AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకసారి 60 కోట్లు, ఇంకోసారి 25 కోట్లు ఆఫర్ చేశారు.. అవినీతిపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

ప్రైవేట్ స్కూల్ విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ గూధా.. దేశంలో అవినీతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒకసారి 60 కోట్లు, ఇంకోసారి 25 కోట్లు ఆఫర్ చేశారు.. అవినీతిపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
Money
Janardhan Veluru
|

Updated on: Aug 03, 2022 | 12:39 PM

Share

రాజకీయాల్లో అవినీతి రోజురోజుకీ పెరిగిపోతోందన్న విమర్శలున్నాయి. మరీ ముఖ్యంగా రాజ్యసభ ఎన్నికల్లో భారీ ఎత్తున అవినీతి జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  ఈ నేపథ్యంలో అవినీతిపై రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ గూధా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు తెరలేపాయి. ప్రైవేట్ స్కూల్ విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి.. దేశంలో అవినీతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓ అభ్యర్థికి అనుకూలంగా ఓటువేస్తే రూ.25 కోట్ల ముడుపులు ఇస్తామని గతంలో తనకు ఆశచూపినట్లు ఆయన వెల్లడించారు. దీనిపై తన భార్య, పిల్లలతో మాట్లాడానని తెలిపిన ఆయన.. డబ్బు కంటే గౌరవమే ముఖ్యమని వారు చెప్పారని అన్నారు. డబ్బు తీసుకుంటే మీ ప్రతిష్ట మసకబారిపోతుందని తన భార్య హెచ్చరించారని చెప్పారు.

అలాగే మరో సందర్భంలో రూ.60 కోట్ల ముడుపులు ఇవ్వచూపారని మంత్రి వెల్లడించారు. అయితే అప్పుడు కూడా తన భార్య, పిల్లలు.. డబ్బు కంటే గౌరవమే ముఖ్యమని సలహా ఇచ్చారని చెప్పుకొచ్చారు. దేశంలో అందరూ ఇలా ఆలోచిస్తే అవినీతిని అంతమొందించవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే  రూ.60 కోట్ల ముడుపులు ఎందుకు ఇవ్వచూపారో మంత్రి వెల్లడించలేదు.

కాగా రాజేంద్ర సింగ్‌ వివాదాస్పద నేతగా పేరుగాంచారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి అశోక్ గెహ్లాట్ కేబినెట్‌లో మంత్రి అయ్యారు. సరైన సమయంలో తాను కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతానంటూ గతంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ‘గేమ్‌’లో ఏమైనా తప్పుందా? అంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మరో సందర్భంలో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. హేమ మాలిన బుగ్గల్లా కాకుండా.. కత్రినా కైఫ్ బుగ్గల్లా తన గ్రామ రోడ్లను తయారు చేయాలంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అసభ్యకరంగా ఎవరూ మాట్లాడకూడదంటూ సీఎం అశోక్ గెహ్లాట్ మంత్రికి క్లాస్ పీకడంతో ఆ వివాదం చల్లారింది.

బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో మంత్రి పార్థ చటర్టీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీని అరెస్టు చేసిన ఈడీ అధికారులు.. అర్పిత ఫ్లాట్ల నుంచి రూ.51 కోట్లు స్వాధీనం చేసుకోవడం తెలిసిందే.  తాజాగా రాజకీయాల్లో అవినీతిపై రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..