AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనాలో నయా ట్రెండ్.. వృద్ధ తల్లిదండ్రుల బాగోగుల కోసం ‘స్టాండ్-ఇన్’లు..

ఉద్యోగాలు, బిజీ లైఫ్‌స్టైల్‌ కారణంగా వృద్ధ తల్లిదండ్రులను చూసుకునేందుకు సమయం దొరకని చైనాలోని యువత.. తమకు బదులుగా ఇతరులను నియమించుకుంటున్నారు. వంట చేయడం, ఆస్పత్రికి తీసుకెళ్లడం, మందులు ఇవ్వడం, తోడుగా ఉండటం వంటి పనులకు ‘లైఫ్ స్టాండ్-ఇన్’ సేవలను ఉపయోగిస్తున్నారు. ఈ సేవలు వాడుకున్నందుకు గంటల లెక్కన చెల్లింపులు చేస్తున్నారు. చిన్న చిన్న పనుల నుంచి వృద్ధుల సంరక్షణ వరకు విస్తరిస్తున్న ఈ కొత్త ట్రెండ్‌ చైనాలో చర్చనీయాంశంగా మారింది.

చైనాలో నయా ట్రెండ్.. వృద్ధ తల్లిదండ్రుల బాగోగుల కోసం ‘స్టాండ్-ఇన్’లు..
China Old ParentsImage Credit source: Pexels
Janardhan Veluru
|

Updated on: Oct 06, 2026 | 3:03 PM

Share

ఓ వైపు ఉద్యోగం లేదా వ్యాపారం.. మరో వైపు వ్యక్తిగత జీవితం.. వీటి మధ్య బిజీగా మారిన ఈ రోజుల్లో ఇంటి బాధ్యతలకు సమయం కేటాయించడం చాలామందికి కష్టంగా మారుతోంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడం, వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడం, ఇంట్లో వంట చేయడం వంటి పనులకు సమయం దొరకని యువత ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. చైనాలో ఇలాంటి అవసరాల నుంచి ఓ కొత్త రకం సేవల మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోంది. దీనినే ‘స్టాండ్-ఇన్ ఎకానమీ’గా పిలుస్తున్నారు.

తమకు బదులుగా రోజువారీ పనులు చేసేందుకు డబ్బులు చెల్లించి వ్యక్తులను నియమించుకుంటున్నారు. వంట చేయడం, ఆస్పత్రికి వెళ్లి వృద్ధులను చూసుకోవడం, సరుకులు తీసుకురావడం వంటి పనులతో పాటు వృద్ధులతో కొంతసేపు మాట్లాడటం, వారికి తోడుగా ఉండటం వంటి సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. షెన్‌జెన్‌లో ఓ సర్వీస్ ప్రొవైడర్ వృద్ధులతో రెండు గంటలు గడపడం, వారికి వంట చేయడం వంటి సేవలకు 300 యువాన్లు (దాదాపు రూ.4300) వసూలు చేస్తున్నట్లు ఓ కథనం పేర్కొంది.

అయితే ఈ ‘స్టాండ్-ఇన్’ సేవలు వృద్ధుల సంరక్షణకే పరిమితం కాలేదు. రెస్టారెంట్లలో క్యూలో నిలబడటం, చెత్తను బయట వేయడం, పార్సిళ్లు తీసుకురావడం, పెంపుడు జంతువులకు ఆహారం ఇవ్వడం వంటి చిన్న చిన్న పనులను కూడా డబ్బులు తీసుకుని ఇతరులు చేస్తున్నారు. అంతేకాదు.. కొందరు వ్యక్తులు తమ తరఫున వాదించేందుకు కూడా ‘స్టాండ్-ఇన్’లను నియమించుకుంటున్నారు. గ్వాంగ్‌జౌకు చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్ వివాదాల కోసం 50 యువాన్లు, ప్రత్యక్షంగా వాదించేందుకు 188 యువాన్లు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే బెదిరింపులు, అప్పుల వసూళ్లు, శారీరక ఘర్షణలకు సంబంధించిన పనులను మాత్రం తాను అంగీకరించనని ఆయన స్పష్టం చేశారు.

రెడ్‌నోట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ సేవలకు సంబంధించిన పోస్టులకు భారీ స్పందన వస్తోంది. ఉదాహరణకు పెద్ద లెగో సెట్లను కొనుగోలు చేసినా వాటిని అమర్చేందుకు సమయం లేని వారు ప్రొఫెషనల్ బిల్డర్లను నియమించుకుంటున్నారు. ఇందుకు సాధారణంగా 200 నుంచి 1,000 యువాన్ల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం.. డబ్బు చెల్లించి సమయాన్ని ఆదా చేసుకోవాలనే ధోరణి చైనాలోని ‘లేజీ ఎకానమీ’ విస్తరణగా చూడవచ్చని చెబుతున్నారు. దీనివల్ల కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడటంతో పాటు వ్యక్తులకు తమ సమయాన్ని ఇతర ముఖ్యమైన పనులకు వినియోగించుకునే అవకాశం లభిస్తుంది.

అయితే ఈ సేవల్లో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలు కావడంతో మోసాలు, వ్యక్తిగత సమాచార దుర్వినియోగం, సేవ సరిగా అందకపోతే పరిష్కారం పొందడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబ్బు ఇచ్చి జీవితంలోని చిన్న చిన్న బాధ్యతలను ఇతరులతో చేయించుకోవడం వల్ల సమయం, స్వేచ్ఛ లభిస్తున్నప్పటికీ.. జీవితంలోని అనుభవాలను మనమే ఆస్వాదించే అవకాశం ఎక్కడో కోల్పోతున్నామా? అనే చర్చ కూడా చైనాలో మొదలైంది.

Follow Us