పెద్ద స్కెచే.. ఐక్యరాజ్యసమితి దౌత్యవేత్తనంటూ బిల్డప్.. సూట్‌కేస్ చెక్ చేస్తే 220కోట్ల సరుకు..
అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలు అధికారుల కళ్లుగప్పేందుకు రోజుకో కొత్త ఎత్తుగడ వేస్తున్నాయి. ఏకంగా ఐక్యరాజ్యసమితి దౌత్యవేత్త ముసుగులో దేశంలోకి భారీ ఎత్తున మత్తుపదార్థాలను తరలించేందుకు చేసిన ప్రయత్నాన్ని అధికారులు చాకచక్యంగా భగ్నం చేశారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విదేశీ మహిళ వద్ద నుంచి ఏకంగా రూ. 220 కోట్ల విలువైన 22 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకుని, ఈ హై-ప్రొఫైల్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు చేశారు.

అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలు కళ్లుగప్పేందుకు రోజుకో కొత్త ఎత్తుగడ వేస్తున్నాయి. ఏకంగా ఐక్యరాజ్యసమితి దౌత్యవేత్త ముసుగులో దేశంలోకి భారీ ఎత్తున మత్తుపదార్థాలను తరలించేందుకు చేసిన ప్రయత్నాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో, సియెర్రా లియోన్ నుంచి వచ్చిన ఒక విదేశీ మహిళ వద్ద రూ. 220 కోట్ల విలువైన 22 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పక్కా నిఘా సమాచారంతో ఢిల్లీ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు నిఘా పెట్టారు. సియెర్రా లియోన్ దేశం నుంచి ఢిల్లీకి చేరుకున్న ఒక విదేశీ మహిళా ప్రయాణికురాలిని అధికారులు అడ్డుకుని తనిఖీ చేయబోయారు. అయితే తాను ఐక్యరాజ్యసమితికి చెందిన దౌత్య కొరియర్‌నని ఆమె అధికారులను నమ్మించే ప్రయత్నం చేసింది.
తన వద్ద ఉన్న పెద్ద బ్రీఫ్‌కేస్‌లో అత్యంత రహస్యమైన దౌత్య పత్రాలు ఉన్నాయని.. డిప్లొమాటిక్ మెయిల్ – అధికారం లేకుండా తెరవకూడదు అనే లేబుల్స్ ఉన్న ఆ బాక్స్‌ను ముట్టుకోవద్దని వాదించింది. అధికారులను పూర్తిగా నమ్మించేందుకు ఐక్యరాజ్యసమితికి చెందినవిగా కనిపించే కొన్ని నకిలీ గుర్తింపు పత్రాలను కూడా చూపించింది.
బ్రీఫ్‌కేస్ తెరిచి చూడగా 22 ప్యాకెట్ల కొకైన్..
ముందుగానే పక్కా సమాచారం ఉండటంతో డీఆర్ఐ అధికారులు ఆమె మాటలను ఏమాత్రం విశ్వసించలేదు. ఆ బ్రీఫ్‌కేస్‌ను స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేయగా అసలు బండారం బయటపడింది. బాక్స్ లోపల ప్లాస్టిక్ కవర్లలో అత్యంత రహస్యంగా ప్యాక్ చేసిన 22 ప్యాకెట్లు లభ్యమయ్యాయి. వాటిలో ఉన్న తెల్లటి పొడిని పరీక్షించగా, అది అత్యంత ఖరీదైన కొకైన్ అని నిర్ధారణ అయింది. స్వాధీనం చేసుకున్న 22 కిలోల కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ. 220 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
NDPS చట్టం కింద అరెస్ట్
నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టం 1985 నిబంధనల ప్రకారం ఆ 22 ప్యాకెట్ల కొకైన్ సరుకును అధికారులు సీజ్ చేశారు. అనంతరం నిందితురాలైన విదేశీ మహిళను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్‌లు అనుసరిస్తున్న ఇలాంటి కొత్త తరహా అక్రమ రవాణా మార్గాలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు తాము నిరంతరం అప్రమత్తంగా ఉన్నామని డీఆర్ఐ అధికారులు స్పష్టం చేశారు.
