AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతరిక్షంలో త్రివర్ణ పతాకం.. భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్! వీడియో ఇదిగో..

India Independence Day 2026: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రష్యా వ్యోమగాములు భారత ప్రజలకు ప్రత్యేక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని భారత్-రష్యా సుదీర్ఘ అంతరిక్ష సహకారం, సంబంధాలు, గగన్‌యాన్ మిషన్ గురించి ప్రస్తావించారు.

అంతరిక్షంలో త్రివర్ణ పతాకం.. భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్! వీడియో ఇదిగో..
India Russia Friendship
Rajashekher G
|

Updated on: Aug 12, 2026 | 11:13 AM

Share

India 80th Independence Day Telugu: భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ.. అంతరిక్షం నుంచి భారత ప్రజలకు రష్యా వ్యోమగాములు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉన్న రష్యా వ్యోమగాములు భారత త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకుని వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా భారత్-రష్యా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహం, అంతరిక్ష రంగంలో ఇరు దేశాల సహకారాన్ని వారు గుర్తుచేశారు.

శాంతి, శ్రేయస్సు కోసం శుభాకాంక్షలు

వీడియో సందేశంలో రష్యా వ్యోమగామి ప్యోతర్ దుబ్రోవ్ మాట్లాడుతూ.. భారత ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌లో శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి కొనసాగాలని ఆకాంక్షించారు. భారత్-రష్యా సంబంధాల్లో అంతరిక్ష పరిశోధన కీలకమైన భాగమని పేర్కొన్నారు. ఈ ఏడాది మానవ అంతరిక్ష ప్రయాణ చరిత్రలోనూ ప్రత్యేకమైనదని వ్యోమగాములు గుర్తుచేశారు. సోవియట్ వ్యోమగామి యూరీ గగారిన్ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మానవుడిగా చరిత్ర సృష్టించి 65 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు.

భారత్‌ను సందర్శించిన యూరీ గగారిన్

యూరీ గగారిన్ 1961 నవంబర్‌లో భారత్‌ను సందర్శించారు. అప్పట్లో భారత్-సోవియట్ యూనియన్ మధ్య బలపడుతున్న స్నేహానికి ఆయన పర్యటన ఒక ముఖ్యమైన ప్రతీకగా నిలిచింది. భారత్ అందంగా ఉందని.. అంతరిక్షం నుంచి చూస్తే మరింత అందంగా కనిపిస్తుందని, అయితే భూమిపై భారత్ ఇంకా అందమైన దేశమని గగారిన్ చెప్పిన విషయాన్ని రష్యా వ్యోమగాములు గుర్తుచేశారు. భారత్‌లో నిజమైన స్నేహితులు ఉన్నారనే భావనను ఆయన వ్యక్తం చేసినట్లు తెలిపారు.

1975లో మొదలైన అంతరిక్ష సహకారం

భారత్-రష్యా అంతరిక్ష సహకారానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1975లో సోవియట్ యూనియన్ భారత తొలి ఉపగ్రహం ‘ఆర్యభట’ను అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఇది ఇరు దేశాల అంతరిక్ష భాగస్వామ్యానికి కీలకమైన మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత 1984లో భారత తొలి వ్యోమగామి రాకేష్ శర్మ సోవియట్ స్పేస్‌క్రాఫ్ట్ సోయుజ్ T-11 ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఈ ప్రయాణం భారత్-సోవియట్ సంబంధాల్లో మరో చారిత్రక ఘట్టంగా నిలిచింది.

గగన్‌యాన్‌తో కొత్త దశ

ప్రస్తుతం భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్ మానవ సహిత అంతరిక్ష యాత్రతో ఈ భాగస్వామ్యం కొత్త దశలోకి ప్రవేశించిందని రష్యా వ్యోమగామి అన్నా కికీనా పేర్కొన్నారు. గగన్‌యాన్ మిషన్ కోసం ఎంపికైన భారత వ్యోమగాములు రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. భారత్ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు.

‘భారత్-రష్యా స్నేహం చిరకాలం వర్ధిల్లాలి’

భారత్-రష్యా అంతరిక్ష సహకారాన్ని ప్రతిబింబించేలా రోస్కోస్మోస్, భారత్‌లోని దాని ప్రతినిధి కార్యాలయం, ఇస్రో కలిసి నిర్వహించిన ఓ సంయుక్త పోటీ గురించి కూడా వ్యోమగాములు ప్రస్తావించారు. ఆ పోటీలో విజేతలుగా నిలిచిన అంశాలను స్వాతంత్ర్య దినోత్సవ సందేశంతో పాటు ప్రదర్శించారు. చివరగా రష్యా వ్యోమగాములు భారత ప్రజలకు శాంతి, శ్రేయస్సు, అంతరిక్ష పరిశోధనలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భారత త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకున్న వ్యోమగామి ఆండ్రే ఫెద్యాయెవ్ “భారత్-రష్యా స్నేహం చిరకాలం వర్ధిల్లాలి” అంటూ సందేశాన్ని ముగించారు.

అంతరిక్ష కేంద్రం నుంచి వచ్చిన ఈ ప్రత్యేక సందేశం భారత్-రష్యా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహానికి, ముఖ్యంగా అంతరిక్ష రంగంలో ఇరు దేశాల భాగస్వామ్యానికి ప్రతీకగా నిలిచింది.

వీడియో చూడండి..

Follow Us