Alappuzha: కేరళ అలప్పుజలో టెన్షన్.. గంటల వ్యవధిలో ఇద్దరు రాజకీయ నాయకుల హత్య..
Alappuzha political murders: కేరళలో రాజకీయ దుమారం చెలరేగింది. రాష్ట్రంలోని అలప్పుజ జిల్లాలో రాజకీయ నాయకుల వరుస హత్యలు కలకలం
Alappuzha political murders: కేరళలో రాజకీయ దుమారం చెలరేగింది. రాష్ట్రంలోని అలప్పుజ జిల్లాలో రాజకీయ నాయకుల వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. దీంతో అలప్పుజ జిల్లాలో పోలీసులు 144 సెక్షన్ జారీ చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శనివారం రాత్రి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) రాష్ట్ర కార్యదర్శి కేఎస్ షాన్‌ను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. రాత్రి పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న షాన్నుకారులో వెంబడించిన దుండగులు.. ఆ తర్వాత కారుతో ఢీ కొట్టారు. కింద పడిపోయిన ఆయన్ను వారంతా తీవ్రంగా కొట్టారు. అనంతరం తీవ్రంగా గాయపడిన షాన్‌ను కొచ్చిలోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు.
ఇదిలాఉంటే.. షాన్ ఘటన జరిగిన 12 గంటల వ్యవధిలోనే మరో పార్టీకి చెందిన కీలక నేత హత్యకు గురయ్యారు. కేరళ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాస్‌ను దుండగులు హత్య చేశారు. ఆదివారం ఉదయం ఆయన ఇంట్లోకి కొందరు దుండగులు ప్రవేశించి శ్రీనివాస్‌ను దారుణంగా హత్య చేశారు. షాన్ మృతికి ప్రతీకారంగానే ఈ హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా.. ఈ వరుస హత్యల ఘటనలతో అలప్పుజ జిల్లాలో ఒక్కసారిగా పరిస్థితులు వేడెక్కాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లా అంతటా ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
వరుస హత్యల ఘటనల్ని సీఎం పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Also Read: