AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఈ సమ్మర్‌లో హైదరాబాద్‌కు వాటర్ వచ్చేది ఇక్కడ నుంచే..

ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే హైదరాబాద్‌ మహా నగరంలో నీటి కొరత ఏర్పడింది. ఇక రాబోయే వేసవిలో ఇది మరింత ఎక్కవగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో జలమండలి ముందస్తు చర్యలను ముమ్మరం చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌కు నీటి సరఫరా చేసే జలాశయాలు, నీటి శుద్ధి కేంద్రాలను పరిశీలించి, అదనపు నీటి సేకరణ, శుద్ధి సామర్థ్యం పెంపు, నిరంతర సరఫరాకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు.

Hyderabad: ఈ సమ్మర్‌లో హైదరాబాద్‌కు వాటర్ వచ్చేది ఇక్కడ నుంచే..
Hyderabad Water Scarcity
Anand T
|

Updated on: Nov 12, 2026 | 6:41 PM

Share

హైదరాబాద్ మహానగరంలో రాబోయే వేసవిలో ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి లభ్యతపై సవాళ్లు ఎదురయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జలమండలి ముందస్తు చర్యలను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా జలమండలి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్ గురువారం ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలకు సంబంధించిన నీటి సరఫరా వ్యవస్థలను పరిశీలించారు.

ఈ సందర్భంగా గండిపేట, హిమాయత్‌సాగర్‌లోని ప్రెజర్ ఫిల్టర్లు, గండిపేటలో ప్రతిపాదించిన అదనపు 10 ఎంఎల్‌డీ సామర్థ్యం గల ప్రెజర్ ఫిల్టర్ల ఏర్పాటు స్థలం, బుద్వేల్‌లోని 3 ఎంఎల్‌డీ ప్రెజర్ ఫిల్టర్లు, పునరుద్ధరించాల్సిన పాత బుద్వేల్ ఫిల్టర్లు, మీర్‌ఆలంలోని నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, నీటి నాణ్యత, ఇన్‌టేక్ వ్యవస్థలు, శుద్ధి కేంద్రాల పనితీరు, ప్రెజర్ ఫిల్టర్ల సామర్థ్యాన్ని సమీక్షించారు. రాబోయే వేసవిలో ఈ జలవనరుల నుంచి అదనపు తాగునీటిని సేకరించి, శుద్ధి చేసి నగరానికి సరఫరా చేసేందుకు చేపట్టాల్సిన అత్యవసర ప్రత్యామ్నాయ పనులపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా జేఎండీ మయాంక్ మిట్టల్ మాట్లాడుతూ.. అన్ని నీటి శుద్ధి కేంద్రాలు, ప్రెజర్ ఫిల్టర్లను పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేసేలా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వేసవిలో నీటి రంగులో తలెత్తే మార్పుల వల్ల శుద్ధి ప్రక్రియకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా సాంకేతిక పరిష్కారాలను గుర్తించాలని సూచించారు. అదనపు నీటి సేకరణ, శుద్ధి సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రతిపాదించిన అత్యవసర పనులను వెంటనే ప్రారంభించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ట్రాన్స్‌మిషన్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాలు సమన్వయంతో పనిచేసి నగర ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

రాబోయే వేసవిలో తాగునీటి డిమాండ్ పెరిగే అవకాశమున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న జలవనరులను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు అదనపు నీటి సరఫరాకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జలమండలి టెక్నికల్ డైరెక్టర్‌ ప్రభుతో పాటు ట్రాన్స్‌మిషన్, క్యూఏటీ, ఓఅండ్ ఏం విభాగాల అధికారులు ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us