Ahmedabad plane crash: ‘మళ్లీ మాట్లాడలేనేమో’ .. అక్కతో ఎయిర్ హోస్టెస్ చివరి మాటలు
అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి.. కన్నీటి ధారలతో నిండిపోయింది. బంధువుల రోదనలు మిన్నంటాయి. ఎటు చూసినా హాహాకారాలు.. ఆర్తనాదాలు. లోపల డెడ్‌బాడీస్.. బయట బంధువుల పడిగాపులు. తమ వారి డెడ్‌బాడీ ఎక్కడ ఉందో తెలియదు. అసలు గుర్తించారో లేదో కూడా సమాచారం లేదు. ఎప్పుడు అప్పగిస్తారో తెలియదు. ఓ వైపు కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్పులు.. మరో వైపు తమవారి డెడ్‌బాడీ కోసం ఎదురుచూపులు. అలా ఆస్పత్రి ప్రాంగమణంతా ఏడ్పులు.. పెదబొబ్బలతో కన్నీటిమయంగా మారింది.

మళ్లీ మాట్లాడలేనేమో.. అహ్మదాబాద్‌లో క్రాష్ అయిన ఎయిరిండియా విమానం గాల్లోకి ఎగిరేముందు అక్కతో ఆ ఫ్లైట్ ఎయిర్ హోస్టెస్ అన్న చివరి మాటలివి. ఏదో ప్రమాదాన్ని ఊహించి కాదు.. సుదీర్ఘప్రయాణంలో మళ్లీ మళ్లీ మాట్లాడే అవకాశం వస్తుందో లేదోనని. కానీ ఆమె అన్నట్లే తను ఇక ఎప్పటికీ మాట్లాడలేదు. విమాన ప్రయాణికులు, సహచరులతో పాటు ప్రాణాలు కోల్పోయింది క్రూమెంబర్‌గా ఉన్న ఆ ఎయిర్‌హోస్టెస్. పేరు నగాన్తోయ్ శర్మ. వయసు కేవలం 21ఏళ్లు.
19ఏళ్లకే ఎయిర్ ఇండియాలో ఎయిర్‌హోస్టెస్‌గా చేరింది మణిపూర్‌కి చెందిన నగాన్తోయ్ శర్మ. అదే విమానంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచి వేస్తోంది. ఉదయం11.30 గంటలకు లండన్ వెళ్తున్నట్లు తన అక్కకు ఫోన్ చేసి చెప్పింది నగాన్తోయ్. మళ్లీ మాట్లాడటం కుదరదేమో.. జూన్ 15న తిరిగి వస్తానని సోదరికి సమాచారం ఇచ్చింది. నగాన్తోయ్ శర్మ చివరి మాటలు తలచుకుని కన్నీటిపర్యంతమవుతోంది ఆమె కుటుంబం.
నగాన్తోయ్ మరణవార్త తెలియగానే మణిపూర్‌లోని ఆమె కుటుంబసభ్యులు, బంధుమిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఉద్యోగంలో చేరిన రెండున్నరేళ్లకే నగాన్తోయ్ ఘోరప్రమాదంలో మరణించడంతో తండ్రి, తోడబుట్టువులు కన్నీరుమున్నీరవుతున్నారు. రాత్రివరకు ఎయిర్ ఇండియానుంచి తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదంటోంది ఎయిర్‌హోస్టెస్ కుటుంబం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..