Caste Census: కులగణనపై ఎవరి లెక్కలు వారివే.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ కౌంటర్..

తెలంగాణ కులగణన సర్వే దేశ రాజకీయాల్లోనూ ప్రకంపనలు రేపుతోంది. కాంగ్రెస్‌, బీజేపీ మధ్య వార్‌కు దారి తీస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మంటలు రేపుతోంది. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేస్తుంటే.. ఓబీసీలను చీల్చే కుట్ర జరుగుతోందని మోదీ ఆరోపించడం పొలిటికల్‌గా హీట్‌ పెంచుతోంది.

Caste Census: కులగణనపై ఎవరి లెక్కలు వారివే.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ కౌంటర్..
Pm Modi Rahul Gandhi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 10, 2024 | 11:40 AM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే కొనసాగుతోంది. ఈ కులగణన సర్వేలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచారాన్ని సమగ్రంగా సేకరిస్తున్నారు. 56 ప్రధాన, 19 అనుబంధ ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ప్రశ్నలతో సర్వేలో సమగ్ర సమాచారాన్ని తీసుకుంటున్నారు అధికారులు. అయితే.. తెలంగాణలో జరుగుతున్న కులగణన సర్వే ఇప్పుడు దేశవ్యాప్తంగా కాక రేపుతోంది. కులగణన విషయంలో ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మధ్య పొలిటికల్‌ ఫైట్‌ నడుస్తోంది. ప్రధానంగా.. తెలంగాణ కులగణనను కాంగ్రెస్‌ ఘనతగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రాహుల్‌. కులగణనను కేంద్రం దేశమంతా అమలు చేయాలనే డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు. ఈ క్రమంలోనే.. జార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీలు, ఓబీసీలకు కులగణనతోనే న్యాయం జరుగతుందని స్పష్టం చేశారు. కులగణనను మోదీ అడ్డుకోలేరని, పార్లమెంట్‌ తప్పకుండా ఆమోదిస్తుందన్నారు రాహుల్‌గాంధీ.

అంతకుముందు.. తెలంగాణ కులగణన సర్వేపై రాహుల్‌గాంధీ ఆసక్తికర ట్వీట్ కూడా చేశారు. టీవీ9 వీడియోను షేర్ చేసిన రాహుల్‌.. ప్రధాని మోదీజీ తెలంగాణలో కులగణన మొదలైందంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. దేశంలో సమగ్ర కులగణన చేపట్టడం బీజేపీకి ఇష్టం లేదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా జరగబోయే కులగణనను మీరు ఆపలేరన్నారు. ఈ పార్లమెంట్‌లోనే కులగణన బిల్లును ఆమోదించి.. రిజర్వేషన్లపై 50శాతం గోడను బద్దలు కొడతామని ట్వీట్‌లో పేర్కొన్నారు రాహుల్‌గాంధీ.

ప్రధాని మోదీ కౌంటర్..

ఇక.. కులగణన విషయంలో రాహుల్‌గాంధీ చేస్తున్న కామెంట్స్‌కు ప్రధాని మోదీ కౌంటర్‌ ఇచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ దేశానికి పదేళ్లుగా ఒక ఓబీసీ ప్రధాని సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. అయితే.. ఒక ఓబీసీ.. ప్రధానిగా ఉండటాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందని మోదీ ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసం ఓబీసీ సమైక్యతను కాంగ్రెస్‌ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుందని.. ఓబీసీలను చిన్నచిన్న కులాలుగా విభజించాలని కుట్ర చేస్తుందని మండిపడ్డారు ప్రధాని మోదీ.. కాంగ్రెస్ హామీలను నమ్మోద్దని.. కులాల పేరుతో రాజకీయాలు చేస్తుందంటూ కౌంటర్ ఇచ్చారు.

మొత్తంగా.. కులగణన విషయంలో కాంగ్రెస్‌- బీజేపీ నేతలు ఎవరి లెక్కలు వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కులగణనను కాంగ్రెస్‌ ఘనతగా రాహుల్‌ చెప్తుంటే.. ఓబీసీలో కాంగ్రెస్‌ పార్టీ చిచ్చు పెడుతోందని ప్రధాని మోదీ పరోక్షంగా కౌంటర్లు ఇస్తున్నారు. ఏదేమైనా.. తెలంగాణలో జరుగుతున్న కులగణన సర్వే.. దేశవ్యాప్తంగా పొలిటికల్‌ ఫైట్‌కు దారితీస్తోంది.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..