‘‘మాకు నిధులు ఇవ్వరు, మా మాట వినరు’.. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా ఒక్కటైన సౌత్ స్టేట్స్!
డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాలు పోరుబాట పట్టాయి. ఈ అంశంపై మార్చి 22 శనివారం చెన్నైలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల నేతలు కూలంకషంగా చర్చించి కీలక తీర్మానం చేశారు. 25 ఏళ్ల వరకు పునర్విభజన చేయకూడదని తీర్మానించారు.

దేశ రాజకీయాల్లో కీలక సమావేశానికి చెన్నై వేదిక అయింది. డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి పలువురు సీఎంలు, వివిధ పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల నేతలు కూలంకషంగా చర్చించి కీలక తీర్మానం చేశారు. 25 ఏళ్ల వరకు పునర్విభజన చేయకూడదని తీర్మానించారు. అదే సమయంలో డీలిమిటేషన్ వ్యతిరేకంగా నిర్వహించే రెండో సమావేశం తెలంగాణలో ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ప్రతిపాదించారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్.
ఈ సమావేశం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నాయకత్వంలో జరిగింది. ఇందులో కేరళ ముఖ్యమంత్రి పి. విజయన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఒడిశా ప్రతిపక్ష పార్టీ బిజు జనతాదళ్, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్-కాంగ్రెస్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ సొంత వాస్తవాలతో డీలిమిటేషన్‌ను వ్యతిరేకించారు.
దక్షిణాది రాష్ట్రాల జేఏసీ తీర్మానాలను డీఎంకే ఎంపీ కనిమొళి వెల్లడించారు. డీలిమిటేషన్‌తో నష్టపోయే రాష్ట్రాల నేతలంతా కలిసి కేంద్రంపై పోరాటం చేయనున్నట్లు తెలిపారు. వైసీపీ, టీఎంసీ హాజరుకాకపోవడంపైనా కనిమొళి రియాక్ట్ అయ్యారు. డీలిమిటేషన్ అంశంపై మోదీకి వైసీపీ అధినేత జగన్ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన కూడా తమతోనే ఉన్నట్టు భావిస్తున్నామన్నారు. తదుపరి సమావేశంలో వైసీపీ పాల్గొంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక.. టీఎంసీ కూడా కొన్ని కారణాలతో దక్షిణాది నేతల సమావేశానికి హాజరు కాలేకపోయినట్లు ఎంపీ కనిమొళి తెలిపారు.
జనాభా నియంత్రణ కోసం కుటుంబ ప్రణాళికలను ఖచ్చితంగా అమలు చేసి విజయం సాధించిన రాష్ట్రాలకు డీలిమిటేషన్ మంచిది కాదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకం కాదు.. న్యాయమైన డీలిమిటేషన్‌కు అనుకూలంగా ఉన్నామన్నారు. జనాభా ప్రకారం డీలిమిటేషన్ జరిగితే, పార్లమెంటులో మన ప్రాతినిధ్యం తక్కువగా ఉంటుంది. ఇది జరిగితే, కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు పొందడానికి కష్టపడాల్సి ఉంటుంది. రైతులు ప్రభావితమవుతారు. మన సంస్కృతి, అభివృద్ధి ప్రమాదంలో పడుతుంది. మన పౌరులు తమ సొంత దేశంలో అధికారాన్ని కోల్పోతారు. ప్రజాస్వామ్యంలో గళం విప్పలేమని స్టాలిన్ అభిప్రాయపడ్డారు.
కేరళ ముఖ్యమంత్రి పి. విజయన్ ఈ అంశంపై బీజేపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఎటువంటి సంప్రదింపులు లేకుండా ముందుకు సాగుతోందన్నారు. ఇది సంకుచిత రాజకీయ ప్రయోజనాలతో ప్రేరేపించిన అడుగు అన్నారు. జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, ఉత్తరాది రాష్ట్రాలకు పార్లమెంటులో సీట్లు అనూహ్యంగా పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గుతాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి మంచి ప్రభావం ఉన్నందున ఇది వారికి లాభదాయకమైన ఒప్పందం అవుతుందన్నారు విజయన్.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నేడు దేశం పెద్ద సవాలును ఎదుర్కొంటోందన్నారు. డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలపై జరిమానా విధించాలని బీజేపీ కోరుకుంటోందని ధ్వజమెత్తారు. మనది ఒకే దేశం.. దీనిని గౌరవిస్తాము, కానీ జనాభా ఆధారంగా ఈ సరిహద్దు నిర్ణయాన్ని దక్షిణ భారతదేశం అంగీకరించదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది మనల్ని రాజకీయంగా పరిమితం చేస్తుందని, ఇది మంచి పని కాదన్నారు. నాభా నియంత్రణ, ఆర్థిక పురోగతి చేసినందుకు మనల్ని శిక్షించినట్లే అవుతుందన్నారు. బీజేపీ డీలిమిటేషన్ అమలు చేయకుండా ఆపాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
దక్షిణ భారతదేశం ఎల్లప్పుడూ కుటుంబ నియంత్రణ విధానాలను కొనసాగిస్తూ జనాభాను నియంత్రించిందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. అదే దానిని ప్రగతిశీల ప్రాంతంగా మార్చిందన్నారు. ఎల్లప్పుడూ జాతీయ ప్రయోజనాల కోసం పనిచేశామన్న శివకుమార్.. మన రాష్ట్రాలను డీలిమిటేషన్ ద్వారా వారి సీట్లను తగ్గించడం ద్వారా శిక్షించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇది జరగనివ్వమని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. బీజేపీ గెలిచిన చోట సీట్లను పెంచాలని కోరుకుంటుందని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆరోపించారు. ఓటమిని ఎదుర్కొన్న చోట సీట్లను తగ్గించాలని కోరుకుంటుందన్నారు. అలాంటి డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఒడిశాకు చెందిన బిజు జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ.. దేశ ప్రయోజనాల కోసం కుటుంబ నియంత్రణ పథకాల ద్వారా జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ఆధారంగా డీలిమిటేషన్ అన్యాయం అవుతుందన్నారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ అమలు చేయకూడదన్నారు. అన్ని పార్టీలతో చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై తదుపరి చర్య తీసుకోవాలని నవీన్ పట్నాయక్ సూచించారు.
డీలిమిటేషన్ సమస్య ఏమిటి?
గత 5 దశాబ్దాలుగా దేశంలో ఎలాంటి నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు. ఇది 2026 సంవత్సరం తర్వాత జరుగుతుందని భావిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో, జనాభా ప్రకారం లోక్‌సభ స్థానాలను పంపిణీ చేస్తారు. అంటే, ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రానికి ఎక్కువ సీట్లు లభిస్తాయి. తక్కువ జనాభా ఉన్న రాష్ట్రానికి తక్కువ సీట్లు లభిస్తాయి.
2011 జనాభా డేటాను పరిశీలిస్తే, ఉత్తర భారత రాష్ట్రాలలో జనాభాలో భారీ పెరుగుదల ఉంది. అయితే దక్షిణ భారత రాష్ట్రాలలో జనాభా నియంత్రణలో ఉంది. అటువంటి పరిస్థితిలో, ఉత్తర భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో లోక్‌సభ స్థానాలు భారీగా పెరుగుతాయి. అయితే దక్షిణ భారత రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల ప్రాతినిధ్యం పార్లమెంటులో తగ్గుతుందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ కారణంగానే దక్షిణ భారత రాష్ట్రాలు ఈ అంశంపై కేంద్రంతో ముఖాముఖి తలపడ్డాయి.
ఇదిలావుంటే, డీలిమిటేషన్‌పై డీఎంకే ఏర్పాటు చేసిన సమావేశాన్ని బీజేపీ తప్పుబట్టింది. ఈ భేటీ పెట్టుకున్న వాళ్లంతా దొంగలముఠానే అని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. దేశాన్ని ముక్కలు చేసే విధంగా డీఎంకే వ్యవహరిస్తోందని ధర్మపురి అర్వింద్ ఫైర్ అయ్యారు. డీలిమిటేషన్‌పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మరో ఎంపీ ఈటల రాజేందర్ కామెంట్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..