Twin Towers: ట్విన్ టవర్స్ కూల్చివేతకు డేట్ ఫిక్స్.. 9 సెకన్లలో నేలమట్టం అయ్యేలా ప్లాన్
ఇరువర్గాల వాదనల విన్న సుప్రీంకోర్టు, ట్విన్ టవర్స్‌ను కూల్చివేయాలని గతేడాది ఆగస్ట్‌లో తీర్పు ప్రకటించింది. అలాగే, అందులో ఫ్లాట్స్ కొన్న వారందరికీ 12శాతం వడ్డీతో మొత్తం నగదును చెల్లించాలని సూపర్ టెక్ కంపెనీని ఆదేశించింది.
Twin Towers In Noida: నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతకు డేట్ ఫిక్సైంది. ఆగస్ట్ 21న 40 అంతస్థుల ట్విన్ టవర్స్‌ను కూల్చివేయాలని నోయిడా అధికారులు నిర్ణయించారు. ఆగస్ట్ 28లోగా ఎట్టిపరిస్థితుల్లోనూ కూల్చివేత ప్రక్రియను పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో, నోయిడా అథారిటీ ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీం ఇచ్చిన గడువుకు, వారం రోజుల ముందే ట్విన్ టవర్స్‌ను కూల్చివేయాలని డేట్ ఫిక్స్ చేశారు. నోయిడా ట్విన్ టవర్స్‌పై ఎన్నో ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెక్టార్ 93లో సూపర్ టెక్ లిమిటెడ్ కంపెనీ ఈ ట్విన్ టవర్స్‌ను నిర్మించింది. 2009లో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులో నిబంధనలను ఉల్లంఘించారు బిల్డర్. రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు బిల్డింగ్ ప్లాన్‌ను చూపించాలన్న రూల్‌ను పట్టించుకోకపోవడంతో వివాదం మొదలైంది. నిబంధనలను తుంగలో తొక్కడమే కాకుండా అధికారులతో కుమ్మక్కై ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టారంటూ కోర్టును ఆశ్రయించారు స్థానికులు. ట్విన్ టవర్స్‌ను నిర్మించిన సూపర్ టెక్ లిమిటెడ్ కంపెనీకి వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. ఇరువర్గాల వాదనల విన్న సుప్రీంకోర్టు, ట్విన్ టవర్స్‌ను కూల్చివేయాలని గతేడాది ఆగస్ట్‌లో తీర్పు ప్రకటించింది. అలాగే, అందులో ఫ్లాట్స్ కొన్న వారందరికీ 12శాతం వడ్డీతో మొత్తం నగదును చెల్లించాలని సూపర్ టెక్ కంపెనీని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో అధికారులు ఈ భవనాల కూల్చివేతను ఎడిఫైస్ సంస్థకు అప్పగించారు.
మే 22న ఈ ట్విన్ టవర్స్‌ను కూల్చివేయాలని నిర్ణయించి, ఏప్రిల్‌లో టెస్ట్ బ్లాస్ట్ నిర్వహించారు. అయితే, ఊహించినదాని కన్నా నిర్మాణాలు ధృఢంగా ఉన్నట్లు గుర్తించిన ఎడిఫైస్ కంపెనీ, ట్విన్ టవర్స్ కూల్చివేతకు మరో మూడు నెలల గడువు కావాలని కోరింది. దాంతో, ఆగస్ట్ 28వరకు గడువు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ట్విన్ టవర్స్‌లో 915 ఫ్లాట్లు, 21 షాపులు ఉన్నాయి. ఈ టవర్స్‌ను కూల్చడానికి సుమారు 4వేల కిలోల పేలుడు పదార్ధాలు అవసరం అవుతాయని అంచనా వేశారు. 40 అంతస్థుల్లో నిర్మించిన ఈ ట్విన్ టవర్స్‌ను కేవలం తొమ్మిదే తొమ్మిది సెకన్లలో కూల్చివేయనున్నారు. పేలుళ్ల కారణంగా సమీప నివాస గృహాలకు ఎలాంటి హాని జరగదని, ఒకవేళ ఏమైనా జరిగితే బీమా వర్తిస్తుందని నోయిడా అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..