New Delhi: సందట్లో సడేమియా.. వర్షాలను అడ్డుపెట్టుకుని చొరబడుతున్న ఉగ్రవాదులు..
భారత్‌లో విధ్వంసమే లక్ష్యంగా పనిచేసే పాకిస్తానీ ఉగ్రవాద శక్తులు అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవు. ఇప్పుడు తాజాగా ఉత్తరాదిన కురుస్తున్న భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణాన్ని అవకాశంగా మలచుకుని దేశంలోకి చొరబడే ప్రయత్నాలు సాగుతున్నాయి. నిఘా వర్గాలకు అందిన ఈ సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

భారత్‌లో విధ్వంసమే లక్ష్యంగా పనిచేసే పాకిస్తానీ ఉగ్రవాద శక్తులు అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవు. ఇప్పుడు తాజాగా ఉత్తరాదిన కురుస్తున్న భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణాన్ని అవకాశంగా మలచుకుని దేశంలోకి చొరబడే ప్రయత్నాలు సాగుతున్నాయి. నిఘా వర్గాలకు అందిన ఈ సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. గత కొద్ది రోజులుగా జమ్ము-కాశ్మీర్ సహా ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో సింధు నది సహా దాని ఉపనదులు రావి, సట్లెజ్, బియాస్ పొంగిపొర్లుతున్నాయి. వాటితో పాటు అనేక చిన్న నదులు, వాగులు కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. భౌగోళికంగా ఈ నదులు, ఉపనదులు, వాగులన్నీ భారత్ నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా ఆ దేశంలోకి ప్రవహిస్తున్నాయి. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను ఉగ్రవాదుల తయారీ కేంద్రంగా మార్చిన పాకిస్తాన్ ప్రభుత్వం, వారికి అధునాతన ఆయుధాలు సమకూర్చి, ఉగ్రవాద శిక్షణ అందజేస్తున్న విషయం ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయమే. కొన్నేళ్ల క్రితం భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి కొన్ని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినప్పటికీ, భారత్‌పైకి ఉగ్రవాదులను ఉసిగొల్పడమే తమ విధానంగా పెట్టుకున్న పాకిస్తాన్ ఎప్పటికప్పుడు కొత్త ఉగ్రవాద శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తోంది.
చలికాలం అనుకూలం..
పాకిస్తాన్ ఉగ్రవాదులు చలికాలాన్ని తమకు అనుకూలంగా మలచుకుని చొరబాట్లకు తెగబడుతుంటారు. ఆ సమయంలో హిమపాతానికి తోడు దట్టమైన పొగమంచు ఉత్తర భారతదేశం మొత్తం పరచుకుంటుంది. ఇక జమ్ము-కాశ్మీర్ వంటి హిమాలయ రాష్ట్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఎత్తైన హిమాలయాలు, వాటి మధ్యలో లోయలు, ఆ లోయల్లో ప్రవహించే నదులు చూడ్డానికి ఎంత అందంగా ఉంటాయో, పహారా కాయడానికి అన్ని సవాళ్లు విసురుతుంటాయి. గుజరాత్ నుంచి రాజస్థాన్ మీదుగా పంజాబ్ వరకు భారత్ – పాకిస్తాన్ దేశాలను విభజించే అంతర్జాతీయ సరిహద్దుల్లో పహారా బాధ్యతల్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) నిర్వహిస్తుంది. ఏ క్షణం పరిస్థితి ఉద్రిక్తంగా మారినా రంగంలోకి దిగేందుకు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాలు సిద్ధంగా ఉంటాయి. అయితే జమ్ము-కాశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దును దాటి పాకిస్తాన్ కాశ్మీర్‌లోకి చొచ్చుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)గా మన దేశం వ్యవహరిస్తోంది. ఇక్కడ ఉన్న భద్రతాపరమైన సవాళ్ల నేపథ్యంలో ఎల్వోసీ వెంట పహారా బాధ్యతల్ని ఆర్మీలో ప్రత్యేక విభాగమైన రాష్ట్రీయ రైఫిల్స్ నిర్వహిస్తుంది. వారికి మద్దతుగా రెండో అంచెలో బీఎస్ఎఫ్ సహా వివిధ రకాల పారామిలటరీ బలగాలు ఉంటాయి. సరిహద్దుల వెంట వీలున్నంత వరకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసినప్పటికీ, జమ్ము-కాశ్మీర్‌లో చాలా భాగం భౌగోళికంగా ఎత్తైన హిమాలయ శ్రేణులు ఉండడం వల్ల అంతటా ఫెన్సింగ్ ఏర్పాటు చేయలేదు. పైగా నదులు, వాగులు ఉన్న చోట ఫెన్సింగ్ ఎలాగూ సాధ్యం కాదు.
సరిగ్గా ఈ పరిస్థితినే ఉగ్రవాద మూకలు తమకు అనుకూలంగా మలచుకుంటాయి. భద్రతా బలగాలు కనుచూపు మేర వరకు సరిహద్దుల్లో కదలికలను పసిగడుతూ నిర్విరామంగా పనిచేస్తుంటాయి. అయితే దట్టమైన మంచు కురిసినప్పుడు, పొగ మంచు ఆవరించినప్పుడు ఎదురుగా నిలబడ్డ మనిషే కనిపించని పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకుని ఉగ్రవాదులు చొరబాట్లకు తెగబడుతుంటారు. అయితే భారత ప్రభుత్వం పహారా కాసే బలగాల వద్ద అధునాత పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. ఇన్‌ఫ్రా రెడ్ కెమెరాలు, థర్మల్ కెమేరాలను ఉపయోగించి మనుషుల కదలికలపై నిఘా కొనసాగిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట కన్నుగప్పి చొరబడ్డ ఉగ్రవాదులు కాశ్మీర్ లోయలో భద్రతా బలగాలపై హింసకు పాల్పడుతుంటారు.




వర్షమూ వారికి వరమే..
భారత ద్వీపకల్పం మాదిరిగా వింధ్యా, సాత్పూరా పర్వతాల ఎగువ భాగాన వాతావరణం ఉండదు. ముఖ్యంగా ఉత్తర భారతదేశం, హిమాలయ రాష్ట్రాల్లో రెండే రెండు కాలాలుంటాయి. ఒకటి వేసవి, రెండోది చలికాలం. వర్షాలు అడపాదడపా కురుస్తుంటాయి. రుతుపవనాలు చురుగ్గా ఉన్న సమయంలో జూన్, జులై మాసాల్లో ఈ వర్షాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. అయితే ఈసారి నెల రోజుల వ్యవధిలో కురవాల్సిన వర్షాలు రోజుల వ్యవధిలో కురుస్తుండడం, వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో.. ఉగ్రవాదులు ఈ ప్రతికూల వాతావరణాన్ని కూడా తమకు అనువుగా మార్చుకుంటున్నారు. వర్షంలో థర్మల్ కెమెరాలు, ఇన్‌ఫ్రా రెడ్ కెమేరాలు కూడా సరిగా పనిచేయవు. దాంతో సరిహద్దుల వెంట మనుషుల కదలికలు గుర్తించడం కష్టంగా ఉంటుంది. పైగా ఉధృతంగా ప్రవహించే నదులు, వాగుల వెంట బురద రంగులో కలిసిపోయే దుస్తులతో ఉగ్రవాదులు చొరబడుతుంటారు. తాజాగా వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు ఇటు భారత్‌తో పాటు అటు పాకిస్తాన్‌ను కూడా అతలాకుతలం చేస్తుంటే, ఇలాంటి ప్రతికూల వాతావరణంలో ఉగ్రవాదులు చొరబాట్లను మరింత పెంచారు. జమ్ములోని వివిధ సెక్టార్లలో ఉగ్రవాదుల చొరబాట్లను భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నాయి.
జమ్ము-కాశ్మీర్‌లోని సాంబా, కథువా, జమ్మూ ప్రాంతాల నుంచి నదులు, ఉపనదులు, వాగులు, ఇతర ప్రవాహాలు కలుపుకుని దాదాపు 200 వరకు పాకిస్తాన్‌కు వెళ్తున్నాయి. చీనాబ్, ఉజ్, బసంతర్ ప్రధానంగా ఈ ప్రవాహాల్లో పెద్దవి. రాజోరి, పూంచ్ జిల్లాల్లోని నదులు, వాగులు కూడా పాకిస్థాన్‌కు వెళ్తాయి. గత రెండేళ్లుగా ఈ ఐదు జిల్లాల నుంచి అత్యధికంగా చొరబాటు ప్రయత్నాలు జరిగాయి. గత రెండు నెలల్లోనే పలు ప్రయత్నాలను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. మే 12-13 తేదీల్లో జీ-20 సమావేశాలను టార్గెట్ చేస్తూ భారత్‌లో విధ్వంసాలు సృష్టించేందుకు కాశ్మీర్‌లోని ఉరి సెక్టార్ నుంచి చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జూన్ 12-13 తేదీల్లో కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్ వద్ద చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జూన్ 22, 23 తేదీల అర్థరాత్రి సమయంలో ఇదే ప్రాంతంలో మరో నలుగురు చొరబడేందుకు యత్నించి భద్రతా బలగాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. జూన్ 24-25 తేదీల్లో పూంచ్ సెక్టార్ నుంచి చొరబాటుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. ఈ తరహా ప్రయత్నాలు ప్రస్తుత ప్రతికూల వాతావరణంలో మరింత పెచ్చుమీరతాయని నిఘా విభాగం హెచ్చరించింది. ఈ ప్రాంతంలో నియంత్రణ రేఖ, సరిహద్దుల నుంచి ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




