Rajasthan Elections 2023: రాజస్థాన్‌లో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? వసుంధర రాజే సహా రేసులో పలువురు నేతలు.. సర్వేలో ఎవరు ముందున్నారంటే..?
Rajasthan Election News in Telugu: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే విషయంలో ఆమె వ్యవహారశైలి కారణంగానే 2018లో పార్టీ ఓటమిపాలైందన్న భావన పార్టీ నేతల్లో ఉంది. అలాగని 2 పర్యాయాలు (2003-2008, 2013-2018) ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆమెను కాదని మరొకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఆమె తిరుగుబాటు చేస్తారన్న ఆందోళన కూడా అధినేతల్లో ఉంది.
Rajasthan Election News: భారతీయ జనతా పార్టీ (BJP) రాజస్థాన్‌లో విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందే ప్రకటించాలా వద్దా అన్నది ఒక సమస్య కాగా.. ఒకవేళ ప్రకటించాల్సి వస్తే ఎవరిని ప్రకటించాలి అన్నది కమలనాథులకు మరో సమస్యగా మారింది. అప్పటికే అధికారంలో ఉండి, ముఖ్యమంత్రిపై సానుకూలత ఉన్నప్పుడు ముందే ప్రకటించినా.. ప్రకటించకపోయినా అప్రకటిత ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొనసాగుతుంటారు. అయితే రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే విషయంలో ఆమె వ్యవహారశైలి కారణంగానే 2018లో పార్టీ ఓటమిపాలైందన్న భావన పార్టీ నేతల్లో ఉంది. అలాగని 2 పర్యాయాలు (2003-2008, 2013-2018) ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆమెను కాదని మరొకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఆమె తిరుగుబాటు చేస్తారన్న ఆందోళన కూడా అధినేతల్లో ఉంది.
మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి పోటీపడుతూ పలువురు రాజస్థాన్ నేతలు ఎవరికి వారు తమ తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొందరైతే ఏకంగా పార్టీలో తమ తమ గ్రూపులను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్ మాదిరిగా వర్గపోరు, అంతర్గత కలహాల వంటి పరిస్థితిని రాజస్థాన్ బీజేపీ ఎదుర్కొంటోంది. మరీ కాంగ్రెస్ స్థాయిలో కాకపోయినా ఈ వర్గపోరు బీజేపీ అధిష్టానానికి తలనొప్పిగానే మారింది. అందుకే ఈ మధ్య అజ్మీర్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన బహిరంగ సభలో వసుంధర రాజే సహా సీఎం పీఠం ఆశిస్తున్న ముఖ్యనేతలందరినీ ఒకే వేదికపై కూర్చోబెట్టి ‘ఏక్‌తా’ (ఐక్యత) రాగం పాడించింది. కర్ణాటకలో రాష్ట్ర నాయకత్వాన్ని పక్కన పెట్టి ప్రచార బాధ్యతలను పూర్తిగా ప్రధాని తన భుజాలపై వేసుకోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగిందని అగ్రనేతలు గ్రహించారు. అందుకే అజ్మీర్ సభా వేదికపై రాష్ట్రంలో బలమైన నాయకులందరికీ చోటు కల్పించి ఓటర్లకు విశ్వాసం కల్పించే ప్రయత్నం చేశారు.
సర్వేల్లో ముందంజలో వసుంధర రాజే!
ఎన్నికల సమయంలో సర్వేలు సాధారణమే అయినప్పటికీ రాజస్థాన్‌లో బీజేపీకి మాత్రం తాజాగా ఓ సంస్థ నిర్వహించిన సర్వే కీలకంగా మారింది. సర్వే అంచనాలు నూటికి నూరుపాళ్లు నిజం కాకపోయినా ప్రజల నాడి ఎంతో కొంత తెలుస్తుందని పార్టీలు భావిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో తాజా సర్వే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బీజేపీ మద్ధతుదారుల్లో 38 శాతం మంది తమకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా వసుంధర రాజేయే ఉండాలని కోరుకుంటున్నారు. అంతే కాదు.. కాంగ్రెస్ మద్ధతుదారులను బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎవరుంటే బావుంటుందని ప్రశ్నించగా.. 37 శాతం మంది వసుంధర పేరే చెప్పినట్టు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఇప్పటికే 2 పర్యాయాలు సీఎంగా పనిచేసి ఉండడం, 2018లో ఓటమి తర్వాత దాదాపు కనిపించకుండా పోయి సరిగ్గా ఎన్నికల సమయంలో బయటకు రావడం వంటి కారణాలతో ఈ సీఎం సారి రేసులో వసుంధర రాజే ఉండదని సీఎం పదవి ఆశిస్తున్న మిగతా నేతలు భావించారు. కానీ పార్టీ కేడర్‌లో ఇప్పటికీ వసుంధర రాజేపై అభిమానం తగ్గలేదని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. రాజేను సీఎం అభ్యర్థిగా ఎన్నికలకు ముందే ప్రకటించాలంటూ చాలా కాలం నుంచే డిమాండ్ చేస్తున్న ఆమె మద్ధతుదారులకు ఈ సర్వే ఫలితాలు మరింత బలాన్నిచ్చాయి. ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలు ఇలా ఉంటే.. బీజేపీ సొంతంగా ఒక సర్వే, ఆ పార్టీ సైద్ధాంతిక మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) విడిగా మరొక సర్వే జరిపినట్టు తెలిసింది. చేసిన అభివృద్ధిని చెప్పుకుని ఓట్లు అడిగే విధానం కర్ణాటక విషయంలో బెడిసికొట్టడంతో వివిధ సర్వేలను బేరీజు వేసుకుని ప్రజానాడి పసిగట్టాలని, తదనుగుణంగా వ్యూహాలు రచించాలని కాషాయదళం భావిస్తోంది.
రేసులో ఉన్న మిగతా నేతలెవరు?
ఇప్పటికీ పార్టీలో బలమైన నేతగా ఉన్న వసుంధర రాజేను కాదని ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న రాజస్థాన్ ముఖ్యనేతల్లో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సతీష్ పూనియా, రాజ్‌సమంద్ లోక్‌సభ ఎంపీ – జైపూర్ రాజ కుటుంబానికి చెందిన దియా కుమారి ఉన్నారు. సర్వే ఫలితాల ప్రకారం వసుంధర రాజే తర్వాతి స్థానంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నారు. జోధ్‌పూర్‌కు చెందిన ప్రముఖ రాజ్‌పుత్ నాయకుడిగా షెకావత్‌కు ఇమేజ్ ఉంది. జల్ శక్తి శాఖ మంత్రిగా గజేంద్ర సింగ్ షెకావత్ ప్రధాని మోడీ పథకం ‘హర్ గహర్ జల్’ పథకాన్ని సాకారం చేయడంలో విశేషంగా కృషి చేస్తున్నారు. కానీ రాజస్థాన్‌లోని సంజీవిని స్కామ్‌లో పదే పదే ఆయన పేరు వినిపిస్తోంది.
మూడవ స్థానంలో పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాట్ నాయకుడు సతీష్ పూనియా. అధ్యక్షుడిగా పదవీకాలం ముగిసిన తర్వాత మరోసారి కొనసాగించకుండా ఆయన స్థానంలో బ్రాహ్మణ నేత సీపీ జోషిని నియమించారు. సీఎం పీఠంపై కన్నేసిన నేతలు నిత్యం ప్రజల్లో ఉంటూ తమ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తన ప్రాంతమైన కోటాలో ఈ మధ్య దూకుడుగా పర్యటిస్తున్నారు. గజేంద్ర సింగ్ షెకావత్ జోధ్‌పూర్‌లో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. సతీష్ పూనియా ఆస్ట్రేలియా పర్యటన తర్వాత తన ప్రాంతం అంబర్‌లో పర్యటిస్తున్నారు.
రాజేంద్ర రాథోడ్ తన నియోజకవర్గం చురు, బికనీర్ మరియు అజ్మీర్ వంటి ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాథోడ్, 1990 నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధిస్తూ తిరుగులేని ట్రాక్ రికార్డును నెలకొల్పారు. బీజేపీలోని బలమైన రాజ్‌పుత్ నాయకులలో ఒకరిగా రాథోడ్ గుర్తింపు పొందారు. జాట్ ఆధిపత్య ప్రాంతాల్లో కూడా ఆయనకు గణనీయమైన మద్దతు ఉండడం విశేషం. అయితే రాథోడ్ ఒకప్పుడు వసుంధర రాజేకు వీర విధేయుడు. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుడి భుజంలా వ్యవహరించారు. కానీ ఇప్పుడు విబేధించి విడిగా తన పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. లిక్కర్ స్మగ్లర్ దారా సింగ్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై రాథోడ్‌ను సీబీఐ అరెస్టు కూడా చేసింది. అయితే విచారణ అనంతరం కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అతన్ని నిర్దోషిగా ప్రకటించాయి.
ఐక్య రాజ్య సమితి వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఉన్న రాజాసమంద్ ఎంపీ దియా కుమారి కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్న విషయం తెలిసిందే. జైపూర్ రాజ కుటుంబం నుంచి రావడం ఒకెత్తయితే, ఆమె రాజకీయ ఆరంగేట్రం కూడా ఆకట్టుకుంది. 2013లో బీజేపీలో చేరి ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న గిరిజన నాయకురాలు కిరోడి లాల్ మీనాను ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో రాజాసమంద్ నుంచి దియా లోక్‌సభ ఎంపీ అయ్యారు. రాజకీయంగా ఆమెకు క్లీన్ ఇమేజ్ ఏర్పడింది. నిబద్ధత కలిగిన నాయకురాలిగా, తన నియోజకవర్గం కోసం నిత్యం కృషి చేసే నేతగా ప్రజల మన్నన పొందారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తరచుగా కేంద్రంలోని మంత్రులను కలుస్తుంటారు.
రేసులో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్..
రేసులో వినిపిస్తున్న మరో పేరు అశ్విని వైష్ణవ్. ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారిగా పనిచేసిన వైష్ణవ్ సొంత రాష్ట్రం మాత్రం రాజస్థానే. రైల్వే, ఐటీ, టెలీకాం వంటి కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న అశ్విని వైష్ణవ్‌ను కేంద్రం నుంచి వదులుకోడానికి బీజేపీ అగ్ర నేతలు అంగీకరించకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాగ మొత్తానికి సీఎం రేసులో ఉన్న ప్రతి నేతకు కొన్ని సానుకూలాంశాలు, మరికొన్ని ప్రతికూలాంశాలు కనిపిస్తున్నాయి. వీటన్నింటి మధ్య సర్వేలో వసుంధర రాజేకే ఎక్కువ మంది ఓటేయడం, 2008లో ఓటమి తర్వాత 2013లో మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన చరిత్ర ఆమెకు అనుకూలాంశాలుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్ర పార్టీలో నెలకొన్న వర్గ పోరును పరిష్కరించడంపై అధిష్టానం దృష్టి పెట్టింది. ఇంత మంది నేతలు టాప్ సీట్‌ను ఆశిస్తున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే మిగతావారంతా నిరాశ చెంది ఎన్నికల్లో సహాయ నిరాకరణ చేస్తారని అధిష్టానం ఆందోళన చెందుతోంది. గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయించవచ్చన్న భావనలో కమలనాథులు ఉన్నట్టు కొందరు చెబుతుంటే.. ఎన్నికలకు దాదాపు నెల రోజుల ముందు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. తద్వారా నాయకులందరూ కలిసికట్టుగా ఎన్నికలను ఎదుర్కోవడం తప్ప మరో మార్గం లేకుండా పోతుందని విశ్లేషిస్తున్నారు. విబేధాలు మొత్తంగా పార్టీకే చేటు చేస్తాయన్న వాస్తవాన్ని గ్రహించి, ప్రత్యర్థి కాంగ్రెస్ మాదిరిగా గ్రూపులు కట్టి తగవులాడుకోకుండా ముందు పార్టీని అధికారంలోకి తీసుకురావడంపై దృష్టి పెడితే మంచిదని నేతలకు హితవు పలుకుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..