Dussehra: దేశమంతా రాముడిని పూజిస్తే.. అక్కడ మాత్రం రావణుడిని కొలుస్తారు.. కారణం ఏంటంటే..?
దేశంలో రాముడి భక్తులకు కొదవలేదు. హిందువుల్లో యుగపురుషుడు శ్రీరాముడంటే ఆరాధించని వారుండరు. రామాలయం లేని గ్రామం కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఊర్లో తప్పకుండా రాముడి గుడి ఉంటుంది. దేశమంతా శ్రీరాముడికి పూజలు చేస్తారు. సీతను అపహరించుకువెళ్లిన రావణుడంటే..
దేశంలో రాముడి భక్తులకు కొదవలేదు. హిందువుల్లో యుగపురుషుడు శ్రీరాముడంటే ఆరాధించని వారుండరు. రామాలయం లేని గ్రామం కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఊర్లో తప్పకుండా రాముడి గుడి ఉంటుంది. దేశమంతా శ్రీరాముడికి పూజలు చేస్తారు. సీతను అపహరించుకువెళ్లిన రావణుడంటే దేశంలో అందరికీ శత్రువే. ప్రత్యేకంగా దసరా సందర్భంగా దేశ వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో రావణ దహనం కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేస్తుంటారు. అయితే దేశ వ్యాప్తంగా రాముడుని పూజిస్తున్నా.. దేశంలోని మూడు చోట్ల మాత్రం అక్కడి ప్రజలకు రావణుడే దేవుడు. దేశ ప్రజలంతా రాముడిని పూజిస్తే ఆ మూడు చోట్ల రావణుడినే భగవంతుడిగా కొలుస్తారంట. ఇది ఒకింత ఆశ్చర్యగా ఉన్నా ఇది నిజం. రావణుడంటే హిందువులు చాలామంది రాక్షసుడిగా చూస్తారు. శ్రీరాముడు భార్య సీతాదేవిని అపహరించుకు వెళ్లిపోవడంతో.. తిరిగి సీతను పొందేందుకు రాముడు రావణుడిని సంహరించాడని రామాయణం చెబుతోంది. అయితే శ్రీలంకలో మాత్రం అక్కడి ప్రజలు రావణుడిని దేవుడిగానే కొలుస్తారు. భారత్ లో మాత్రం రావణుడిని రాక్షసుడితో పోలుస్తారు. కొన్ని సందర్భాల్లో ఎంత పెద్ద తెలివైన వ్యక్తి, మంచి వాడైనా.. వారు చేసే పనులు వారిని విలన్ ను చేస్తాయనడానికి ఉదాహరణ రావణుడు. రాముడికి బదులు దేశంలోని ఆ మూడు ప్రాంతాల్లో రావణుడిని కొలవడానికి కారణాలు లేకపోలేదు. దానికి ఓ చరిత్ర ఉంది. అదెంటో తెలుసుకుందాం. చెడుపై విజయం సాధించినందుకు ప్రతీకగా దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా దసరా పండగ చేసుకుంటారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా విజయ దశమి రోజున సాయంత్రం ప్రజలంతా రావణ దహనం చేసి ఆనందిస్తారు. ఇది దేశంలో ఉన్న సంప్రదాయం. కానీ ఉత్తరప్రదేశ్ లోని రెండు చోట్ల, మహారాష్ట్రలోని ఒకచోట మాత్రం రావణ దహన కార్యక్రమం నిర్వహించరు. అంతేకాదు రావణుడిని దేవుడిగా పూజిస్తారు అక్కడి ప్రజలు.
మహారాష్ట్రలోని అకోలా జిల్లాలోని సంగోలా విలేజ్ లో దసరా రోజు రాక్షస రాజు రావణుడికి ఒక ప్రత్యేకమైన హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. దానిని ‘ఆరతి’ అని పిలుస్తారు. రావణుడి ఆశీర్వాదం వల్లే తాము ఉపాధి పొంద గలుగుతున్నామన్నది ఆప్రాంతంలో నివసించే ప్రజల విశ్వాసం. ఆయన వల్లనే తమకు జీవనోపాధి కలిగిందని, గ్రామంలో శాంతి, ఆనందానికి కారణం రావణుడేనని వాళ్లు కొన్నేళ్లుగా విశ్వసిస్తూ వస్తున్నారు. అంతేకాదు ఆ గ్రామం మధ్యలో 10 తలల రావణుడి ఎత్తైన రాతి విగ్రహం కూడా ఉంది. 300 సంవత్సరాల నుంచి దసరా రోజు ఆ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇస్తారు. దానిని చూడడం కోసం దేశ నలుమూలల నుంచి ప్రజలు ఆ గ్రామానికి చేరుకుంటారనడం అతిశయోక్తి కాదు.
ఇక ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఆ రాష్ట్రంలోని బిస్రాఖ్, బరాగావ్ అనే రెండు గ్రామాల్లో రావణ దహనం చేయరు. రావణ దహనాన్ని అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని బాగాపత్ జిల్లాలో ఉన్న బరాగావ్ గ్రామంలో రావణుడిని దైవంగా భావిస్తారు. అంతేకాదు ఈ గ్రామాన్ని రావణుడు గ్రామం అని కూడా పిలుస్తారు. రావణుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేసి శక్తి పొందాడని, తనతో శక్తిని తీసుకువచ్చేటప్పడూ అతడు ఈ గ్రామం గుండా వెళ్లినట్లు పురాణాలు చెబుతున్నాయి. అదే సమయంలో రావణుడు అంతటి శక్తిని భరించలేకపోవడంతో ఆ గ్రామంలోని ఒక రైతుకి ఇచ్చాడని, అతను ఆ శక్తిని నేలపై పెట్టినట్లు ఇక్కడి ప్రజలు చెబుతారు. దీంతో శక్తి రావణడుతో తిరిగి వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో ఏ ప్రదేశంలో శక్తి నెలపై ఉంచబడిందో అక్కడే మానసా దేవి ఆలయాన్ని నిర్మించి పూజించనట్లు ఆ ఆలయ పూజారి పూరాణ కథను వివరించారు. అందువల్లే ఆ గ్రామంలో నివాసితులు ఈ పండుగను జరుపుకోవడానికి నిరాకరిస్తారంట.
ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ నగర్ జిల్లాలోని బిస్రాఖ్ వాసులు కూడా దసరాను జరుపుకోరు. ఈ గ్రామంలో కూడా రావణ, మేఘనాథ్, కుంభకర్ణలను దహనం చేసేందుకు ఇక్కడి ప్రజలు ఒప్పుకోరు. పురాణల ప్రకారం… విశ్రవ రుషికి జన్మించిన రావణుడి బాల్యం బిస్రాఖ్‌లో జరిగిందని కొందరి విశ్వాసం. లంకేశ్వరుడైన రావణుడు తమ గ్రామంలో జన్మించాడని, గొప్ప శివభక్తుడైన రావణుడు పూజించిన ఆలయం మహంత్‌ని రావణ ఆలయంగా పిలుస్తామని ఆ గ్రామ వాసులు చెబుతారు. రావణుడిని తమ ఊరి బిడ్డగా నమ్ముతారు ఇక్కడి ప్రజలు. ఇలా దేశ వ్యాప్తంగా రాముడిని పూజిస్తూ.. దసరాలో రావణ సంహరం చేయని గ్రామాలు దేశంలో మూడు ఉన్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా ఈ గ్రామాల్లో ఇదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..