువైన సమయాన్ని వృథా చేయకుండా వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి. గుండెపోటు అనుమానం ఉన్నప్పుడు ప్రతి నిమిషం కీలకమని ముంబైకి చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ పారిన్ సాంగోయి సూచిస్తున్నారు.

Heart Attack: ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు లక్షణాలు కనిపిస్తే.. ఏం చేయాలి? ఏం చేయకూడదు?
Heart Attack Symptoms
Janardhan Veluru
|

Updated on: Sep 29, 2026 | 4:54 PM

Share

ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు గుండెపోటు లక్షణాలు కనిపిస్తే..ఆ క్షణాలు చాలా భయానకంగా మారుతాయి. గుండెపోటు లక్షణాలు కనిపిస్తే.. మొదటి కొన్ని నిమిషాలు చాలా కీలకం. ఆ లక్షణాలు ఎందుకొస్తున్నాయో మీరే తెలుసుకునే ప్రయత్నం చేస్తూ విలువైన సమయం వృథా చేయడం సరికాదు. లక్షణాలు తీవ్రమయ్యే వరకు వేచి చూడకుండా.. వెంటనే అత్యవసర వైద్య సేవలకు కాల్ చేయాలి. ఈ టైమ్‌లో ప్రతి నిమిషం చాలా అమూల్యమైనదని గుర్తించాలని ముంబైకి చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ పారిన్ సాంగోయి సూచించారు.

కాసేపు ఆగితే.. గుండె నొప్పి దానంతటదే తగ్గిపోతుందేమో అని వేచి చూడటం కరెక్ట్ కాదు. గుండెపోటు లక్షణాలలో ఛాతీలో ఒత్తిడి లేదా బరువు అనిపించడం ఉంటుంది. కానీ, శ్వాస ఆడకపోవడం, చల్లటి చెమటలు, వికారం, తలతిరగడం లేదా చేయి, భుజం, వీపు, మెడ లేదా దవడలో అసౌకర్యం కూడా గుండెపోటు హెచ్చరిక సంకేతాలే అని డాక్టర్ సాంగోయి అన్నారు. గుండెపోటును సూచించే లక్షణాలు కనిపిస్తే, వెంటనే మీ స్థానిక అత్యవసర వైద్య సేవలకు కాల్ చేయాలి.

మీరు సహాయం కోసం కాల్ చేసిన తర్వాత, సురక్షితమైన చోట కూర్చోండి. అనవసరమైన కదలికలను నివారించండి. మీ ఫోన్‌ను మీ దగ్గరే ఉంచుకోవాలని డాక్టర్ సాంగోయి సూచించారు. వీలైతే, అత్యవసర సిబ్బంది త్వరగా లోపలికి రావడానికి తలుపును అన్‌లాక్ చేసి ఉంచండి. ఈ టైమ్‌లో మీరే డ్రైవింగ్ చేసుకుంటూ ఆసుపత్రికి వెళ్లడం సరైన నిర్ణయం కాదు.  వైద్య సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు, మీరే వెళ్లే ప్రయత్నం చేయకుండా కూర్చుని విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

యాంజినా కోసం మీకు నైట్రోగ్లిజరిన్ వంటి మందులు సూచించినట్లయితే, మీ డాక్టర్ ఇప్పటికే ఇచ్చిన సూచనల ప్రకారం మాత్రమే వాటిని తీసుకోండి. ముందుగా సహాయం కోసం కాల్ చేయండి. మందులు కోసం అత్యవసర కాల్‌ను ఆలస్యం చేయకూడదు అని డాక్టర్ సాంగోయి చెప్పారు. మందుల ద్వారా మీరే గుండెపోటును నయం చేసుకోవడానికి ప్రయత్నించడం కాదు, వీలైనంత త్వరగా వృత్తిపరమైన వైద్య సహాయం పొందాలి.

ఆస్పిరిన్ గుండెపోటు సమస్యకు ఉపయోగపడుతుంది. కానీ, ఇది అందరికీ సరిపడదు అని డాక్టర్ సాంగోయి వివరించారు. అత్యవసర ఆపరేటర్ లేదా డాక్టర్ మీకు ఆస్పిరిన్ తీసుకోవాలని సలహా ఇస్తే, మీకు ఆస్పిరిన్ అలర్జీ లేదా ఇతర సమస్యలు లేకపోతే వారి సూచనలను పాటించండి. ఇంట్లో పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించడం కంటే, త్వరగా వైద్య సహాయం పొందడమే ప్రాధాన్యత అని ఆయన అన్నారు.

గుండె అసౌకర్యం గ్యాస్, యాసిడిటీ లేదా ఆందోళన వల్ల వచ్చిందని భావించి వేచి ఉండటం అతి పెద్ద తప్పులలో ఒకటి. ఆ అసౌకర్యం యాసిడిటీ, గ్యాస్ లేదా ఆందోళన అని భావించి అది తగ్గిపోయే వరకు వేచి ఉండటం చాలా ప్రమాదకరమైన తప్పు అని డాక్టర్ సాంగోయి చెప్పారు. గుండెపోటు లక్షణాలు వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటాయి. ఇంట్లో ఉండి కారణాన్ని కచ్చితంగా గుర్తించడం సాధ్యం కాదు.

ఒంటరిగా ఉండి గుండెపోటు లక్షణాలను అనుభవిస్తున్నట్లయితే, డాక్టర్ సాంగోయి ఈ పనులు చేయొద్దని సలహా ఇచ్చారు:

* మీరే డ్రైవింగ్ చేసుకుంటూ ఆసుపత్రికి వెళ్లడం

* నడవడం లేదా వ్యాయామం చేయడం

* మీరే చాలా మందులు తీసుకోవడం

* లక్షణాలను తగ్గించడానికి ఇంట్లో చేసే చిట్కాలను ఉపయోగించడం

* అది నిజంగా గుండెపోటేనా అని ఆన్‌లైన్‌లో వెతకడానికి సమయం కేటాయించడం

* సహాయం కోసం వెతకడానికి ముందు లక్షణాలు తీవ్రమయ్యే వరకు వేచి ఉండటం

మీరు ఇంట్లో ఉండి ఆ తేడాను కచ్చితంగా గుర్తించలేరు అని డాక్టర్ సాంగోయి అన్నారు. ఒకవేళ స్పృహ కోల్పోయి, సాధారణంగా శ్వాస తీసుకోవడం ఆగిపోతే, సీపీఆర్ లేదా ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డిఫిబ్రిలేటర్ (అందుబాటులో ఉంటే) అవసరం కావచ్చు అని ఆయన చెప్పారు.

Follow Us