AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక రుద్దాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే మీ వెండి ఆభరణాలు తళతళ మెరవాల్సిందే..

మీ ఇంట్లో వెండి పట్టీలు, పూజా గిన్నెలు నల్లబడిపోయాయా? షాపుకు వెళ్లి పాలిష్ చేయించాల్సిన పనే లేదు.. ఇంట్లోనే దొరికే బేకింగ్ సోడా, అల్యూమినియం ఫాయిల్‌తో నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించొచ్చు.. కానీ ఆగండి.. ఈ పొరపాటు చేస్తే మాత్రం మీ విలువైన నగలు పూర్తిగా పాడైపోతాయి. ఏ వెండి వస్తువులను ఈ చిట్కాతో క్లీన్ చేయాలి? వేటికి దూరంగా ఉండాలి? ఆ సీక్రెట్ సైన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం

ఇక రుద్దాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే మీ వెండి ఆభరణాలు తళతళ మెరవాల్సిందే..
How To Clean Tarnished Silver At Home
Krishna S
|

Updated on: Sep 23, 2026 | 4:29 PM

Share

భారతీయ సంస్కృతిలో వెండి ఆభరణాలు, పూజ పాత్రలకు ప్రత్యేక స్థానం ఉంది. పట్టీలు, మెట్టెలు, గొలుసులు, గాజులు, కడియాలు మహిళల నిత్యావసరాల్లో భాగమైతే.. పూజలకు, ప్రత్యేక సందర్భాల్లో వెండి పాత్రలను విరివిగా ఉపయోగిస్తారు. అయితే వాతావరణంలోని తేమ, గాలి ప్రభావం వల్ల వెండి వస్తువులు కాలక్రమేణా నల్లబడి, కాంతివిహీనంగా మారడం సహజం. వీటిని ఇంట్లోనే తేలికగా శుభ్రం చేయడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కానీ సరైన పద్ధతి తెలియకపోతే విలువైన ఆభరణాలు పాడయ్యే ప్రమాదముంది. ఈ క్రమంలో మాజీ మాస్టర్‌చెఫ్ ఇండియా విజేత పంకజ్ భదౌరియా ఇంట్లో దొరికే వస్తువులతోనే నల్లబడిన వెండిని శుభ్రం చేసే సులువైన చిట్కాలను పంచుకున్నారు. గోరువెచ్చని నీటిలో ఉప్పు, బేకింగ్ సోడా కలిపి, అందులో అల్యూమినియం ఫాయిల్ వేసి వెండిని నానబెడితే చాలు.. క్షణాల్లో కొత్తదానిలా మెరుస్తుందని వివరించారు.

సైన్స్ ఏం చెబుతోంది?

ఈ పద్ధతి వెనుక బలమైన రసాయన శాస్త్రం ఉందని జైపూర్‌లోని పెర్ల్ అకాడమీ ప్రొడక్ట్ డిజైన్ విభాగాధిపతి కుమార్ దాల్ ధ్రువీకరించారు. వెండిపై ఏర్పడే నలుపుదనానికి కారణం సిల్వర్ సల్ఫైడ్. బేకింగ్ సోడా, ఉప్పు కలిపిన వేడి నీటిలో అల్యూమినియం ఫాయిల్ ఉన్నప్పుడు అయాన్ ఎక్స్ఛేంజ్ అనే చర్య జరుగుతుంది. వెండిపై ఉన్న సల్ఫర్ వేరుపడి అల్యూమినియంతో బంధాన్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల నలుపు మొత్తం అల్యూమినియం ఫాయిల్‌కు అంటుకుని, వెండి శుభ్రపడుతుంది. ఈ ప్రక్రియలో అసలు వెండి పరిమాణం ఏమాత్రం తగ్గకపోవడం దీనికున్న అతిపెద్ద ప్రయోజనం. సాధారణ పాలిషింగ్‌లో వెండి పైపొర అరిగిపోతుండగా, ఈ పద్ధతిలో లోహం నష్టపోదు.

ఈ ఆభరణాలపై అస్సలు ప్రయత్నించవద్దు

ఈ చిట్కా సాధారణ, సాదా వెండి వస్తువులకు అద్భుతంగా పనిచేసినప్పటికీ.. అన్ని రకాల ఆభరణాలకు ఇది సురక్షితం కాదని కుమార్ దాల్ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ వస్తువులపై ఈ పద్ధతిని ఉపయోగించకూడదు.

పురాతన – ఆక్సిడైజ్డ్ ఆభరణాలు: వీటి అందం ఆ నలుపు డిజైన్లలోనే ఉంటుంది. ఈ రసాయన చర్య వల్ల ఆ ముదురు రంగు పొర పూర్తిగా తొలగిపోయి వాటి కళ పోతుంది.

సిల్వర్ ప్లేటెడ్ వస్తువులు: పూత పలుచగా ఉండటం వల్ల చిన్న చిన్న గుంటలు పడటం లేదా రంగు అసమానంగా మారే ప్రమాదం ఉంది.

ముత్యాలు, రత్నాలు పొదిగినవి: ముత్యాలు, పగడాలు, ఓపల్, టర్కోయిస్ వంటి సున్నితమైన రత్నాలు వేడి నీరు, రసాయన చర్యకు గురైతే కాంతిని కోల్పోతాయి లేదా పగుళ్లు వస్తాయి.

అతికించిన రాళ్ల ఆభరణాలు: ద్రావణం ప్రభావం వల్ల రత్నాలను పట్టి ఉంచే గ్లూ లేదా అమరికలు వదులై రత్నాలు రాలిపోయే ఆస్కారం ఉంది.

రోజువారీ సంరక్షణకు సరైన మార్గమిదే

వెండి ఆభరణాలను సురక్షితంగా ఉంచుకోవడానికి తేలికపాటి గిన్నెల సబ్బు, గోరువెచ్చని నీటితో సున్నితంగా కడిగి, మెత్తని వస్త్రంతో తడిలేకుండా ఆరబెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మొండి మరకలు ఉంటే ప్రత్యేక సిల్వర్ క్లీనింగ్ వస్త్రాన్ని వాడటం మంచిది. ఇక అత్యంత ఖరీదైన, భావోద్వేగ విలువ కలిగిన పురాతన నగలను ఇంట్లో ప్రయోగాలు చేయకుండా నైపుణ్యం కలిగిన నిపుణుల వద్దే పాలిష్ చేయించడం మంచిది.

Follow Us