Children’s Day: బాలల దినోత్సవం సందర్భంగా 61.84 లక్షల మంది విద్యార్థులకు కేకులు.. సీఎం కీలక నిర్ణయం!
Children's Day Cake Distribution to Students: బాలల దినోత్సవం సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం విద్యార్థులకు ప్రత్యేక కానుక అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 61.84 లక్షల మందికి పైగా విద్యార్థులకు కేకులు, సీఎం సంతకంతో కూడిన గ్రీటింగ్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.9.27 కోట్లు కేటాయించింది.

Children’s Day 2026: తమిళనాడు ప్రభుత్వం బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక బహుమతి అందించనుంది. ఈ ఏడాది బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ కేకులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.9.27 కోట్ల నిధులను కేటాయించింది.
సాధారణంగా ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఈసారి నవంబర్ 13, శుక్రవారం రోజునే తమిళనాడులోని పాఠశాలల్లో ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 61.84 లక్షల మందికి పైగా విద్యార్థులకు కేకులు పంపిణీ చేయనున్నారు. తమిళనాడు చరిత్రలో తొలిసారిగా బాలల దినోత్సవం సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున కేకుల పంపిణీ చేపడుతున్నారు.
సీఎం సంతకంతో గ్రీటింగ్ కార్డులు కూడా..
కేవలం కేకులు మాత్రమే కాకుండా విద్యార్థులకు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సంతకం చేసిన ప్రత్యేక గ్రీటింగ్ కార్డులను కూడా అందించనున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఉన్నత మాధ్యమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఈ కార్డులు పంపిణీ చేయనున్నారు.
12 జిల్లాల్లో ఒక్కొక్కరికి రెండు కేక్ ప్యాకెట్లు
కేకుల కొనుగోలు, పంపిణీ బాధ్యతలను తమిళనాడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ (TNCSC) చేపట్టింది. ఇందుకోసం టెండర్లు పిలిచి నాలుగు ప్రముఖ కేకుల తయారీ సంస్థల నుంచి కేకులను సేకరించింది.
రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఒక్కో విద్యార్థికి 45 గ్రాముల చొప్పున రెండు కేక్ ప్యాకెట్లు అందించనున్నారు. ఈ జిల్లాల్లో మయిలాడుతురై, సేలం, తంజావూరు, మదురై, తిరువణ్ణామలై, తిరుచిరాపల్లి, కోయంబత్తూరు, తిరుప్పూర్, నీలగిరి, ఈరోడ్, నమక్కల్, కరూర్ ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో ఒక్కో విద్యార్థికి 45 గ్రాముల బరువున్న ఒక కేక్ ప్యాకెట్ అందించనున్నారు.
కేకుల నాణ్యతపై తనిఖీలు
విద్యార్థులకు పంపిణీ చేయనున్న కేకుల నాణ్యత విషయంలోనూ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఆహార భద్రత విభాగం ఇప్పటికే కేకుల నిల్వలను తనిఖీ చేసి, నాణ్యతకు సంబంధించిన ధ్రువీకరణ ఇచ్చింది. దీంతో నవంబర్ 13న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో బాలల దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు కేకులు, గ్రీటింగ్ కార్డులు పంపిణీ చేయనున్నారు.
ఇది ఇలావుండగా, తమిళనాడు పాఠశాల విద్యా శాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బూట్లు, సాక్సులు, స్వెటర్లు, రెయిన్కోట్లు అందించేందుకు తమిళనాడు ప్రభుత్వం టెండర్ జారీ చేసింది. ముఖ్యంగా కొండ ప్రాంత జిల్లాల్లో నివసించే విద్యార్థులకు స్వెటర్లు, రెయిన్కోట్లు అందించనున్నారు.
