AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రకటనల కేసులో పతంజలికి సుప్రీంకోర్టులో పెద్ద ఊరట.. IMA పిటిషన్‌ కొట్టివేత..!

పతంజలిపై IMA దాఖలు చేసిన పిటిషన్ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుర్వేద ఔషధాలను తయారు చేసే కంపెనీలు ప్రకటనలు ఇచ్చే ముందు రాష్ట్రాల నుండి అనుమతి తీసుకోవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. గతంలో, కేంద్ర ప్రభుత్వం ఈ నియమాన్ని తొలగించింది. ఆ తర్వాత ఒక పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు దానిపై స్టే విధించింది. ఈ నేపథ్యంలోనే తాజా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును కొట్టివేసింది.

ప్రకటనల కేసులో పతంజలికి సుప్రీంకోర్టులో పెద్ద ఊరట.. IMA పిటిషన్‌ కొట్టివేత..!
Patanjali Supreme
Balaraju Goud
|

Updated on: Aug 12, 2025 | 5:19 PM

Share

సాంప్రదాయ వైద్యాన్ని తప్పుదారి పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసు విచారణను ముసింది. సుప్రీంకోర్టులో పతంజలికి ఊరట లభించింది. ప్రకటనలకు ముందస్తు అనుమతి అవసరమని గతంలో ఇచ్చిన స్టేను కూడా ఇది తొలగించింది. సాంప్రదాయ వైద్యానికి సంబంధించిన తప్పుదారి పట్టించే ప్రకటనలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ఆధునిక వైద్యాన్ని అవమానించే, నిరాధారమైన ఆరోగ్య వాదనలు చేసే ప్రకటనలను పేర్కొన్న పతంజలి ఆయుర్వేదపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాఖలైన పిటిషన్‌తో ఈ కేసు ప్రారంభమైంది. కోర్టు ఒకసారి అటువంటి ప్రకటనలపై తాత్కాలిక నిషేధం విధించింది. పతంజలి ప్రమోటర్లు బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణలపై ధిక్కార చర్యలను ప్రారంభించింది.

నిజానికి, జూలై 1, 2024న, ఆయుష్ మంత్రిత్వ శాఖ (ఆయుర్వేదం, యోగా, ప్రకృతివైద్యం, యునాని, సిద్ధ మరియు హోమియోపతి) 1945 డ్రగ్స్, కాస్మెటిక్స్ నియమాలకు సంబంధించిన నియమాన్ని మార్చింది. ఈ మార్పుకు ముందు, కంపెనీలు ఆయుర్వేద, సిద్ధ లేదా యునాని మందులను ప్రకటించే ముందు రాష్ట్ర లైసెన్సింగ్ అధికారుల నుండి ముందస్తు అనుమతి పొందవలసి ఉండేది. తద్వారా తప్పుడు లేదా అతిశయోక్తి వాదనలను నిరోధించవచ్చు. కానీ మార్పు తర్వాత, ఇది ఇకపై అవసరం లేదు. అయితే ఆమోదం అవసరాన్ని సమర్థిస్తూ, ఆగస్టు 2024లో సుప్రీంకోర్టు బెంచ్ ఈ నిబంధన తొలగింపును తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే, సోమవారం(ఆగస్టు 11), న్యాయమూర్తులు బివి నాగరత్న, కెవి విశ్వనాథన్ ధర్మాసనం ఆ ఉత్తర్వును రద్దు చేసింది.

కేంద్రం చట్టబద్ధంగా తొలగించిన తర్వాత కోర్టు ఒక నియమాన్ని తిరిగి స్థాపించలేమని జస్టిస్ నాగరత్న అన్నారు. ఒక నియమాన్ని ఆమోదించిన తర్వాత దానిని అమలు చేయడానికి లేదా దానిపై చట్టం చేయడానికి న్యాయవ్యవస్థకు హక్కు లేదని అభిప్రాయపడ్డారు. ఈ నియమాన్ని తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్న న్యాయవాదులు తప్పుదారి పట్టించే వాదనలు రోగులకు హాని కలిగిస్తాయని వాదించారు. గతంలో, బాబా రాందేవ్ మరియు ఆచార్య బాలకృష్ణలకు తప్పుదారి పట్టించే ప్రకటనలు, పతంజలి, పతంజలి యజమానులపై నియంత్రణ అధికారుల చర్య తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల కోర్టు కొన్ని సూచనలు ఇచ్చింది. పతంజలి ఆయుర్వేదపై కోర్టు ధిక్కార చర్యలను ప్రారంభించింది. తరువాత దానిని నిలిపివేసింది.

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ నిబంధన తొలగింపును సమర్థిస్తూ, ఇప్పటికే ఒక చట్టబద్ధమైన వ్యవస్థ అమలులో ఉందని… సామాన్యుల తెలివితేటలను మనం అనుమానించకూడదని అన్నారు. ఆయుష్ ఉత్పత్తుల తయారీని అనుమతిస్తూనే ప్రకటనలను నిషేధించడం అన్యాయమైన వాణిజ్య పద్ధతి అవుతుందని ఆయన అన్నారు. IMA పిటిషన్‌లో కోరిన అన్ని ప్రాథమిక ఉపశమనాలు పూర్తయ్యాయని, ఈ విషయం పరిష్కరించినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. అలాగే, నిబంధన 170 తొలగింపును సవాలు చేస్తూ పార్టీలు హైకోర్టును ఆశ్రయించేందుకు అనుమతించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..