Prices Of Spices: సామాన్యులకు మరో పిడుగులాంటి వార్త.. భారీగా పెరిగిన ధరలు..
ధరల మంటతో కుదేలవుతున్న సామాన్యులకు మరో పిడుగులాంటి వార్త. ఘుమఘుమలాడే రుచికరమైన వంటలు కావాలంటే అందులో కాసిన్ని సుగంధ ద్రవ్యాలు పడాల్సిందే. లేదంటే కూర రుచి పచి ఉండదు. కానీ ఇప్పుడలాంటి కూరనే తినాలి.

ధరల మంటతో కుదేలవుతున్న సామాన్యులకు మరో పిడుగులాంటి వార్త. ఘుమఘుమలాడే రుచికరమైన వంటలు కావాలంటే అందులో కాసిన్ని సుగంధ ద్రవ్యాలు పడాల్సిందే. లేదంటే కూర రుచి పచి ఉండదు. కానీ ఇప్పుడలాంటి కూరనే తినాలి. ఎందుకంటే.. సుగంధ ద్రవ్యాల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇంకా పెరుగుతాయని కూడా సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, ఆహారోత్పత్తిపై వాతావరణ ప్రభావం లాంటి అంశాలతో రేట్లు పెరిగాయి. సుగంధ ద్రవ్యాలను కొనలేని స్థితి.. ఫలితంగా టేస్ట్ లెస్ కర్రీస్‌తోనే గడిపేయాలి.
దేశ వ్యాప్తంగా జీలకర్ర ధర భారీ స్థాయిలో పెరిగింది. సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి తక్కువగా ఉన్నందున జీరా ధరలు సంవత్సరానికి 72 శాతం పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తక్కువ దిగుబడి, సాగు విస్తీర్ణం తక్కువగా ఉండటం, రైతులు జీలకర్ర కంటే ఎక్కువ ధరలు ఉన్న పెసర, ఆవాలకి మారడం వలన జీరా దిగుబడి తక్కువగా ఉంది. దీంతో ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా జీరాను అత్యధికంగా ఉత్పత్తి చేసే భారత్‌లో రికార్డ్ స్థాయిలో ధరలు పెరగడం వలన ఇతర ప్రపంచ మార్కెట్‌లపై జీరా ప్రభావం పడనుంది.
ప్రపంచంలోనే అత్యధిక జీలకర్ర ఉత్పత్తిలో భారతదేశం 70 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంది. ఉత్పత్తిలో 30-35శాతం ఎగుమతి చేస్తూ అతిపెద్ద ఎగుమతిదారుగా కూడా ఉంది. దేశీయంగా జీలకర్రలో 40 శాతం వాటాను కలిగి ఉన్న గుజరాత్‌లోని మండిలో ఏప్రిల్‌లో ధరలు విపరీతంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కూడా సుగంధ ద్రవ్యాల ధరలు అందనంత ఎత్తుకు ఎదిగాయి.




రిటైల్, హోల్ సేల్ ధరల్లో తీవ్ర వ్యత్యాసం..
భారతదేశంలో సుగంధ ద్రవ్యాల ధరలు విపరీతంగా పెరగడంతో, కూరల్లో రుచి తగ్గింది. ధరల పెరుగుదల కారణంగా, అనేక మసాలా దినుసులలో హోల్‌సేల్ అండ్ రిటైల్ మధ్య వ్యత్యాసం దాదాపు రెండింతలు పెరిగింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరగడంతో రిటైల్‌లో సుగంధ ద్రవ్యాల ధరల్లో హోల్‌సేల్‌తో పోలిస్తే రెట్టింపు వ్యత్యాసం కనిపిస్తోంది. దీని ప్రభావం ఎక్కువగా వినియోగదారుల జేబులపైనే పడుతోంది.
ముఖ్యంగా మిరపకాయలు, జీలకర్ర, లవంగాల ధరలు భారీగా పెరిగాయి. జీలకర్ర ధరలు గరిష్ట వేగం చూపుతున్నాయి. ఇది ఇప్పటివరకు అత్యధిక ధరకు అమ్ముడవుతోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షం, వడగళ్ల వాన కారణంగా జీలకర్ర ఉత్పత్తి దెబ్బతిందని వ్యాపారులు చెబుతున్నారు.
ప్రదీప్ అనే ఓ మసాలా వ్యాపారి మాట్లాడుతూ.. గత 6 నెలల్లో సుగంధ ద్రవ్యాల ధరలు చాలా పెరిగాయి. ముఖ్యంగా జీలకర్ర రేటు చాలా పెరిగింది. దీంతో పాటు ఇంగువ, ఎర్ర మిర్చి, లవంగాలు, ఆకుకూరలు, చిన్న ఏలకుల ధరలు కూడా దాదాపు రెట్టింపు అయ్యాయి.
కరోనా నుంచి మార్కెట్ పడిపోయినా మళ్లీ పుంజుకుంది. కానీ.. అకాల వర్షాల వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని బాధిత రైతులు మొత్తుకుంటున్నారు. వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయని, జీలకర్ర పంట సిద్ధంగా ఉండగానే వానలు రావడంతో పంట మొత్తం పాడైపోయింది. ఫలితంగా జీలకర్ర ధర అమాంతం పెరిగింది. విదేశాలకు కూడా అంతే పరిమాణంలో జీలకర్ర ఎగుమతి అవుతోంది. కూరల తయారీకి జీలకర్ర అత్యంత ప్రాథమిక మసాలా. ఇది లేకుండా కూరలు వండలేం. వండినా తినలేం. కానీ దాని రేటు మహిళలను భయపెడుతోంది.
బడా వ్యాపారులు, నల్ల వ్యాపారులు మసాలా దినుసులను మార్కెట్ నుంచి పెద్దమొత్తంలో కొనుగోలు చేసి విదేశాలకు కూడా తరలిస్తున్నారని.. అందుకే సుగంధ ద్రవ్యాల రేటు పెరగడానికి కారణమని అంటున్నారు.
ధరలు భగభగ..
– ఇంగువ.. కిలో ₹ 10000 ఉండగా ఇప్పుడు దాదాపు 25 నుంచి ₹ 30000 వరకు కిలో విక్రయిస్తున్నారు.
– జీలకర్ర గత కొన్ని రోజులుగా కిలో ₹ 100 పెరిగి ₹ 280 నుండి ₹ 450కి పెరిగింది.
– ఎర్ర మిర్చి కిలో రూ. 160 నుంచి ₹ 250 నుంచి ₹ 350 వరకు విక్రయిస్తున్నారు.
– కిలో రూ.400 నుంచి రూ.700 వరకు విక్రయించే లవంగాలు ఇప్పుడు కిలో రూ.800 నుంచి రూ.1,100 వరకు అమ్ముతున్నారు.
– కొత్తిమీర రేటు కూడా పెరిగింది. కొత్తిమీర కిలో ₹ 140. ఇప్పుడు దాని ధర కిలో రూ.180కి చేరుకుంది.
– పెద్ద ఏలకులు కిలో ₹400 నుండి ₹700 వరకు అమ్ముడవుతుండగా, ఇప్పుడు దాని ధర కిలో 700 నుండి 1100 వరకు ఉంది.
– చిన్న ఏలకుల రేటు కూడా దాదాపు రెట్టింపు అయింది.
– కాశ్మీర్ మిరపకాయ గతంలో కిలో ₹ 400 ఉండగా, కిలోకు 700 నుండి 750కి చేరుకుంది.
మొత్తమ్మీద, మసాలాల రేట్ల పెరుగుదలతో ఎవరూ వీటివైపు చూడటం లేదు. ఈ ధరలతో రోజువారీ కూలీ చేసుకొని బతికేవాళ్ల పరిస్థితి ఏంటంటున్నారు వినియోగదారులు. సంవత్సర వ్యవధిలోనే కొన్ని సుగంధ ద్రవ్యాలు 50 శాతం వరకు ధరలు పెరగడం ఇదే మొదటి సారి. వర్షాలు పడడం కారణంగా దిగుబడి తగ్గిపోయింది. వ్యాపారం కూడా దెబ్బతినిందని వ్యాపారస్తులు చింతిస్తున్నారు. మొత్తంగా కూరలు కావాలనుకుంటే.. కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
