AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber crime: మార్ఫింగ్‌ ఫొటోలతో మహిళా జడ్జి టార్గెట్.. రూ.20 లక్షలు డిమాండ్ చేసిన కేటుగాడు.. చివరికి!

Cyber crime: న్యాయమూర్తి పిల్లల చదువుతోన్న స్కూల్ నుంచి ఈ పార్సిల్‌ను తీసుకొచ్చినట్లు స్టెనోగ్రాఫర్‌కు చెప్పిన నిందితుడు.. తన పేరు చెప్పకుండా అక్కడి నుంచి జారుకున్నాడు. మళ్లీ 20 రోజుల తర్వాత అలాంటి పార్సిల్‌ మరొకటి జడ్జి ఇంటికి పంపించాడు.

Cyber crime: మార్ఫింగ్‌ ఫొటోలతో మహిళా జడ్జి టార్గెట్.. రూ.20 లక్షలు డిమాండ్ చేసిన కేటుగాడు.. చివరికి!
Cyber Crime
Balaraju Goud
|

Updated on: Mar 10, 2023 | 1:02 PM

Share

మారుతున్న కాలానుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగాలు విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాలా కీలక వనరుగా మారుతోంది. ఎన్నో పనులను తేలిక చేస్తోంది. ప్రజల జీవనాన్ని మరింత సులభతరం చేస్తోంది. అయితే, ఎంతో విలువైన ఈ టెక్నాలజీని ఇప్పుడు సైబర్ నేరగాళ్లు కూడా వినియోగించుకుంటున్నారు. దీని ద్వారా కనిపించుకుండానే దోపిడీలకు పాల్పడుతున్నారు.

తాజాగా, ఓ ప్రబుద్ధుడు మార్ఫింగ్ ఫోటోలతో ఓ మహిళా న్యాయమూర్తిని మాయ చేశాడు. ఏకంగా ఫోన్ చేసి రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాను కోరినంత ఇవ్వకుంటే ఆ ఫోటోలను బయటపెడతానని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టి నిందితుడ్ని గుర్తించారు. పరారీలో ఉన్న కేటుగాడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు జైపూర్ పోలీసులు.

మహిళా జడ్జికి సంబంధించిన ఫొటోలను సైబర్ కేటుగాడు సోషల్ మీడియాలోని ఆమె అకౌంట్ నుంచి డౌన్‌లోడ్‌ చేసి మార్ఫింగ్‌ చేశాడు. కోర్టులోని న్యాయమూర్తి ఛాంబర్‌తోపాటు ఆమె ఇంటికీ వాటిని కొరియర్‌లో పంపాడు. ఫిబ్రవరి 7న స్టెనోగ్రాఫర్‌ ద్వారా ఈ పార్సిల్‌ అందుకున్న న్యాయమూర్తి.. అందులో తన మార్ఫింగ్ ఫోటోలను చూసి షాక్ అయ్యారు. అందులో స్వీట్లు, అసభ్యకరమైన ఫొటోలతో పాటు ఓ బెదిరింపు లేఖ కూడా రాసిపెట్టాడు. రూ.20లక్షలతో సిద్ధంగా ఉండాలని.. లేదంటే ఫొటోలను బయటపెడతానని హెచ్చరించాడు.

అంతేకాదు తాను కోరినంత డబ్బు ఇవ్వకపోతే నీ జీవితాన్ని నాశనం చేస్తానంటూ నిందితుడు బెదిరింపులకు దిగాడు. డబ్బు ఎప్పుడు, ఎక్కడకు, ఎలా పంపించాలో త్వరలోనే తెలియజేస్తానంటూ పేర్కొన్నాడు. న్యాయమూర్తి పిల్లల చదువుతోన్న స్కూల్ నుంచి ఈ పార్సిల్‌ను తీసుకొచ్చినట్లు స్టెనోగ్రాఫర్‌కు చెప్పిన నిందితుడు.. తన పేరు చెప్పకుండా అక్కడి నుంచి జారుకున్నాడు. మళ్లీ 20 రోజుల తర్వాత అలాంటి పార్సిల్‌ మరొకటి జడ్జి ఇంటికి పంపించాడు. దీంతో మహిళా న్యాయమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జైపూర్ పోలీసులు.. ఫిబ్రవరి 28న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కోర్టు ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడ్డ సదరు కేటుగాడి వయసు 25 ఏళ్లు ఉంటుందని పోలీసులు అంచనాకు వచ్చారు. పరారీలో ఉన్న అతగాణ్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి