Vehicle Insurance: అద్దె వాహనాల ఇన్సూరెన్స్‌ విషయంలో సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు..!

Vehicle Insurance: మీరు సెకండ్‌ హ్యాండ్‌ వాహనాన్ని కొనుగోలు చేశారా..? లేదా ఎవరి దగ్గరినైనా వాహనాన్ని అద్దెకు తీసుకుని నడుపుతున్నారా..? అలా అయితే ఓ విషయాన్ని గుర్తించుకోవాలి..

Vehicle Insurance: అద్దె వాహనాల ఇన్సూరెన్స్‌ విషయంలో సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jul 24, 2021 | 1:59 PM

Vehicle Insurance: మీరు సెకండ్‌ హ్యాండ్‌ వాహనాన్ని కొనుగోలు చేశారా..? లేదా ఎవరి దగ్గరినైనా వాహనాన్ని అద్దెకు తీసుకుని నడుపుతున్నారా..? అలా అయితే ఓ విషయాన్ని గుర్తించుకోవాలి. మీరు సెకండ్‌ హ్యాండ్‌ వాహనం కొనుగోలు చేసిన తర్వాత మీ పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటారు. కానీ బీమా పాలసీలో ఎటువంటి మార్పులు చేయకపోతే వాహనం ఏదైనా ప్రమాదానికి గురైతే ఇన్సూరెన్స్‌ క్లయిమ్‌ లభించదు. వాహనం ప్రమాదానికి గురైతే అప్పుడు వాహనానికి జరిగిన నష్టం, బీమా కవరేజీ మీకు లభించదు. ఎందుకంటే వాహనం మీ పేరుమీద ఉన్నా.. బీమా పాలసీ మాత్రం మీకు విక్రయించిన వ్యక్తి పేరు ఉండటంతో క్లయిమ్‌ చేసుకునే అవకాశం మీకు ఉండదు. ఈ నేపథ్యంలో వాహనం బదిలీ విషయంలో, అద్దె వాహనాల విషయంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

అద్దెకు తీసుకున్న వాహనాలకు కూడా బీమా వర్తిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఇన్సూరెన్స్ కంపెనీలే పరిహారం చెల్లించి ఇందుకు బాధ్యత వహించాలని తాజా తీర్పులో వెల్లడించింది. రిజిస్టర్డ్ యజమాని నుంచి రవాణా సంస్థ వాహనాన్ని అద్దెకు తీసుకుంటే, వాహనంతో పాటు ఇన్సూరెన్స్ కూడా బదిలీ అవుతుందని స్పష్టం చేసింది. వ్యక్తి సమర్థవంతమైన నియంత్రణ, ఆదేశం ఆధారంగా అతడినే యజమానిగా పరిగణిస్తారని.. ప్రస్తుత బీమా పాలసీ కూడా కిరాయి కాలానికి బదిలీ అవుతుందని అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో వెల్లడించంది. ఈ క్రమంలో అలహాబాద్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును తిరస్కరిస్తూ జస్టీస్ ఎస్ నజీర్, కృష్ణ మురారితో కూడిన ధర్మాసనం తుది తీర్పు చెప్పింది.

అద్దె ఒప్పందం ప్రకారం.. బీమా ఉన్న వాహనానికి ప్రమాదం జరిగితే, పరిహారం చెల్లించాల్సిన బాధ్యత సదరు ఇన్సూరెన్స్ కంపెనీ లేదా ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లేదా వాహన యజమానికి ఉంటుందని న్యాయస్థానం వెల్లడించింది. రవాణా సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంపై ఇది ఆధారపడి ఉంటుందని తెలిపింది. అయితే ఈ కేసు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ట్రాన్ పోర్ట్ కార్పొరేషన్ కు సంబంధించింది. ఈ రవాణా సంస్థ ఓ బస్సును అద్దెకు తీసుకుంది. ఈ బస్సుకు ప్రమాదం జరిగి ఓ వ్యక్తి మృతి చెందగా, అతడి వారసులు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్‌లో పిటీషన్ దాఖలు చేశారు. వాస్తవానికి బస్సు యజమానికి, బీమా సంస్థ, ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ కు మధ్య రాతపూర్వక ఒప్పందం ఉందని వారు వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీనికి ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యత వహిస్తుందని, రూ.1,82,000 పరిహారం చెల్లించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అలహాబాద్ హైకోర్టులో బీమా కంపెనీ వ్యాజ్యం దాఖలు చేసింది. కార్పొరేషన్ నియంత్రణలో బస్సులు నడుస్తున్న కారణంగా.. బీమా సంస్థ థర్డ్ పార్టీలకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత బీమా సంస్థలకు లేదని హైకోర్టు అభిప్రాయపడింది. అనంతరం రవాణా సంస్థ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై విచారించిన సుప్రీం కోర్టు.. అద్దె ఒప్పందం ప్రకారం వాహనంతో పాటు బీమా పాలసీ కూడా బదిలీ అవుతుందని తాజా తీర్పులో పేర్కొంది.

ఇవీ కూడా చదవండి:

Personal Loan Limit: ఆర్బీఐ కీలక నిర్ణయం.. వ్యక్తిగత రుణాల పరిమితిని పెంచుతూ ప్రకటన.. కానీ వారికి మాత్రమే..!

Postal Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఈ పథకంలో చేరితే ఏడాదికి రూ.59,400.. ఎలాగంటే..!