Gujarat’s Vadodara: గణేష్ విగ్రహల తరలింపులో వివాదం.. పరస్పరం రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు.. పరిస్థితి ఉద్రిక్తం
పరస్పరం రాళ్లు రువ్వుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సంఘటనా స్థలంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి విగ్రహాన్ని శాంతియుతంగా తరలించారు.
Gujarat’s Vadodara: గణేష్ విగ్రహల తరలింపు వివాదాస్పదంగా మారింది. వినాయక చవితి ఉత్సవాల కోసం ఓ సున్నిత ప్రాంతం గుండా సోమవారం రాత్రి గణేశ విగ్రహాన్ని ఊరేగింపుగా తరలిస్తుండగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఇరు వర్గాలకు చెందిన ప్రజలు ఘర్షణకు దిగారు. పరస్పరం రాళ్లు రువ్వుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సంఘటనా స్థలంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి విగ్రహాన్ని శాంతియుతంగా తరలించారు. అల్లర్లు, అల్లరి మూకల సమూహాల నేపథ్యంలో ఇరువర్గాల సభ్యులపై స్థానిక సిటీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం అర్థరాత్రి జరిగిన ఘర్షణకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. రాళ్ల దాడిలో ఎవరికీ ఎటాంటి గాయాలు కాలేదు. ఇకపోతే, ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటు చేసుకుంది. అల్లరి మూకలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
గుజరాత్‌లోని వడోదరలో సోమవారం రాత్రి ఓ సున్నిత ప్రాంతం గుండా వినాయక విగ్రహల తరలింపు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే రాత్రి 11.15 గంటల సమయంలో మాండవి ప్రాంతంలోని పానిగేట్ దర్వాజా గుండా గణేశ ఊరేగింపు కొనసాగుతుండగా చిన్న సమస్యపై రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. రెండు వర్గాల సభ్యులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారని నగర పోలీసు అధికారి తెలిపారు. రెండు వర్గాల ప్రజలు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం ప్రారంభించారు. ఇరువర్గాల సభ్యులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో గొడవ తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ ఘటనతో స్థానిక మసీదు ప్రధాన ద్వారం అద్దాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.
శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు బందోబస్తును పెంచామని, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ చిరాగ్ కొరాడియా విలేకరులతో మాట్లాడుతూ పరిస్థితి అదుపులో ఉందని, శాంతియుతంగా ఉందని, ఘటనపై క్రైం బ్రాంచ్ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ఎలాంటి వదంతులను పట్టించుకోవద్దని పోలీసులు ప్రజలను కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి