AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: 2014లో పవన్ కళ్యాణ్.. 2024లో రాజ్ థాక్రే.. ఇద్దరి దారీ ఒకటే

పదేళ్ల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నడిచిన బాటలో నేడు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ థాకరే నడుస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా బేషరతుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)కు మద్ధతు తెలుపుతున్నారు.

Maharashtra: 2014లో పవన్ కళ్యాణ్.. 2024లో రాజ్ థాక్రే.. ఇద్దరి దారీ ఒకటే
Raj Thackeray
Mahatma Kodiyar
| Edited By: Srikar T|

Updated on: Apr 10, 2024 | 5:37 PM

Share

పదేళ్ల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నడిచిన బాటలో నేడు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ థాకరే నడుస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా బేషరతుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)కు మద్ధతు తెలుపుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయానికి జనసేన పోటీకి సిద్ధంగా లేదని, బేషరతుగా తెలుగుదేశం (TDP), భారతీయ జనతా పార్టీ (BJP)లకు మద్దతు తెలుపుతున్నానని నాడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రతిఫలంగా శాసన మండలిలోనో లేక రాజ్యసభలోనో పదవి తీసుకుని మంత్రివర్గంలో చేరే అవకాశం ఉన్నప్పటికీ.. నాడు పవన్ కళ్యాణ్ ఎలాంటి పదవి కోరుకోలేదు. ఇప్పుడు రాజ్ థాకరే కూడా అదే బాటలో నడుస్తున్నారు. తనకు శానస మండలి లేదా రాజ్యసభ పదవులు ఏమీ వద్దని, తదుపరి జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకే సమాయత్తమవుతానని ప్రకటించారు. ముఖ్యంగా దేశానికి బలమైన నాయకత్వం కావాలని కోరుకుంటున్నానని, అది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోనే సాధ్యపడిందని వ్యాఖ్యానించారు. బీజేపీ కంటే ముందు నరేంద్ర మోదీ ప్రధాని కావాలని బహిరంగంగా ప్రకటించిన వ్యక్తినని పదేళ్ల క్రితం నాటి మాటలను ఆయన గుర్తుచేస్తున్నారు. తనకు ఏదైనా నచ్చితేనే మెచ్చుకుంటానని, ఆర్టికల్ 370 రద్దు వంటి నిర్ణయాలు తనకు నచ్చాయని సూత్రీకరిస్తున్నారు.

తెలుగువారు ఉగాది పేరుతో జరుపుకునే కొత్త సంవత్సరాన్ని మహారాష్ట్రలో మరాఠీలు గుడి పడ్వా పేరుతో జరుపుకుంటారు. ఆ సందర్భంగా మంగళవారం ముంబైలోని శివాజీ పార్కులో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో ప్రసంగించిన ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ థాకరే.. తాను బేషరతుగా ‘మహాయుతి’ కూటమికి మద్దతిస్తున్నానని ప్రకటించారు. జాతీయస్థాయిలో ఎన్డీఏగా వ్యవహరిస్తున్నప్పటికీ.. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ -NCP (అజిత్ పవార్ వర్గం) కలిసి ఏర్పాటు చేసిన కూటమి పేరే ‘మహాయుతి’. ఆ రాష్ట్రంలో శివసేన (ఉద్దవ్ థాకరే వర్గం), కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)తో ఉన్న ‘మహావికాస్ అఘాఢీ’కి పోటీగా ‘మహాయుతి’ ఏర్పాటైంది. ఇప్పుడు ఇందులో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన కూడా చేరడంతో మరింత బలోపేతమైంది. శివాజీ పార్క్ సభలో మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ కోసమే మహాయుతికి బేషరతు మద్దతు ఇస్తున్నానని రాజ్ థాకరే అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో MNS పోటీ చేయదని, అయితే కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. దేశం ఉజ్వల భవిష్యత్తు కోసం రాబోయే కొన్నేళ్లలో దేశానికి బలమైన నాయకత్వం అవసరమని, అందుకే తాను ఎలాంటి పదవులు ఆశించకుండా మద్దతు ప్రకటిస్తున్నానని స్పష్టం చేశారు. అలాగే ముంబైలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చలు జరుపుతున్నప్పుడు సీట్ల పంపకాల విషయంలో తనను ఇబ్బంది పెట్టవద్దని చెప్పానని రాజ్ థాకరే అన్నారు. తనకు రాజ్యసభ, శాసన మండలి పదవుల కన్నా ఈ దేశానికి మంచి నాయకత్వం అందించడమే ముఖ్యమని చెప్పినట్టుగా గుర్తుచేశారు.

నాడు ఉద్ధవ్ థాకరేతో విబేధించి.. నేడు షిండేతో చేతులు కలిపి..

బాల్ థాకరే హయాంలో మహారాష్ట్రంలో బలమైన పార్టీగా ఉన్న శివసేనలో ఆయన మరణానంతరం కుటుంబంలో ఆధిపత్య పోరు తలెత్తడంతో చీలిక ఏర్పడింది. ఉద్దవ్ థాకరేతో విబేధించిన రాజ్ థాకరే, 2006లో శివసేన నుంచి బయటకొచ్చి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ముంబై పరిసర ప్రాంతాల్లో తప్ప రాష్ట్రవ్యాప్తంగా పెద్దగా పట్టు సాధించలేకపోయారు. ఎప్పుడైతే శివసేన తమ భావజాలానికి, సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో జతకట్టింతో ఆ పార్టీలో ఉన్న ఏక్‌నాథ్ షిండే సహా పలువురు నేతలకు ఆ చర్య నచ్చలేదు. వారంతా కలిసి ప్రభుత్వాన్ని కూలదోసి మరీ బయటికొచ్చి శివసేన చీలిక వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరిణామాలు ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరేకు కొంత ఆశాజనకంగా కనిపించాయి. శివసేన ఉద్ధవ్ వర్గంలో మిగిలిన నేతల్లో కూడా ఇప్పటికీ చాలా మందికి ఆ పార్టీ కాంగ్రెస్‌తో జతకట్టడం ఇష్టం లేదు. అలాంటివారిని షిండే పూర్తిగా తనవైపు తిప్పుకోలేకపోయారు. కానీ రాజ్ థాకరే వారిని ఆకర్షించే అవకాశం ఉంది. అందుకే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. ఈలోగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడం ద్వారా అసెంబ్లీపై ఫోకస్ ఎక్కువగా పెట్టవచ్చని భావిస్తున్నారు. తద్వారా ఉద్ధవ్ థాకరే వర్గం నుంచి రాజ్ థాకరే కొంత వరకైనా నష్టం కల్గిస్తే.. అది అంతిమంగా ఎన్డీఏ కూటమికి కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు దళితులు, బౌద్ధుల్లో గట్టి పట్టున్న ప్రకాశ్ అంబేద్కర్ నేతృత్వంలోని ‘వంచిత్ బహుజన్ అఘాడీ’, విపక్ష కూటమి (I.N.D.I.A)కి మద్ధతు ప్రకటించడంతో జరగబోయే నష్టాన్ని ఎన్డీఏ సారథులు అంచనా వేస్తున్నారు. దాన్ని పూడ్చడంలో ఎంఎన్ఎస్ కొంతమేర ఉపయోగపడుతుందని భావించి, రాజ్ థాకరేను తమవైపు తిప్పుకోవడంలో సఫలమయ్యారు. రాజ్ థాకరే అసలు బలం ఎంత అన్నది కచ్చితంగా చెప్పలేకపోయినా.. 2014లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం + బీజేపీ కూటమికి జనసేన ప్రకటించిన మద్ధతు విజయానికి తోడ్పడింది. ఓట్ల శాతంలో స్వల్పతేడాతో గట్టెక్కింది. ఆనాటికి జనసేన బలం ఎంతన్నది ఎవరికీ తెలియదు. తదుపరి 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సృష్టించిన సునామీలోనూ జనసేన దాదాపు 6 శాతం ఓట్లను కైవసం చేసుకోగలిగింది. అదిప్పుడు 10-12 శాతం వరకు పెరిగి ఉంటుందని కొన్ని అంచనాలున్నాయి. మహారాష్ట్రలో ఎంఎన్ఎస్ కొన్ని ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ పరిమిత ప్రాంతాల్లో మాత్రమే ఉనికి చాటుకోగలిగింది. స్వల్పతేడాతో ఓడిపోకుండా కాపాడ్డంలో ఎంఎన్ఎస్ ఓటుబ్యాంకు దోహదపడుతుందని కమలనాథులు, మహాయుతి నేతలు అంచనా వేస్తున్నారు. రాజ్ థాకరే మద్దతు ప్రకటించడాన్ని స్వాగతిస్తూ.. ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..