CM KCR: ఢిల్లీపై కన్నేసిన కేసీఆర్.. ఆ రెండు పార్టీలు మినహా విపక్షాలను ఏకం చేసేందుకు మాస్టర్ ప్లాన్
చండీఘడ్ పర్యటనలో బీజేపీపై విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వకుండా కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు.
CM KCR Delhi – Punjab Tour: బీజేపీకి వ్యతిరేకంగా.. కాంగ్రెసేతర విపక్షాలను ఏకం చేసే పనిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీ బిజీగా ఉన్నారు. ఢిల్లీ, పంజాబ్ పర్యటనలో ఉన్న సీఎం కే చంద్రశేఖర్ రావు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నివాసంలో ఆప్ నేతలతో భేటీ అయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎలాంటి పోరాటం చేయాలన్న విషయంపై కేసీఆర్ ఆప్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. అంతకుముందు చండీఘడ్ పర్యటనలో బీజేపీపై విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వకుండా కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. పొలాల్లో కరెంట్ మీటర్లు బిగించాలని ఒత్తిడి చేస్తోందంటూ విమర్శించారు. ప్రాణం పోయినా సరే మీటర్లు పెట్టేది లేదని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినట్టు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల అయినప్పటికి రైతుల కష్టాలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు కేసీఆర్. రైతులకు మేలు చేయాలని ఎవరైనా సీఎం ప్రయత్నిస్తే కేంద్రం అడ్డుకుంటోందని విమర్శించారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన పంజాబ్ రైతులకు బీజేపీ దేశద్రోహులుగా, ఖలిస్తాన్ ఉగ్రవాదులుగా చిత్రీకరించిందంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
రైతుల ఉద్యమం యూపీ , పంజాబ్ , హర్యానా , ఢిల్లీ రాష్ట్రాలకే కాదు దేశవ్యాప్తంగా విస్తరించాలని రైతు సంఘాలకు పిలుపునిచ్చారు కేసీఆర్. ఈ కార్యక్రమంలో పంజాబ్, ఢిల్లీ, తెలంగాణ సీఎంలు ఒకే వేదికపై కనిపించారు. అమర జవాన్ల కుటుంబాలకు, ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్ చెక్కులు పంపిణీ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..