Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైవిధ్య భారతంలో ”కోడ్‌” కూసేనా..! UCC అమలుకు అడ్డంకులేంటి..?

దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించింది. యూసీసీ అమలులోకి రావడంతో రాష్ట్ర పౌరులందరికీ సమాన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్‌సింగ్ ధామి తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతి ఏ మతానికి, వర్గానికి వ్యతిరేకం కాదన్న ఆయన.. మహిళా సాధికారతకు ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. మరి.. భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలకు నిలయమైన భారతావనిలో అన్ని రాష్ట్రాల్లో యూసీసీ అమలు సాధ్యమేనా.? దీన్ని అమలు చేయాలంటే ఎదురయ్యే అడ్డంకులు ఏంటి..? దీని టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌ వెల్లలచెరువు వ్యూపాయింట్ ఇదిగో..

వైవిధ్య భారతంలో ''కోడ్‌'' కూసేనా..! UCC అమలుకు అడ్డంకులేంటి..?
Uniform Civil Code
Follow us
Rajinikanth Vellalacheruvu

|

Updated on: Jan 29, 2025 | 3:49 PM

మహోన్నత భారతావనిలోని అనేక రాష్ట్రాల్లాగే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక ఉత్తరాఖండ్‌. ప్రపంచ ప్రసిద్ది చెందిన ఆలయాలతో విలసిల్లుతూ దేవభూమిగా పేరెన్నికగల హిమాలయ రాష్ట్రం సరికొత్త చరిత్రకు నాంది పలికింది. మాతృసంస్థ ఆర్ఎస్‌ఎస్‌ నుంచి భారతీయ జనతా పార్టీకి వచ్చిన అజెండాలోని యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌(UCC) అమలు చేస్తున్న తొలిరాష్ట్రంగా ఆవిర్భించింది. భిన్న సంస్కృతుల భారతావనిలో ఏకరూప చట్టాలు ఎలా సాధ్యమని విపక్షాల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్న తరుణంలో.. తాము చేసి చూపుతామంటూ తొలి అడుగు వేసింది ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం. దేవభూమిలో మొదలైన అడుగు క్రమంగా ఉత్తరాది మీదుగా ఈశాన్యం, పశ్చిమ మీదుగా దక్షణాదిలోని గాడ్‌ ఇట్స్‌ ఓన్‌ ల్యాండ్‌గా చెప్పుకునే కేరళ వరకూ చేరుతుందా..?

సాంస్కృతిక వైభవం దెబ్బతింటుందా?

ప్రపంచంలో భారతదేశాన్ని ప్రత్యేకంగా నిలిపేది ఇక్కడున్న రాజకీయం, దశాబ్ధాలుగా ఏలుతున్న నాయకత్వం కాదు. శతాబ్ధాలుగా వైవిధ్యానికి మారుపేరుగా ఉండే బౌగోళికరూపం. మనకే సొంతమైన సంస్కృతి, సంప్రదాయాలు. అనేక జాతులు, మతాలు, కులాలతో నిండిన మనదేశం భిన్నత్వంలో ఏకత్వంతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. విభిన్న జాతులున్నాయి. భిన్నమైన ఆచారాలు పాటిస్తారు. వేషభాషలు వేర్వేరుగా ఉంటాయి. భారతరాజ్యాంగం కేవలం 16 భాషలనే అధికారికంగా గుర్తించినా మనదేశంలో 1632 రకాల భాషలు ఉన్నాయంటే నమ్మగలరా. కోట్లమంది మాట్లాడే బాషలున్నాయి.. వందలమందికే పరిమితం అయిన అత్యంత అరుదైన భాషలు కూడా మన సొంతం. ఒకే భాష మాట్లాడే ప్రజల్లో కూడా ప్రతి 50 కిలోమీటర్లకు మాండలికం మారుతుంది. ఇక వారి ఆచారాలు, కొలిచే దైవాలు మారతాయి, చేసే పూజలు భిన్నంగా ఉంటాయి. సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, వివాహాలు అన్నీ భిన్నమే. దేశంలో మతాలు కూడా చాలానే ఉన్నాయి. హిందు, ముస్లిం, క్రిస్టియన్‌, పర్షియన్‌, జైన్‌, బుద్దిజం, జోరాస్ట్రియన్‌ సహా అనేకం ఉన్నాయి. ఇవన్నీ కలిస్తేనే భారతం. అయితే మతం, జాతికి అనుబంధంగానే ఆచరించే సంప్రదాయాలు కొనసాగుతున్న ఆచారాలుంటాయి. బాష, ఆచారాలు, సంప్రదాయాలు కేవలం నమ్మకాలు మాత్రమే కాదు.. భావితరాలకు సంస్కృతికి చేరవేసే సాధనం కూడా.అలాంటి ఆచారాలపై యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ రూపంలో ముప్పుగా మారుతుందన్న భయాలున్నాయి. UCC అమలు చేయడం వల్ల ఈ వైవిధ్యం కోల్పోతామని, దేశంలోని వివిధ సంస్కృతులు మరియు సంప్రదాయాలు ప్రభావితమవుతాయని బలంగా వాదిస్తున్నారు.

Tv9 Rajinikanth View Point

TV9 Managing Editor Rajinikanth View Point

మతాలు… సవాళ్లు…!

వివిధ మతాలు, విశ్వాసాలను బట్టి పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత వంటి వ్యవహారాల్లో వేర్వేరు సంప్రదాయాలకు పాటిస్తున్నారు. ఇప్పుడు వాటికి ముగింపు పడుతుందన్న భయాందోళనలున్నాయి. ముస్లింలు పాటించే ముస్లిం పర్సనల్ లా ఉంది. అయితే అందరూ అదే లాను పాటిస్తారని లేదు. బోహ్రా ముస్లింలు వారసత్వ విషయాలలో హిందూ సంప్రదాయాలను అనుసరిస్తారు. నార్త్‌ ఈస్ట్‌ స్టేట్స్‌లో క్రైస్తవులు ఎక్కువగా ఉండే నాగాలాండ్, మిజోరాం వంటి రాష్ట్రాల్లో ప్రత్యేక చట్టాలున్నాయి. మతం ప్రకారం కాకుండా ఆచారాల ప్రకారం నడుచుకుంటారు. వారసత్వం విషయంలోనూ భిన్నమైన ఆచారాలున్నాయి.. హిందువులు తమ పిల్లలను దత్తత తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ ముస్లిం వర్గాల్లో దీనికి ప్రాధాన్యత లేదు. ఆస్తులకు, కుటుంబానికి వారసుడిగా అబ్బాయినే చూసే సంప్రదాయం హిందువుల్లో ఉంది. కొన్ని గిరిజన తెగల్లో ఇందుకు భిన్నమైన సంప్రదాయం ఉంటుంది. ప్రస్తుతం ముస్లిం పర్సనల్‌ అప్లికేషన్ చట్టం-1937 ముస్లింలకు అమలువుతోంది. ఇందులో వివాహం, విడాకులు అనేవి ప్రధాన అంశాలు. ఉత్తరాఖండ్‌లో అమలవుతున్న చట్టం ప్రకారం.. ఇకపై ముస్లిం కమ్యూనిటీలో బహుభార్యత్వం అనేది నేరం అవుతుంది. పైగా హలాల్ చేయడం కూడా నిషిద్ధం. ఒక్క ముస్లిం చట్టాలే కాదు.. చాలా చట్టాల్లో మార్పులు వస్తాయి.

సిక్కు కమ్యూనిటీ కోసం ‘ఆనంద్ వివాహ చట్టం 1909’ ఉంది. ఇది సిక్కుల వివాహాలకు వర్తించే చట్టం. కానీ, ఈ చట్టంలో విడాకులకు ఎలాంటి నిబంధన లేదు. సో, సిక్కులు విడాకుల కోసం కోర్టుకెళ్తే హిందూ వివాహ చట్టం ప్రకారం తీర్పు ఇస్తారు. ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తే ఆనంద్ వివాహ చట్టం కనుమరుగు అవుతుంది. ఇక్కడ హిందూ వివాహ చట్టాలు కూడా రద్దు అవుతాయి. ఉమ్మడి పౌరస్మృతి అమలైన మరుక్షణమే హిందూ వివాహ చట్టం-1955, హిందూ వారసత్వ చట్టం-1956, హిందూ అవిభక్త కుటుంబ చట్టం కూడా రద్దవుతుంది. ఇక క్రిస్టియన్ విడాకుల చట్టం-1869లోని సెక్షన్ 10A(1) ప్రకారం.. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. అంతకంటే ముందు భార్యాభర్తలు కనీసం రెండేళ్లపాటు విడిగా ఉండటం తప్పనిసరి. పైగా కేరళలో మాత్రమే ప్రత్యేకంగా వారసత్వ చట్టం ఉంది. ఇవన్నీ ఉమ్మడి పౌరస్మృతితో రద్దు అవుతాయి. అందుకే UCC ప్రతిపాదనను మతపరమైన సంస్కృతి మరియు సంప్రదాయాలకు భంగం కలిగించే ప్రయత్నంగా భావిస్తున్నారు.

ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతర మత పెద్దలు, ప్రతినిధులు తమ వ్యక్తిగత చట్టాలు తమ మత సిద్ధాంతాల ఆధారంగా రూపొందించబడినవని, వాటిని మార్చడం వల్ల తమ మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని వాదిస్తున్నారు. రాజ్యాంగం 25 వ అధికరణ ప్రకారం ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. మతానికి అనుబంధంగా ఉండే ఆచారాలు, సంప్రదాయాలు పాటించాడానికి స్వేచ్ఛ కూడా ఉంది. అలాంటప్పుడు మతపరమైన హక్కుకు యూనియన్‌ సివిల్‌ కోడ్‌ వల్ల భంగం కలుగుతుందన్నది వ్యతిరేకించేవారి బలమైన వాదనగా ఉంది.

రాజకీయంగా విమర్శలు

UCC ప్రతిపాదనను కొన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి పౌర స్మృతి కోసం డిమాండ్ వినిపిస్తూనే ఉంది. రాజ్యాంగం కూడా ఇలాంటి చట్టం ఒకటి ఉండాలన్నది. కానీ ఇది రాజకీయ వివాదంగానే దశాబ్ధాలుగా నలుగుతుంది. ఎన్నికల అజెండాగా మారి ప్రజల్లో చర్చకు తావిస్తుంది కానీ ఇప్పటికీ దీనిపై స్పష్టత లేదు. హిందు వాద అజెండాగా ఉపయోగించడానికి చేస్తున్న ప్రయత్నమని.. మనువాదాన్ని ప్రజలపై బలంగా రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నంగా లెఫ్ట్‌ పార్టీలు కొన్ని చెబుతున్నాయి. లింగవివక్షను, అసమానతలను, మతస్వేచ్ఛను హరించే చట్టంగా చెబుతున్నాయి వ్యతిరేకించే రాజకీయపార్టీలు. మతపరమైన భావోద్వేగాలను రేకెత్తించి, సామాజిక విభజనను పెంచుతుందని కూడా వాదిస్తున్నారు.

అమలు చేయాలంటే…

భారతావని మొత్తం ఒకే దేశంగా ఉన్న సరే.. ఒకే పౌరచట్టం మాత్రం లేదు. పెళ్లిళ్లు, విడాకులు, వారసత్వం, దత్తత.. ఇలాంటి వ్యక్తిగత అంశాల్లో మతాల వారీగా ఎవరి చట్టాలు వారికి ఉన్నాయి. హిందువులు, ముస్లింలు, క్యాథలిక్‌ క్రిస్టియన్లు, పార్సీల విషయంలో సెపరేట్‌ చట్టాలు వర్తిస్తున్నాయి. దేశవ్యాప్తంగా యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ అమల్లోకి వస్తే.. మతపరంగా ఉన్న ఈ చట్టాలన్నీ రద్దవుతాయి. అందుకే UCC అమలు చేయడానికి అనేక చట్టపరమైన సవాళ్లు ఉన్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ వ్యక్తిగత చట్టాలను రద్దు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ ట్రిపుల్‌ తలాక్‌ మాత్రమే జాతీయస్థాయిలో చట్టం చేశారు. కశ్మీర్‌కు ప్రతిపత్తి తొలగించారు. కానీ ఇంకా ముస్లిం పర్సనల్‌ లా, హిందు వివాహచట్టం వంటివి ఎన్నో దీంతో ముడిపడి ఉన్నాయి. వాటిని పరిష్కరించి.. ఆయా వర్గాలను ఒప్పించి మరీ చట్టాలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి కాషాయపార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో దీనిని చట్టం చేసి అమలు చేసినా.. మిత్రపక్షాలు అధికారంలో ఉన్న స్టేట్స్‌లో చేయలేని పరిస్థితి ఉంది. ఏపీలో టీడీపీ, బీహార్‌లో జేడీయూ ఈ విషయంలో ఇప్పటికీ తమ వాదన పెద్దగా వినిపించడం లేదు.

మోదీ లక్ష్యానికి అడుగుదూరంలో..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తిరుగులేని దేశాధినేతగా ఎదిగారు. ఇందిరాగాంధీ తర్వాత అంతటి శక్తిమంతమైన నాయకుడు కూడా ఆయనే. కఠిన నిర్ణయాలు సైతం తీసుకుని ప్రజల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించారు. బీజేపీ దశాబ్ధాలుగా ఇస్తున్న హామీల్లో ట్రిపుల్‌ తలాక్‌ రద్దు చేసి సాకారం చేశారు.. కశ్మీర్‌ స్వయంప్రతిపత్తి ఎత్తేసి పార్టీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అద్వానీ, మురళీమనోహర్‌ జోషి వంటి ఉద్దండులు కలలుగన్న రామాలయం నిర్మాణం తన హాయంలో సాకారం చేసి వారికి బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు వన్‌నేషన్‌ వన్‌ ఎలక్షన్‌, మహిళా రిజర్వేషన్‌ బిల్లు పెట్టి పంతం నెగ్గించుకున్నారు. ఇక RSS సహా హిందు సంస్థలన్నీ బలంగా కోరుకుంటున్న యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ కూడా తన సారధ్యంలో చట్టం కావాలని బలంగా కోరుకుంటున్నారు. ఈ అడుగు కూడా పడితే నరేంద్రమోదీ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. పార్టీతో పాటు RSS అజెండాను అమలు చేసిన నాయకుడిగా చరిత్ర సృష్టిస్తారు.

కానీ యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయడం అనుకున్నంత సులభం కాదు. మనోభావాలు దెబ్బతింటాయంటే.. వాటి జోలికి కూడా వెళ్లని రాజకీయాలు నడుస్తున్న రోజులివి. సో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తప్ప ఈ ఉమ్మడి పౌరస్మృతి అమలవడం కష్టపాధ్యమే. ఉత్తరాఖండ్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా చూస్తున్నారు… అక్కడ వచ్చే ఫలితాలే భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో అమలుఅవుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది.

– రజినీకాంత్‌ వెల్లలచెరువు, టీవీ9 మేనేజింగ్ ఎడిటర్