Adar Poonawalla: వచ్చే ఏడాది అందుబాటులో బూస్టర్ డోస్.. సీరం సీఈఓ పూనావాలా కీలక వ్యాఖ్యలు..
Adar Poonawalla on Covid booster shot: కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలు రాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. వ్యాక్సినేషన్‌లో భాగంగా దేశంలో వ్యాక్సిన్ డోసుల

Adar Poonawalla on Covid booster shot: కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలు రాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. వ్యాక్సినేషన్‌లో భాగంగా దేశంలో వ్యాక్సిన్ డోసుల పంపిణీ నేటితో 100 కోట్ల మార్క్ దాటింది. ఈ నేపథ్యంలో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పునావాలా బూస్టర్ డోస్‌పై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది బూస్టర్ డోస్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని పూనావాలా స్పష్టంచేశారు. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ 100 కోట్ల డోసులు పూర్తయిన సందర్భంగా అదర్ పూనావాలా ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. దేశంలో 100 కోట్ల డోసుల పంపిణీ ఒక కీలక మైలురాయంటూ సీరం ఇనిస్టిట్యూట్ సీఈఓ అదర్ పునావాలా పేర్కొన్నారు. రానున్న రెండు నెలల్లో టీకా పంపిణీ వేగం మరింత పుంజుకుంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు గురించి పలు విషయాలను పంచుకున్నారు. వచ్చే ఏడాది ప్రారంభానికి అవసరమైన వారికి బూస్టర్ డోసు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటూ పూనావాలా పేర్కొన్నారు.
నైతికంగా, మానవతా దృక్ఫథంతో ఆలోచిస్తే.. ప్రపంచ దేశాలకు మరీ ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు ముందుగా రెండు డోసుల వ్యాక్సిన్ అందాలంటూ పూనావాలా పేర్కొ్న్నారు. ఆఫ్రికా మొత్తం కనీసం మూడు శాతం మందికి కూడా టీకాలు అందలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇక్కడ మాత్రం రెండు డోసులు తర్వాత బూస్టర్ డోసు గురించి మాట్లాడుతున్నారన్నారు. అయితే వృద్ధులకు, ప్రమాదం పొంచి ఉన్న వారికోసం తగినన్నీ బూస్టర్ డోసులు అందుబాటులో ఉంచుతామంటూ పూనావాలా పేర్కొన్నారు. అయితే యువకులు, ఆరోగ్యవంతుల విషయంలో మిగిలిన ప్రపంచం రెండు డోసులు పొందేవరకు వేచి ఉండాల్సిందేనని అదర్ పూనావాలా పేర్కొన్నారు. ఇప్పుడున్న ఉత్పత్తి వేగంతో ఈ ఏడాది చివరి నాటికి రెండు డోసులు పొందిన వారి సంఖ్య మరింత పెరుగుతుందంటూ అభిప్రాయం వ్యక్తంచేశారు.
కాగా.. భారీ జనాభా గల భారతదేశంలో వేగవంతమైన వ్యాక్సినేషన్ ఘనత ప్రధాని నరేంద్రమోదీకే చెందుతుందంటూ అదర్ స్పష్టంచేశారు. 100 కోట్ల డోసుల పంపిణీ అతిపెద్ద మైలురాయే అయినప్పటికీ.. ప్రజలంతా కోవిడ్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కరోనా నుంచి రక్షణ కోసం మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని పూనావాలా స్పష్టంచేశారు. ఇంకా టీకా తీసుకోవాలంటూ ప్రచారం చేస్తూనే ఉండాలని.. అందరికీ అవగాహన కల్పిస్తూనే ఉండాలని పూనావాలా సూచించారు. కరోనా థర్డ్ వేవ్ గురించి మాట్లాడిన ఆయన.. సెకండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండదని అభిప్రాయపడ్డారు. దీంతోపాటు దేశంలో వైద్య సదుపాయాలు, సౌకర్యాలు పెరిగాయని తెలిపారు.
Also Read: