Uttarakhand: దారుణాతి దారుణం.. ‘పూజ’ డిస్ట్రబ్ చేశారని కుటుంబాన్నే అంతమొందించాడు..
Uttarakhand: పూజ చేస్తుంటే డిస్ట్రబ్ చేశారనే ఆగ్రహంతో ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు కూతుర్లు, తల్లిని కత్తితో పొడిచి చంపాడు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన..
Uttarakhand: పూజ చేస్తుంటే డిస్ట్రబ్ చేశారనే ఆగ్రహంతో ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు కూతుర్లు, తల్లిని కత్తితో పొడిచి చంపాడు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్‌లోని రాణిపోఖ్రీలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
యూపీలోని బండా ప్రాంతానికి చెందిన మహేష్ కుమార్(47), అతని భార్య నీతూ దేవి(36), తల్లి బీతన్ దేవి(75), కుమార్తెలు అపర్ణ(9), స్వర్ణ(11), అన్నపూర్ణ(13) లతో కలిసి రాణిపోఖ్రీలోని నాగఘేర్ ప్రాంతంలోని తన అన్న ఉమేష్ ఇంట్లో నివాసం ఉంటుంన్నారు. మరో పెద్ద కూతురు కృష్ణ(15) రిషికేశ్‌లోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుతోంది. అయితే, కుమార్ దశాబ్ధ కాలంగా ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్నారు. ఇంట్లో ప్రార్థనలు, పూజలు చేస్తూ సమయం గడిపేస్తున్నాడు. కాగా, స్పెయిన్‌లో పని చేస్తున్న కుమార్ సోదరుడు ఉమేష్ వారికి నెలవారీ ఖర్చులకు డబ్బులు పంపేవాడు. ఆ డబ్బులతో వారు జీవించేవారు.
అయితే, సోమవారం ఉదయం మహేష్ కుమార్ ఇంట్లో పూజలు నిర్వహిస్తున్నాడు. ఈ సమయంలో భార్య నీతూ దేవి.. టిఫిన్ చేస్తుండగా వంట గ్యాస్ అయిపోయిందని, ఎల్‌పిజి సిలిండర్‌ను మార్చాలని కోరాడు. ఆమె అలా అడగటమే పాపం అయ్యింది. అతని కోపం కట్టలు తెంచుకుంది. నీతు తన పూజను డిస్ట్రబ్ చేసిందని ఫుల్ ఫైర్ అయ్యాడు. నేరుగా వంట గదికి వెళ్లి.. అక్కడ ఉన్న కూరగాయలు కోసే కత్తితో నీతూని పొడిచాడు. ఆ తరువాత అడ్డొచ్చిన ముగ్గురు కూతుళ్లు, తల్లి ని కూడా చంపేశాడు.
అయితే, పొరుగింట్లో నివాసం ఉంటున్న సుబోధ్ జైస్వాల్ వీరి అరుపులు విని సహాయం చేయటానికి పరుగెత్తుకెళ్లాడు. రక్షించండి అంటూ వస్తున్న అరుపులు విని.. తలుపులు తట్టాడు. ఎవరూ తెరవలేదు. దాంతో కిటికీ వైపు నుంచి చూడగా.. ఇంట్లో వారందరినీ మహేష్ కుమార్ కత్తితో పొడిచి చంపడం కనిపించింది. వారిని వదిలిపెట్టాలని వేడుకున్నాడు. అయినప్పటికీ.. అతను వినకుండా కిటికీ తలుపులను మూసివేశాడు. ఈ విషయాన్ని అతను పోలీసులకు తెలుపడంతో.. హుటాహుటిన వారు ఘటనా స్థలికి వచ్చారు. అయితే, ఇంతలోనే జరగకూడని ఘోరం అంతా జరిగిపోయింది. ఇంట్లోని వారందరూ దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో నిందితుడైన మహేష్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..