AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విహారయాత్రలో విషాదం.. ఏనుగు కింద నలిగి మహిళా పర్యాటకురాలు మృతి

కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొడగు జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రెండు ఏనుగుల మధ్య జరిగిన పోట్లాటలో, ఒక ఏనుగు కింద నలిగి తమిళనాడుకు చెందిన ఓ పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

విహారయాత్రలో విషాదం..  ఏనుగు కింద నలిగి మహిళా పర్యాటకురాలు మృతి
Elephant Fight
Balaraju Goud
|

Updated on: May 19, 2026 | 8:03 AM

Share

కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొడగు జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రెండు ఏనుగుల మధ్య జరిగిన పోట్లాటలో, ఒక ఏనుగు కింద నలిగి తమిళనాడుకు చెందిన ఓ పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

దుబారే ఏనుగుల శిబిరం వద్ద పర్యాటకుల సందడి నెలకొన్న వేళ ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడుకు చెందిన ఝాన్సీ (33) అనే మహిళ తన కుటుంబంతో కలిసి సోమవారం (మే 18) ఈ శిబిరాన్ని సందర్శించేందుకు వచ్చారు. ఆ సమయంలో మావటీలు ఏనుగులను స్నానం చేయించడానికి సమీపంలోని కావేరి నది వద్దకు తీసుకువచ్చారు. పర్యాటకులు ఆ దృశ్యాలను ఆసక్తిగా గమనిస్తుండగా, ఉన్నట్టుండి రెండు ఏనుగుల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ పోట్లాటలో ఒక ఏనుగు పట్టుతప్పి కింద పడిపోయింది. దురదృష్టవశాత్తు, అది నేరుగా అక్కడ నిలబడి ఉన్న ఝాన్సీపై పడింది.

ఏనుగు కింద నలిగి తీవ్రంగా గాయపడిన ఝాన్సీని వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, ఫలితం లేకపోయింది. ఆమె మార్గమధ్యలోనే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ప్రమాద సమయంలో ఆమె పక్కనే ఉన్న భర్త, కుమార్తె త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కళ్ల ముందే భార్య మరణించడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.

వన్యప్రాణుల శిబిరాల వద్ద పర్యాటకులు తగినంత దూరం పాటించాలని, ఏనుగుల వంటి భారీ జంతువుల ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై ఇప్పుడు చర్చ మొదలైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us