Uttar Pradesh Road Accident: అంత్యక్రియలకు హాజరై వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. 11మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురిని బలి తీసుకుంది. జౌన్‌పూర్- వారణాసి రహదారిలో జలాల్ పూర్‌లో ఈ ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది..
UP Road Accident: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురిని బలి తీసుకుంది. జౌన్‌పూర్- వారణాసి రహదారిలో జలాల్ పూర్‌లో ఈ ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక ట్రక్కు, పికప్ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పికప్ వ్యానులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, ఎనిమిదిమందికి స్వల్ప గాయాలయ్యాయి. పికప్ వ్యాన్‌లో మొత్తం 17 మంది ప్రయాణిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వారంతా వారణాసిలో ఒక దహన సంస్కారాల కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. జౌన్ పూర్ జిల్లాలోని ఖ్వాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్‌పూర్ నివాసి, 112 ఏళ్ల వృద్ధుడు థన్దేయీ భార్య స్వజోఖన్ యాదవ్ మృతి చెందింది. ఆ దంపతులకు కుమారులు లేరు. దీంతో వారి అల్లుడు లక్ష్మీశంకర్ యాదవ్ తన గ్రామంలోని 17 మందిని తీసుకువచ్చి స్వజోఖన్ యాదవ్‌కు వారణాసిలో దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక వారంతా తిరుగు ప్రయాణం అయ్యారు. ఇదే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
సీరియల్ నటుడి పేరుతో యువతికి కుచ్చుటోపీ.. ఆటకట్టించిన పోలీసులు.. చివరకు ఏమైందంటే..