Farmers Protest: 25 ఎఫ్‌ఐఆర్‌లు.. 19 మంది అరెస్టు.. హైకోర్టుకు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
Farmers Protest: గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ట్రక్టర్ల ర్యాలీలో ఉద్రిక్తత పరిస్థితులు, ఎర్రకోటపై దాడి ఘటనలో ఇప్పటి వరకు 25 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 19 మందిని...
Farmers Protest: గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ట్రక్టర్ల ర్యాలీలో ఉద్రిక్తత పరిస్థితులు, ఎర్రకోటపై దాడి ఘటనలో ఇప్పటి వరకు 25 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 19 మందిని అరెస్టు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ హైకోర్టుకు కేంద్ర సర్కార్ వివరించింది. దర్యాప్తులో భాగంగా మరో 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ కోర్టుకు తెలిపారు. గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన ట్రాక్టర్ల ర్యాలీ అనంతరం ఎంత మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారో చెప్పాలంటూ దాఖలైన పిటిషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆ వివరాలను సమర్పించింది. ఢిల్లీ వాసి ధనుంజయ్ జైన్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆ ఘటనకు బాధ్యుడిగా ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను ఆయన పదవి నుంచి తప్పించాలని కూడా ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.
అయితే ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీఎన్ పటేల్ మాట్లాడుతూ.. దేశంలో చారిత్రక కట్టడాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు మూడు నెలలుగా నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జనవరి 26న ఢిల్లీలో ట్రాక్టర్ పరేడ్ నిర్వహించారు. ఆ ర్యాలీ హింసాత్మక కావడంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అనంతరం వందకుపైగా రైతులు కనిపించడం లేదని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయితే చట్టాల్లో మార్పులు ఉంటాయి తప్ప రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్ర సర్కార్ స్పష్టం చేయడంతో రైతుల ఆందోళనలు ఉధృతం చేశారు. ఇక ఆందోళనలు సద్దుమణిగించేలా కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపింది. ఇక సుప్రీం కోర్టు కూడా ఈ అంశంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి రైతులతో చర్చలు జరిపేలా చర్యలు చేపట్టింది.
Also Read: రైతుల నిరసనలో కొత్త మలుపు, ఆన్ లైన్ లో నేతల ప్రసంగాలకు ఇక ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ !