IAS ట్రైనీలలో 41 శాతం మహిళలు.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రశంసలు
2023 ఐఏఎస్ బ్యాచ్‌లో మొత్తం 180 మంది అధికారులలో 41 శాతం మంది అంటే 74 మంది మహిళా అధికారులు ఉన్నారు. అసిస్టెంట్ సెక్రటరీ కార్యక్రమంలో భాగంగా ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనీలు ఏప్రిల్ 1 నుంచి మే 30 వరకు మొత్తం 8 వారాల పాటు 46 కేంద్ర మంత్రిత్వ శాఖలకు అనుబంధంగా పని చేయనున్నారు. ఇది వారికి విధాన రూపకల్పన, కేంద్ర ప్రభుత్వ పనితీరుపై ముందస్తు అవగాహనను అందిస్తుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు..

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ 2023 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆఫీసర్ ట్రైనీస్ (ఓటీ)లతో జరిగిన 10వ వార్షికోత్సవ అసిస్టెంట్ సెక్రటరీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ చరిత్రలో పెద్ద సంఖ్యలో మహిళా ప్రాతినిధ్యాన్ని ఆయన ప్రశంసించారు. ప్రస్తుత బ్యాచ్‌లో 180 మంది అధికారులలో 41 శాతం అంటే 74 మంది మహిళా అధికారులు ఉన్నారని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం ఈ మైలురాయి అభివృద్ధికి కారణమని మంత్రి జితేంద్ర అన్నారు. మోదీ పదవీకాలంలో మహిళా సాధికారత కార్యక్రమాలు అపూర్వమైన వేగం పుంజుకున్నాయని గుర్తు చేశారు. పీఎం మోదీ ఎల్లప్పుడూ మహిళా సాధికారత పక్షానే ఉంటారని అన్నారు. ఈ రికార్డు ప్రాతినిధ్యం సమ్మిళిత, ప్రగతిశీల పాలనకు ఆయన అచంచలమైన మద్దతుకు నిదర్శనమని మంత్రి అన్నారు. అసిస్టెంట్ సెక్రటరీ ప్రోగ్రామ్‌లోని ప్రస్తుత బ్యాచ్‌లో మొత్తం 180 మంది అధికారులలో 41 శాతం మంది అంటే 74 మంది మహిళా అధికారులు ఉన్నారు. అసిస్టెంట్ సెక్రటరీ కార్యక్రమంలో భాగంగా ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనీలు ఏప్రిల్ 1 నుంచి మే 30 వరకు మొత్తం 8 వారాల పాటు 46 కేంద్ర మంత్రిత్వ శాఖలకు అనుబంధంగా పని చేయనున్నారు. ఇది వారికి విధాన రూపకల్పన, కేంద్ర ప్రభుత్వ పనితీరుపై ముందస్తు అవగాహనను అందిస్తుంది.
2015లో అసిస్టెంట్ సెక్రటరీ ప్రోగ్రామ్ ప్రారంభించడం గురించి మంత్రి జితేంద్ర మాట్లాడుతూ.. యువ అధికారులకు వారి కెరీర్ ప్రారంభంలో రియల్-టైమ్ గవర్నెన్స్ ఎక్స్‌పోజర్ ఇవ్వడం ప్రధాని మోదీ ఆలోచన నుంచి వచ్చిందేనని అన్నారు. ఈ కార్యక్రమం అధికారులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, కోవిడ్ సమయంలో జిల్లా స్థాయి సంక్షోభ నిర్వహణ కోసం పిలిచినప్పుడు ఐఏఎస్ అధికారులలో చాలామంది అద్భుతంగా పనిచేశారని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమం 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సమర్థులైన, ఆత్మవిశ్వాసం కలిగిన సివిల్ సర్వెంట్లను పెంపొందించడంలో ఈ కార్యక్రమం అద్భుతమైన పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. పంజాబ్, హర్యానా, ఈశాన్య ప్రాంతాల నుంచి అధిక స్థాయిలో సివిల్ సర్వెంట్ల ప్రాతినిధ్యం పెరగడాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. గతంలో ఈ ప్రాంతాల నుంచి తక్కువ మంది ఎంపికయ్యేవారు.
ప్రస్తుతం బ్యాచ్‌లో విద్యా, వృత్తిపరమైన వైవిధ్యం గర్వంగా ఉందని మంత్రి తెలిపారు. వీరిలో 99 మంది అధికారులు ఇంజనీరింగ్, చాలా మంది వైద్యం, ఇతర సాంకేతిక రంగాల నేపథ్యాలకు చెందినవారని పేర్కొన్నారు. టెక్నోక్రాట్లు సివిల్ సర్వీసెస్‌లో చేరడం ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. ఈ బ్యాచ్ యువత సగటు వయస్సు కేవలం 22 నుంచి 26 యేళ్ల మధ్య ఉందని, ఇది దేశానికి దోహదపడటానికి దీర్ఘకాలిక కెరీర్ పథాన్ని అందిస్తుందని డాక్టర్ ఆయన ప్రశంసించారు. 2047లో విక్షిత్ భారత్‌గా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తున్న కీలక సమయంలో భాగమవడం మీ అదృష్టమని ఆయన నొక్కి చెప్పారు. భవిష్యత్ తరాల ప్రయోజనం కోసం పదవీ విరమణ చేసిన అధికారులు తమ అనుభవాలను నమోదు చేయడానికి ప్రోత్సహించే అనుభవ్ అవార్డులను అందించనున్నట్లు మంత్రి తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.








