Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kumbhamela: కుంభమేళాల్లో తొక్కిసలాటలు.. స్వాతంత్ర్యం వచ్చాక ఎన్ని జరిగాయంటే?

Kumbhamela: ప్రయాగ్‌రాజ్‌లో జరిగే కుంభమేళాకు మరో ప్రత్యేకత కూడా ఉంటుంది. ఇక్కడ పవిత్ర నదులు గంగ, యమునతో పాటు అంతర్వాహిణిగా సరస్వతి కలుస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మూడు నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా చెబుతూ.. సాధారణ రోజుల్లోనే పెద్ద సంఖ్యలో..

Kumbhamela: కుంభమేళాల్లో తొక్కిసలాటలు.. స్వాతంత్ర్యం వచ్చాక ఎన్ని జరిగాయంటే?
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Subhash Goud

Updated on: Jan 29, 2025 | 1:20 PM

జనం రద్దీ పెరిగి నియంత్రణ కోల్పోతే జరిగే దారుణమే తొక్కిసలాట. చిన్న తోపులాటగా మొదలై ఒకరిపై ఒకరు పడి కాళ్ల కింద నలిగి ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు చరిత్రలో ఎన్నో నమోదయ్యాయి. వాటిలో ఆధ్యాత్మక యాత్రల్లో ఈ తరహా దుర్ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు ఒకచోట గుమికూడే వేడుకలు అనేకం ఉన్నాయి. వాటిలో కుంభమేళాలు, నదుల పుష్కరాలు, పర్వదినాల్లో పుణ్యస్నానాలు, పుణ్య తిధుల్లో ఆలయ దర్శనాలు ఈ తరహా తొక్కిసలాట మరణాలకు కారణమవుతున్నాయి. భక్త జనం రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని ఏర్పాట్లు చేసినా.. ఒక్కోసారి అదుపుచేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్)లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన కూడా అలాంటిదే. సాధారణంగా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది.

అయితే 12వ కుంభమేళా (144 ఏళ్లకు ఒకసారి)ను మహా కుంభమేళాగా వ్యవహరిస్తుంటారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగే కుంభమేళాకు మరో ప్రత్యేకత కూడా ఉంటుంది. ఇక్కడ పవిత్ర నదులు గంగ, యమునతో పాటు అంతర్వాహిణిగా సరస్వతి కలుస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మూడు నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా చెబుతూ.. సాధారణ రోజుల్లోనే పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తుంటారు. అలాంటిది మహాకుంభమేళాలో భాగంగా వచ్చిన మౌని అమావాస్య మరింత రద్దీకి కారణమైంది. ఈ ఒక్క రోజే దాదాపు 10 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్ చేరుకుంటారని ప్రభుత్వం అంచనా వేసింది. అంటే రెండు తెలుగు రాష్ట్రాల జనాభా అంతా ఒకే చోట చేరితే ఎలా ఉంటుందో.. ఈ ఒక్క రోజు ప్రయాగ్‌రాజ్‌ను చూస్తే అలా ఉంటుంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని చేసిన ఏర్పాట్ల సంగతెలా ఉన్నా.. భక్తుల్లోచాలా మంది త్రివేణి సంగమం దగ్గరే స్నానం చేయాలని ప్రయత్నించారు. అదే వారి పాలిట శాపంగా మారింది. నియంత్రించలేని స్థాయిలో రద్దీ పెరిగి, అదుపుతప్పి తొక్కిసలాట చోటుచేసుకుంది. పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోగా, వందల సంఖ్యలో గాయపడ్డారు.

చరిత్ర పేజీల్లోకి తొంగిచూస్తే.. కుంభమేళాల్లో ఇలాంటి తొక్కిసలాట మరణాలు పలుమార్లు నమోదయ్యాయి.

1954:

బ్రిటీష్ వలసపాలకుల నుంచి విముక్తి పొంది స్వతంత్ర భారత్ ఆవిర్భించిన తర్వాత తొలిసారిగా 1954లో కుంభమేళా జరిగింది. నాటి అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్)లో నిర్వహించిన ఈ కుంభమేళాలో 1954 ఫిబ్రవరి 3న మౌని అమావాస్య వచ్చింది. ఆ పుణ్యతిథిన పవిత్ర నదీస్నానాల కోసం భక్తులు పోటెత్తడంతో సుమారు 800 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో తొక్కిసలాటలో నలిగిపోయి కొందరు చనిపోగా.. తొక్కిసలాట కారణంగా నదిలో పడిపోయి నీట మునిగి అనేకమంది మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

1986:

కుంభమేళా విషాదాల్లో రెండోది హరిద్వార్‌లో సంభవించింది. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో కనీసం 200 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్ బహదూర్ సింగ్, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్లమెంటు సభ్యులతో కలిసి హరిద్వార్‌కు వచ్చినప్పుడు గందరగోళం నెలకొంది. భద్రతా సిబ్బంది సామాన్య ప్రజలను నది ఒడ్డుకు రాకుండా నిరోధించడంతో, జనసమూహం ఆందోళన చెంది అదుపు తప్పింది. దీని ఫలితంగా ఘోరమైన తొక్కిసలాట జరిగింది.

2003:

2003లో, మహారాష్ట్రలోని నాసిక్‌లో కుంభమేళా సందర్భంగా గోదావరి నది వద్ద పవిత్ర స్నానమాచరించడానికి వేలాది మంది యాత్రికులు గుమిగూడినప్పుడు జరిగిన తొక్కిసలాటలో డజన్ల కొద్దీ మంది మరణించారు. ఈ తొక్కిసలాటలో మహిళలు సహా కనీసం 39 మంది మరణించారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు.

2013:

సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌లోని నాటి అలహాబాద్‌లో తొక్కిసలాట చోటుచేసుకుంది. 2013 ఫిబ్రవరి 10న కుంభమేళా సందర్భంగా అలహాబాద్ రైల్వే స్టేషన్‌లో యాత్రికుల రద్దీ కారణంగా ఒక ఫుట్‌ఓవర్ బ్రిడ్జి కూలిపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ విషాదంలో 42 మంది మరణించగా, 45 మంది గాయపడ్డారు.

2025:

ప్రయాగ్‌రాజ్ (అలాహాబాద్)లో జరుగుతున్న మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా కోట్ల సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమంవైపు తరలిరావడంతో తొక్కిసలాట ఏర్పడింది. పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా, వందల సంఖ్యలో భక్తులు గాయపడి ఆస్పత్రి పాలయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి