AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ బోనాంజా.. భారీగా జీతాలు పెరిగే అవకాశం..

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.26,000కి పెరుగుతుందని అంచనా. ఈ నెలలోనే  ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ)ని సవరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ బోనాంజా.. భారీగా జీతాలు పెరిగే అవకాశం..
Cash
Madhu
| Edited By: |

Updated on: Mar 10, 2023 | 5:00 PM

Share

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో గుడ్‌ న్యూస్‌ చెప్పే అవకాశం ఉంది. ఏడో వేతన కమిషన్‌ సిఫార్సుల మేరకు డియర్‌నెస్‌ అలవెన్స్‌(డీఏ), ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ పెంపుదలపై కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎంత మేర వారికి డీఏ పెరుగుతుంది? ఫిట్‌మెంట్‌ ఎంత రావచ్చు? వీటి వల్ల వారి జీతభత్యాలలో తేడాలు ఎలా ఉంటాయి? ఎంత మేర వారి జీతాలు పెరగనున్నాయి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మీడియా వర్గాల సమాచారం ప్రకారం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.26,000కి పెరుగుతుందని అంచనా. ఈ నెలలోనే  ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ)ని సవరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్.. సాధారణ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రస్తుతం 2.57 శాతంగా ఉంది. అంటే ఎవరైనా, 4200 గ్రేడ్ పేలో ప్రాథమిక వేతనం రూ. 15,500 పొందుతుంటే.. అతని మొత్తం వేతనం రూ. 15,500×2.57 లేదా రూ. 39,835 అవుతుంది. 6వ వేతన సవరణలో ఈ ఫిట్‌మెంట్ నిష్పత్తిని 1.86గా సిఫార్సు చేసింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి ఫిట్‌ మెంట్‌ ఫ్యాక్టర్‌ను 3.68 వరకూ పెంచాలని ఉద్యోగులు డిమాండ్‌  చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ప్రస్తుతం రూ.18,000 కనీస వేతనం ఉండే ఉద్యోగికి కనీసం వేతనం రూ. 26,000కు చేరుతుంది.

ఇవి కూడా చదవండి

డీఏ పెంపు ఇలా.. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్)లను సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తారు. సవరించినవి జనవరి 1,  జూలై 1 నుంచి అమలులోకి వస్తాయి. సెప్టెంబరు 2022లో జరిగిన చివరి పెంపుతో దాదాపు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందారు. అప్పుడు డీఏను 4శాతం 38 శాతానికి పెంచారు. దీనికి ముందు, ప్రభుత్వం 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు గతేడాది మార్చిలో 3 శాతం నుండి 34 శాతానికి డీఏను పెంచింది. ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌తో సంబంధం లేకుండానే ఈ డీఏను సవరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

18 నెలల డీఏ బకాయిలు.. ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌, డీఏ, డీఆర్‌ సవరణలతో పాటు 18నెలల డీఏ బకాయిలు కూడా అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక చేస్తున్నట్లు మీడియా వర్గాల సమాచారం. కోవిడ్‌ 19 కారణంగా ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు మూడు విడతల డీఏలను ప్రభుత్వం పెండింగ్‌ లో ఉంచింది. అంటే 2020 జనవరి 1, 2020 జూలై 1, 2021 జనవరి 1 తేదీల్లో ఇవ్వాల్సిన డీఏలను నిలిపుదల చేసింది. ఇప్పుడు వీటిని కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

హెచ్ఆర్ఏ నిబంధనలు..

ఈ ఏడాది జనవరిలో ఏడో వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం(హెచ్‌ఆర్‌ఏ) నిబంధనలను సవరించింది. కొన్ని పరిస్థితుల్లో హెచ్‌ఆర్‌ఏ పొందేందుకు అర్హులు కారని పేర్కొంది. అవేంటో చూద్దాం..

  • ఉద్యోగి ప్రభుత్వం కేటాయించిన వసతి వినియోగించుకున్నా.. లేదా మరొక ఉద్యోగికి ఇచ్చిన వసతిని పంచుకు‍న్నా హెచ్‌ఆర్‌ఏ రాదు.
  • ఉద్యోగి తన తల్లిదండ్రులు/కొడుకు/కూతురికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్వయంప్రతిపత్తి కలిగిన పబ్లిక్ అండర్‌టేకింగ్ లేదా మున్సిపాలిటీ, పోర్ట్ ట్రస్ట్, జాతీయం చేయబడిన బ్యాంకులు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వంటి సెమీ-ప్రభుత్వ సంస్థ ద్వారా కేటాయించిన వసతి గృహంలో నివసిస్తుంటే హెచ్‌ఆర్‌ఏ వర్తించదు.
  • ఉద్యోగి జీవిత భాగస్వామికి అదే స్టేషన్‌లో కేంద్ర ప్రభుత్వం/ రాష్ట్ర ప్రభుత్వం/ స్వయంప్రతిపత్తమైన పబ్లిక్ అండర్‌టేకింగ్/ మున్సిపాలిటీ, పోర్ట్ ట్రస్ట్ మొదలైన సెమీ-ప్రభుత్వ సంస్థ ద్వారా వసతి కేటాయించబడినా.. ఉద్యోగి ఆ వసతిలో నివసించినా లేదా  అద్దెకు తీసుకున్న వసతి గృహంలో విడిగా నివసిస్తున్నా హెచ్‌ఆర్‌ఏకు అర్హులు కారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..