AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: నడుచుకుంటూ వచ్చాడు.. నడుచుకుంటూనే వెళ్లాడు.. ఈ గ్యాప్‌లో జరిగిన సీన్ చూస్తే ఫ్యూజులు ఔటే..

ఈ మధ్యకాలంలో నేరాలు.. దారుణాలు పరిపాటిగా మారాయి.. కరోనా టైమ్‌లో కళ్లెం పడిందనుకున్న క్రైమ్‌ గ్రాఫ్‌ గేట్లు బార్లా తెరిచినట్టు మళ్లీ రంకెలేస్తోంది.

Watch Video: నడుచుకుంటూ వచ్చాడు.. నడుచుకుంటూనే వెళ్లాడు.. ఈ గ్యాప్‌లో జరిగిన సీన్ చూస్తే ఫ్యూజులు ఔటే..
Chain Snatching
Shiva Prajapati
|

Updated on: Nov 11, 2022 | 9:03 PM

Share

ఈ మధ్యకాలంలో నేరాలు.. దారుణాలు పరిపాటిగా మారాయి.. కరోనా టైమ్‌లో కళ్లెం పడిందనుకున్న క్రైమ్‌ గ్రాఫ్‌ గేట్లు బార్లా తెరిచినట్టు మళ్లీ రంకెలేస్తోంది. ఇవన్నీ ఓ లెక్క. పంజాబ్‌లోని తాజాగా చోటు చేసుకున్న ఘటన మరో లెక్క. కాలనీల్లో బైక్‌లపై చక్కర్లు కొట్టడం.. మహిళలు కనిపించగానే చట్టుక్కున చైన్‌ లాగేసుకొని తుర్రుమనడం.. ప్రతిఘటిస్తే దాడికి పాల్పడ్డం.. బెదిరించి నగలు ఎత్తుకెళ్లడం.. ఇలాంటివి ఎన్ని చూడ్లేదూ. కానీ పంజాబ్‌లో ఏం జరిగిందో తెలిస్తే షాక్‌తో నోరెళ్లబెడతారు.

బైక్‌లేదు.. ఫాలో అవ్వడమనే సీనే లేదు.. చాలా సింపుల్‌గా, దర్జాగా నడుచుకుంటూ వచ్చాడు. చూస్తుండగానే పేట్రేగాడు.. చేయాలనుకున్న పని చేసేశాడు. ఎలా దర్జాగా వచ్చాడో అంతకు మించి దర్జాగా వెళ్లిపోయాడు. పంజాబ్‌లో చోటు చేసుకున్న షాకింగ్ చోరీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ మహిళ తన కూతుర్ని స్కూల్‌కు పంపడానికి బయలుతేరుతోంది. ఇందులో భాగంగా బండి స్టార్ట్‌ చేయబోయింది. మహిళ కూతురు పక్కనే ఉంది. ఇంతలో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన కేటుగాడు.. ఏదో అడ్రస్ అడుగుతున్నట్లుగా ఫోజ్ కొట్టాడు. సెకన్ల వ్యవధిలోనే యాక్షన్ చేంజ్ చేశాడు. వెంటనే తన జేబులోంచి గన్ తీసి మహిళకు గురిపెట్టాడు. అదీ పాయింట్‌ బ్లాక్‌ రేంజ్‌లో.. రివాల్వర్‌ చూపి బెదిరిస్తూనే ఆమె మెళ్లో చైన్‌ లాగే ప్రయత్నం చేశాడు. మరోవైపు అతని చోరీని ప్రతిఘటించే ప్రయత్నం చేసిందామె. పాపం ఆ చిన్నారి తన తల్లిని కాపాడేందుకు యత్నించింది. దుండగుడిని లాగింది.

ఎలుకంతా ఆ చిన్నారి.. ఏనుగంత వాడు. పాపను విసిరికొట్టాడు. ఇంతలోనే కాలనీ వాసులు అలెర్టయ్యారు. అయినా వాడు అదరలేదు, బెదరలేదు. తనను సమీపించిన అందరినీ గన్‌తో బెదిరించాడు. అప్పటికే చేతికి చైన్‌ చిక్కింది. మళ్లీ నింపాదిగా వెనక్కివచ్చాడు. కిందపడిన మరో చైన్‌ను తీసుకెళ్లాడు. ఇదంతా కాలనీవాసుల కళ్లెదుటే క్షణాల్లో జరిగింది. బాధితురాలు భయంతో ఇంట్లోకి వెళ్లింది. వాడు నింపాదిగా వెళ్లాడు. కానీ ఈ ఘటనతో చిన్నారి సహా అంతా హడలిపోయారు. కాలనీవాసులు గమనించి అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కారణం వాడి చేతిలో గన్ ఉండటం. కాల్చేస్తానని బెదిరించడంతో అంతా భయంతో హడలిపోయారు. నగలు పోతేపోయాయి.. ప్రాణనష్టం జరగలేదని ఊపిరి పీల్చుకున్నారంతా.

ఇవి కూడా చదవండి

పొద్దు పొద్దునే చోటు చేసుకున్న ఈ ఘటన అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దాంతో ఈ దారుణం వెలుగు చూసింది. సీసీ కెమెరాకు దొరికిన దొంగ.. పోలీసులకు దొరక్కమానడు అని స్థానికులు అంటున్నారు. అయితే, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రతీ ఇంట్లో, కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జనాలకు సూచిస్తున్నారు పోలీసులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..