Supreme Court: సుప్రీంకోర్టులో బిల్కిస్ బానోకు చుక్కెదురు.. ఆ వ్యాజ్యాన్ని కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం..
తనపై అత్యాచారం చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ.. బిల్కీస్ బానో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఖైదీల విడుదల విషయంలో గుజరాత్ ప్రభుత్వం...

తనపై అత్యాచారం చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ.. బిల్కీస్ బానో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఖైదీల విడుదల విషయంలో గుజరాత్ ప్రభుత్వం నిబంధలను సడలించడాన్ని సవాల్ చేస్తూ బిల్కీస్ బానో దేశ అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు బిల్కిస్ తరఫు న్యాయవాదికి సుప్రీంకోర్టు సిబ్బంది సమాచారమిచ్చారు. గుజరాత్ ప్రభుత్వం 1992లో తీసుకొచ్చిన చట్టం ఆధారంగా 11 మంది దోషులు విడుదలయ్యారు. అ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో బిల్కీస్ బానో పిటిషన్ వేశారు. 2002లో గోద్రా రైలు దహనం ఘటన అనంతరం గుజరాత్‌లో అల్లర్లు చెలరేగాయి. ఆ సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం జరిగింది. అంతే కాకుండా ఆమె కుటుంబంలోని ఏడుగురిని దుండగులు హత్య చేశారు.
తనపై అమానుష దాడి జరుగుతున్న సమయంలో బిల్కిస్ బానో గర్భవతి. అయినా దుండగులు ఏ మాత్రం కనికరం చూపకుండా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సీబీఐ స్పెషల్ కోర్టు ఈ కేసులో 11 మంది నిందితులకు 2008లో జీవిత ఖైదు విధించింది. 15ఏళ్లు కారాగారంలో ఉన్న నిందితులు.. తాజాగా తమను విడుదల చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అతడి విజ్ఞప్తిని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే నిందితులందరికీ రెమిషన్ మంజూరు చేయాలని కమిటీ సభ్యులు సిఫార్సు చేశారు. ఆ సిఫార్సులను పరిగణలోకి తీసుకున్న సుప్రీం.. 1992 రెమిషన్ పాలసీ అమలుకు గుజరాత్ ప్రభుత్వానికి పర్మిషన్ ఇచ్చింది.
సుప్రీంకోర్టు అనుమతితో ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన వారిని మిఠాయిలు, పూలదండలతో ఘనంగా స్వాగతించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. దీంతో ఈ ఘటన అప్పుడూ, ఇప్పుడూ హాట్ టాపిక్ గా మారింది.




మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..



