హనుమకొండ జిల్లాలో కోర్టు భవనాల సముదాయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హనుమడు, కొండడు శిలను సీజేఐ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. ఫ్యామిలీ కోర్టు, ఫోక్సో కోర్టు భవనాలు ఆయన ప్రారంభించారు. ప్రారంభోత్సవ సమయంలో భరత న్యాటంతో ఆకట్టుకున్న కళాకారులను ఎన్వీరమణ శాలువా కప్పి సత్కరించారు. కాళోజీ నారాయణ రావు కవితలను చదివి వినిపించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. తెలుగులో మాట్లాడటం గర్వంగా ఉందన్నారు. ఓరుగల్లుతో తనకు ఎంతో విడదీయరాని బంధం ఉందని తెలిపారు. ప్రగతిశీల ఉద్యమాలకు పుట్టినిల్లు ఓరుగల్లంటూ ఎన్వీ రమణ కొనియాడారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన నేల అని ఎన్వీరమణ చెప్పారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి శతకాన్ని ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ గుర్తు చేశారు. తెలుగు కవుల ఔనత్యాన్ని చాటి చెప్పారు. తెలంగాణలోని ఆలయాల చరిత్రను కొనియాడారు. శిధిలావస్థలో ఉన్న కోర్టును పునరుద్ధరించాలని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వాలు గమనిస్తాయని ఆశించారు సీజేఐ ఎన్వీ రమణ.
కోర్టు భవనాల సముదాయం కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, హైకోర్టు న్యాయమూర్తి నవీన్ రావు పాల్గొన్నారు. అంతకు ముందుకు కార్యక్రమానికి వచ్చిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు హైకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు న్యాయమూర్తులు, వరంగల్ జిల్లా జడ్జి, న్యాయవాదులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం జస్టిస్ రమణ దంపతులు వరంగల్ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఎన్వీ రమణ దంపతులు.
Read Also…. ఆదివారం సూర్యుడి అనుగ్రహం పొందాలంటే ఇలా చేయండి.. అదృష్టం మీ వెంటే ఉంటుంది..