మీ ఇంట్లో తులసి చెట్టు ఉందా.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
భారతీయ సనాతన ధర్మంలో తులసికి ఇచ్చే స్థానం అద్వితీయం. ఇంటి ఆవరణలో తులసి కోట ఉంటే అది కేవలం ఒక మొక్క కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసమని మన విశ్వాసం. అయితే శతాబ్దాల నాటి ఈ సంప్రదాయం వెనుక మన పూర్వీకులు ఎంతటి ఆరోగ్య రహస్యాన్ని దాచిపెట్టారో మీకు తెలుసా? ఆధ్యాత్మికతకు శాస్త్రీయత తోడైతే అది తులసి మొక్కే.. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

భారతీయ సంస్కృతిలో తులసి మొక్క లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రాంగణంలో తులసి కోట, దానికి భక్తిశ్రద్ధలతో పోసే నీరు, సాయంత్రం వేళ వెలిగించే దీపం.. ఇవన్నీ మన జీవనశైలిలో అంతర్భాగం. అయితే ఆధునిక కాలంలో తులసిని కేవలం ఒక సంప్రదాయంగా మాత్రమే చూడకూడదు. ఇది ఒక గొప్ప ఔషధ భాండాగారం, సహజ సిద్ధమైన కీటక నివారిణి. అవును.. నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం కారణంగా స్వచ్ఛమైన గాలి దొరకడమే కష్టమవుతోంది. తులసి మొక్కకు గాలిలోని కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వంటి హానికరమైన వాయువులను గ్రహించి, అధిక మొత్తంలో ఆక్సిజన్‌ను విడుదల చేసే అద్భుత సామర్థ్యం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే, తులసి మొక్క మన ఇంటికి ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా పనిచేస్తుంది. దీని వల్ల శ్వాసకోస సంబంధిత అలర్జీలు తగ్గుముఖం పడతాయి.
ఆయుర్వేదంలో మూలికల రాణి
మతపరమైన ప్రాముఖ్యత పక్కన పెడితే, ఆయుర్వేద వైద్యంలో తులసికి అగ్రస్థానం ఉంది. దీనిని క్వీన్ ఆఫ్ హెర్బ్స్ అని పిలుస్తారు. ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ శరీరంలోని తెల్ల రక్త కణాల సామర్థ్యాన్ని పెంచి, రోగనిరోధక శక్తిని పటిష్టం చేస్తాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉన్నప్పుడు రెండు తులసి ఆకులను వేడి నీళ్లలో వేసి తాగితే లేదా నేరుగా నమిలితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని విషపూరిత పదార్థాలను తొలగిస్తాయి.
మానసిక ప్రశాంతత – స్ట్రెస్ బస్టర్
తులసి ఆకులలో అడాప్టోజెన్ అనే ప్రత్యేక గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో కార్టిసాల్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. తులసి మొక్క ఉన్న చోట గాలి పీల్చడం వల్ల లేదా తులసి టీ సేవించడం వల్ల నాడీ వ్యవస్థ శాంతిస్తుంది. మానసిక ఆందోళన, ఒత్తిడితో సతమతమయ్యే వారికి ఇది ఒక గొప్ప సహజ చికిత్స.
దోమల నివారణకు అద్భుత మార్గం
మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు దోమల ద్వారా ప్రబలుతుంటాయి. తులసి మొక్క నుండి వెలువడే ఒక రకమైన ఘాటైన సువాసన దోమలను, ఈగలను దరిచేరనీయదు. మీ కిటికీల దగ్గర లేదా బాల్కనీలో తులసి మొక్కలను ఉంచడం వల్ల రసాయనాలతో కూడిన మస్కిటో కాయిల్స్ వాడకం తగ్గించవచ్చు. ఇది పర్యావరణ హితమైన మార్గం కూడా.
వాస్తు శాస్త్రం – సానుకూల శక్తి
వాస్తు ప్రకారం తులసి మొక్క ఇంట్లో ఉండటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇది ఇంటికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది.
ఏ దిశలో ఉండాలి?: తులసి మొక్కను ఇంటికి ఈశాన్యం లేదా ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.
ప్రశాంతత: ఉదయం తులసి కోట చుట్టూ తిరగడం వల్ల లభించే స్వచ్ఛమైన గాలి, మనస్సును రోజంతా ఉల్లాసంగా ఉంచుతుంది.
తులసి కేవలం ఒక మొక్క కాదు.. అది ఒక జీవన విధానం. ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, పర్యావరణ శుద్ధతను ఒకేసారి అందించే తులసిని ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో పెంచుకోవడం నేటి అవసరం.
