మన దేశంలో తొలి పెట్రోల్ బంక్ ఎక్కడ పెట్టారు? అప్పట్లో రూపాయికి ఎన్ని లీటర్లో తెలుసా?
భారత్‌లో తొలి పెట్రోల్ బంక్ 1928లో ప్రారంభమైంది. దీన్ని బర్మా షెల్ నిర్వహించింది. అప్పట్లో పెట్రోల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. మరి అప్పట్లో పెట్రోల్ ధర ఎంత? ఒక రూపాయికి ఎన్ని లీటర్లు వచ్చేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

నేడు దేశవ్యాప్తంగా లక్షలాది వాహనాలకు ఇంధనం అందించే పెట్రోల్ బంకులు మన జీవితంలో భాగమైపోయాయి. కానీ భారత్‌లో మొట్టమొదటి పెట్రోల్ బంక్ ఎప్పుడు ప్రారంభమైంది? దాన్ని ఎవరు నిర్వహించారు? అప్పట్లో పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చేది? లీటర్ ధర ఎంత ఉండేది? అనే విషయాలు బహుషా చాలా మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ముంబైలో తొలి పెట్రోల్ బంక్
మన దేశానికి స్వతంత్రం రాకముందు.. అంటే 1928లో ముంబైలోని హ్యూజెస్ రోడ్‌లో తొలి పెట్రోల్ బంక్ ప్రారంభమైనట్లు పలు చారిత్రక కథనాలు పేర్కొంటున్నాయి. ఇదే ప్రాంతం ప్రస్తుతం అన్నీ బెసెంట్ రోడ్‌గా పిలుస్తారు. ఈ పెట్రోల్ స్టేషన్‌ను బర్మా షెల్ నిర్వహించింది. తరువాత బర్మా షెల్ భారతదేశంలోని ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ భారత్ పెట్రోలియం (BPCL)లో భాగమైంది. అప్పటి పెట్రోల్ బంకులు ఇప్పటిలా ఆటోమేటిక్ డిస్పెన్సర్లతో ఉండేవి కావు. చేతితో పనిచేసే పంపుల ద్వారా వాహనాల్లో ఇంధనం నింపేవారు.
విదేశాల నుంచే పెట్రోల్ దిగుమతి
1920లలో భారతదేశంలో ఆధునిక పెట్రోలియం రిఫైనరీ వ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందలేదు. దీంతో దేశ అవసరాలకు కావాల్సిన పెట్రోల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. చారిత్రక వివరాల ప్రకారం బర్మా, ఇరాన్ తదితర పశ్చిమాసియా ప్రాంతాల నుంచి పెట్రోలియం ఉత్పత్తులు సముద్రమార్గంలో భారత్‌కు చేరేవి. బందరుల్లో దిగిన ఇంధనాన్ని పెద్ద డ్రమ్‌లలో నింపి, అక్కడి నుంచి ట్రక్కులు లేదా ఎద్దుల బండ్ల ద్వారా పెట్రోల్ బంకులకు తరలించేవారు. కొన్ని చారిత్రక వివరాల ప్రకారం 40-గాలన్ డ్రమ్‌లను కూడా ఉపయోగించేవారు.
లీటర్ పెట్రోల్ ధర ఎంత?
1928లో పెట్రోల్‌ను ప్రధానంగా గ్యాలన్ వంటి పాత కొలతల్లో విక్రయించేవారు. కాబట్టి లీటర్ ధర ఎంత అని చెప్పడం కాస్త కష్టమే అయినప్పటికీ.. సుమారుగా లీటర్ 12 పైసలకు విక్రయించేవారు. అంటే ఒక రూపాయికి సుమారు 8.33 లీటర్ల పెట్రోల్ వచ్చేది. అప్పట్లో డిజిటల్ మీటర్లు, ఆటోమేటిక్ నాజిల్స్ ఉండేవి కావు. చేతితో పనిచేసే డిస్పెన్సర్లే ప్రధానంగా ఉండేవి. వాహనాల సంఖ్య కూడా చాలా తక్కువ. దీంతో తొలి పెట్రోల్ బంక్ భారతదేశంలో మోటార్ వాహనాల వినియోగం పెరుగుతున్న కాలానికి ఓ ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
