‘ఎండిపోయిన లావా ”రాతికోట” లా మారిపోయిందే ! మహారాష్ట్రలో నాటి అగ్నిపర్వత విస్ఫోట ఫలితం ?
మహారాష్ట్ర లోని యావత్ మల్ జిల్లాలో సుమారు 6 కోట్ల ఏళ్ళ క్రితం ఏర్పడినదిగా భావిస్తున్న ఓ అరుదైన 'రాతి కోట' వంటిదాన్ని భూగర్భ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.
మహారాష్ట్ర లోని యావత్ మల్ జిల్లాలో సుమారు 6 కోట్ల ఏళ్ళ క్రితం ఏర్పడినదిగా భావిస్తున్న ఓ అరుదైన ‘రాతి కోట’ వంటిదాన్ని భూగర్భ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈ జిల్లాలోని షిబ్లా-పర్ది గ్రామంలో కూలీలు రోడ్డు నిర్మాణ పనుల్లో ఉండగా ఇది బయట పడింది. దాదాపు ఆరు కోట్ల సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో అగ్నిపర్వతం బద్దలై విరజిమ్మిన లావా క్రమేణా ఎండిపోయి ఇలా ఏర్పడిందని సురేష్ చౌపానే అనే జియాలజిస్ట్ తెలిపారు. సహజ సిద్ధంగా ఏర్పడిన ఇది విచిత్రంగా ఉందన్నారు. ఈ జిల్లాలోని ఈ ప్రాంతం భౌగోళికంగా అత్యంత పురాతనమైనదని పర్యావరణ మంత్రిత్వ శాఖలోని సాధికారిక కమిటీ మాజీ సభ్యుడు కూడా అయిన ఈయన చెప్పారు. ఇదే ప్రాంతంలో తాము సుమారు రెండు కోట్ల ఏళ్ళ నాటి ఇసుకపొరలతో కూడిన సెడిమెంటరీని కూడా కనుగొన్నామన్నారు. మాలెగావ్ తహశీల్ ప్రాంతంలో 60 లక్షల సంవత్సరాల క్రితం నాటి శంఖు శిలాజాలను…చూసి విస్మయం చెందామన్నారు. ఒకప్పుడు విదర్భ ప్రాంతంలో సముద్రం ఉండేదని కానీ వివిధ వాతావరణ మార్పుల కారణంగా అది కనుమరుగైందన్నారు. సెంట్రల్ ఇండియాలో మహారాష్ట్రతో బాటు 5 లక్షల చదరపు కిలోమీటర్ల వరకు వోల్కనో (అగ్నిపర్వతం) విస్తరించి ఉండేదని భావిస్తున్నామని ఆయన చెప్పారు.
కర్ణాటక లోని సెయింట్ మేరీ ద్వీపంలోనూ ఈ విధమైన బెసాల్ట్ (రాతి వంటి కట్టడాలు) ఏర్పడ్డాయని, వాటిని చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని ఆ జియాలజిస్టు వెల్లడించారు. ముంబై, కొల్హాపూర్, నాందేడ్ ప్రాంతాల్లో ఈ విధమైన శిలలను చూశామని.. కానీ ఇంత పెద్ద రాతి కట్టడం యావత్ మల్ జిల్లాలో కనబడడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. వేడి లావా నదిలోకి ప్రవహించి చల్లబడుతుందని..ఆ తరువాత మారిపోయి హెట్రోజెన్ షేపులో ఇలా రాతి పిల్లర్స్ గా ఏర్పడుతుందన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో రాకాసి బల్లులు, జంతువులు ఉండేవి.. కానీ వాతావరణ [పరిస్థితులు మారిపోయి.. అగ్నిపర్వత విశ్ఫోటనాల వల్ల అవి అంతరించిపోయాయన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Sputnik Vaccine: వ్యాక్సినేషన్‌లో ‘స్పుత్నిక్ వీ’ ఊసేదీ..? మార్కెట్లో పెద్దగా కనిపించని రష్యన్ వ్యాక్సిన్..