Congress: సోనియా గాంధీతో శశి థరూర్ భేటీ.. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి..
కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నిక సమీపిస్తున్న కొద్ది పార్టీలో హడావుడి పెరుగుతోంది. మరో ఐదు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో సీనియర్ నేత శశి థరూర్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు.

కాంగ్రెస్ నాయకత్వాన్ని కుదిపేసిన G-23లో భాగం తిరువనంతపురం ఎంపీ శశి థరూర్. పార్టీలో సంస్కరణల గురించి ఇటీవల ప్రస్తావించారు శశి థరూర్. వచ్చే నెల జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు శశి థరూర్ సుముఖంగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగడాన్ని థరూర్ స్వాగతించారు, అది పార్టీకి మంచిదని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ యువనేతల సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్న కాంగ్రెస్ సంస్కరణల అజెండాకు శశి థరూర్ జైకొట్టారు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు.
ఈ ఏడాది మే 15న చేపట్టిన ఉదయ్‌పూర్ నవ్ సంకల్ప్ ప్రకటనను పూర్తిగా అమలు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షపదవికి పోటీ చేసే అభ్యర్థులు బహిరంగంగా ప్రతిజ్ఞ చేయాలని ఈ ఆన్‌లైన్ ప్రకటనలో ఉంది. ఈ అప్పీల్‌పై 650 మందికి పైగా సంతకాలు చేశారని శశిథరూర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
సోనియాగాంధీతో ఏం చర్చించారన్నది శశి థరూర్ వెల్లడించలేదు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్ ఈ నెల 24న ప్రారంభం కానుంది. 30 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. అవసరమైతే అక్టోబర్ 17న ఓటింగ్ నిర్వహిస్తారు. ఫలితాన్ని అక్టోబర్ 19న ప్రకటించారు.
మరో వైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. కేరళలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ అక్కడ బోటింగ్‌లో పాల్గొన్నారు. అలపుళ-పున్నమడ సరస్సులో నిర్వహించిన స్నేక్ బోట్‌లో ప్రయాణించారు. ఆయన కూడా కాసేపు తెడ్డు వేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్ కూడా బోటులో ప్రయాణం చేశారు. ఒడ్డుకు వచ్చిన తర్వాత బోటు రేసర్లకు ట్రోఫి అందజేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం




