AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Governor Delhi Tour: మరికాసేపట్లో అమిత్ షా‌తో గవర్నర్ భేటీ.. తెలంగాణలో మరింత హీట్ పెంచిన తమిళిసై ఢిల్లీ టూర్

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రెండో రోజు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నిన్న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన గవర్నర్.. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతున్నారు.

Governor Delhi Tour: మరికాసేపట్లో అమిత్ షా‌తో గవర్నర్ భేటీ.. తెలంగాణలో మరింత హీట్ పెంచిన తమిళిసై ఢిల్లీ టూర్
Governor Tamilisai
Balaraju Goud
|

Updated on: Apr 07, 2022 | 10:53 AM

Share

Governor Delhi Tour: తెలంగాణ(Telangana) గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Tamilisai Soundararajan) రెండో రోజు దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో పర్యటిస్తున్నారు. నిన్న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన గవర్నర్.. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతున్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. బుధవారం అమిత్ షాతో అపాయింట్ మెంట్ ఖరారు కాకపోవడంతో ఢిల్లీలోనే తమిళిసై ఉన్నారు. ఈరోజు అమిత్ షాను ఆమె కలవనున్నారు. ముఖ్యంగా ప్రగతి భవన్, రాజభవన్‌కు మధ్య పెరగుతున్న అగాధం గురించి ఆమె అమిత్ షాకు వివరించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర గవర్నర్ పట్ల కనీసం ప్రొటోకాల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పాటించడం లేదని ఫిర్యాదు చేయనున్నారు.

వ్యాక్సినేషన్ ను వేగవంతంగా పూర్తి చేసినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపేందుకు కలిశానని తమిళిసై చెప్పినప్పటికీ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మోదీకి వివరించినట్లు సమాచారం. ఢిల్లీలో ప్రధానితో భేటీ అయిన తర్వాత తమిళిసై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని, లేడీ గవర్నర్ అని అవమానిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్‌కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వడం లేదని, వ్యక్తిగతంగా తనను అవమానించినా భరిస్తానని, కానీ రాజ్యాంగపరంగా గవర్నర్ కార్యాలయానికి మర్యాద ఇవ్వాలన్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనులను తాను అభినందించానని, చేయాల్సిన విషయాలపై ప్రభుత్వానికి సూచనలు చేశానని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అయితే ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య గ్యాప్‌ లేదంటున్నారు మంత్రి జగదీష్‌రెడ్డి. మహిళగా అయినా గవర్నర్‌గా అయినా తాము గౌరవిస్తాని తెలిపారు. రాజకీయ రంగం కూడా సేవ రంగమే అని గవర్నర్ గుర్తించాలన్నారు. రాజ్యాంగ పదవుల పట్ల తమ ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందన్నారు. ప్రోటోకాల్ లోపాలపై గవర్నర్ ఇప్పుడెందుకు స్పందిస్తున్నారని ప్రశ్నించారు.

ఇదిలావుంటే, రిపబ్లిక్‌ డే నుంచి ఉగాది వేడుకల వరకు తెలంగాణ గవర్నర్‌, ప్రభుత్వం మధ్య విభేదాలు ఉన్నట్టు బయటపడింది. ప్రభుత్వం నిర్వహించిన కొన్ని కార్యక్రమాల్లో గవర్నర్‌ కనిపించకపోవడం, కొన్ని చోట్ల ఆహ్వానం లేకపోవడంతో గవర్నర్ బహిరంగంగానే తన అసహనాన్ని వెల్లగక్కారు. ప్రొటోకాల్‌ పాటించడం లేదని, తనకు, తన పదవికి తగిన గౌరవం ఇవ్వడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో అటు ప్రగతిభవన్‌కు, ఇటు రాజ్‌భవన్‌కు మధ్య గ్యాప్‌ పెరిగిందనే విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ తమిళిసై ఢిల్లీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.

మొత్తంగా చూస్తే.. గవర్నర్‌ ఢిల్లీ పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి? గవర్నర్‌తో ప్రభుత్వం సర్దుకుపోతుందా? లేక గ్యాప్‌ అలాగే కంటిన్యూ అవుతుందా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

Read Also… XE Variant Symptoms: కరోనా వైరస్ XE వేరియంట్ ఏమిటి, తీవ్రత ఏ స్థాయిలో ఉంది.. దాని లక్షణాలు ఎలా ఉంటాయి?