Viral: బాత్రూం నిర్మాణం కోసం తవ్వకాలు.. బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన గ్రామస్థులు
పురాతన కాలంలో బందిపోట్లు, దొంగల బెడద ఎక్కువగా ఉండేది. దీంతో అప్పటి జనం తమ వద్ద ఉన్న బంగారం, వెండి సంపదను ఇంటి నిర్మాణాల్లో లేదా గుంతలు తవ్వి దాచిపెట్టేవారు. వారు అకాల మరణం చెందితే ఆ సంపద అలానే ఉండిపోయేది. తర్వాత ఎన్నో ఏళ్ల తర్వాత ఏదైనా నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఆ నిధి బయటపడేది. అలాగే కాలగర్భంలో కలిసిపోయిన ఆలయాలు, దేవీదేవతలు విగ్రహాలు సైతం అరుదుగా బయటపడుతూ ఉంటాయి...

పాత నిర్మాణాలు కూల్చివేస్తున్నప్పడు.. ఏదైనా నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుననప్పుడు పురాతన నిధి, నిక్షేపాలు.. చరిత్ర తాలూకా వస్తువులు బయటపడటం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు పురాతన దేవీదేవతల విగ్రహాలు సైతం బయల్పడుతూ ఉంటాయి. దీంతో ఆ విగ్రహాలను సేకరించి.. పండితులను సంప్రదించి.. గుడి నిర్మాణాలు కూడా చేస్తూ ఉంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో అలాంటి అద్భుత ఘటనే వెలుగుచూసింది. అది కూడా హనుమాన్ జయంతి నాడు హనుమాన్ విగ్రహం బయటపడింది. సుల్తాన్‌పూర్ జిల్లాలోని కురేభార్‌లోని ఫుల్పూర్ గ్రామంలో స్నానాల గది నిర్మాణ పనుల్లో హనుమంతుడి భారీ విగ్రహం బయటపడింది. ఈ ఆవిష్కరణ ఇప్పుడు భారతదేశం అంతటా చర్చనీయాశంగా మారింది. ఇదో అద్భుత ఘటన అని హనుమాన్ భక్తులు చెబుతున్నారు.
జయ దేవి పాండే స్థలంలో పనిచేస్తున్న కార్మికులు స్నానాల గది కోసం తవ్వకాలు జరుపుతుండగా విగ్రహం బయటపడింది. ఈ వార్త వైరల్ అవ్వడంతో, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి విగ్రహాన్ని పూజించడం ప్రారంభించారు. కురేభార్ గ్రామసభ ప్రతినిధి సురేష్ కశోధన్ విగ్రహం బయటపడిన స్థలంలో ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. నెలలోపు విగ్రహం చుట్టూ ఇంటర్‌లాకింగ్ పేవ్‌మెంట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. హనుమాన్ జయంతి రోజున ఈ విగ్రహం బయటపడటంతో స్థానికుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిస్తున్నాయి. గ్రామ ప్రజలంతా ఇప్పుడు ఆలయ నిర్మాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
