AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pandikona Dog Breed: శునక రూపం.. చిరుత రాజసం! కౄరమృగాలను సైతం చీల్చిచెండాడే పందికోన వైల్డ్ డాగ్స్

సాధారణంగా శునకాలను గ్రామ సింహాలని వ్యవహరిస్తుంటాం. కానీ ఈ కుక్కలు నిజంగానే సింహాల మాదిరి అడవి జంతువులను సైతం చీల్చి చెండాడుతాయి. అవేవో అడవి కుక్కలనుకుంటే పొరబాటే. శునక రూపం.. చిరుత రాజసం కలగలిపిన పందికోన కుక్కల గురించే మనం చర్చిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌ జిల్లా పందికోన గ్రామానికి చెందినీ ఈ శునకాల ఖ్యాతి ప్రస్తుతం ఖండాంతరాలు దాటింది. చూడ్డానికి అచ్చం సాదాసీదా శునకం..

Pandikona Dog Breed: శునక రూపం.. చిరుత రాజసం! కౄరమృగాలను సైతం చీల్చిచెండాడే పందికోన వైల్డ్ డాగ్స్
Pandikona Dog Breed
Srilakshmi C
|

Updated on: Apr 10, 2024 | 7:12 PM

Share

కర్నూల్‌, ఏప్రిల్ 10: సాధారణంగా శునకాలను గ్రామ సింహాలని వ్యవహరిస్తుంటాం. కానీ ఈ కుక్కలు నిజంగానే సింహాల మాదిరి అడవి జంతువులను సైతం చీల్చి చెండాడుతాయి. అవేవో అడవి కుక్కలనుకుంటే పొరబాటే. శునక రూపం.. చిరుత రాజసం కలగలిపిన పందికోన కుక్కల గురించే మనం చర్చిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌ జిల్లా పందికోన గ్రామానికి చెందినీ ఈ శునకాల ఖ్యాతి ప్రస్తుతం ఖండాంతరాలు దాటింది. చూడ్డానికి అచ్చం సాదాసీదా శునకం మాదిరిగానే కనిపిస్తాయి. కానీ వీసమెత్తు అనుమానం వచ్చిందో అమాంతం దాడి చేసి ప్రతాపం చూపిస్తాయి. పందికోన గ్రామ సింహాలు ఎందుకింత ప్రత్యేకంగా ఉన్నాయ్‌? మనం కూడా తెచ్చుకోవచ్చా? ధరెంత ఉంటాయ్‌? అసలెక్కడ దొరకుతాయ్‌? వంటి సందేహాలు మీకూ ఉన్నాయా? ఆ విషయాలు మీకోసం..

రాష్ట్రంలోని కర్నూలు జిల్లా పందికోన శునకాల ఖ్యాతి ప్రస్తుతం ఖండాంతరాల్లో మారుమ్రోగిపోతుంది. పోలీస్‌ సేవలతోపాటు మూగజీవాలకు రక్షణగా, పంట పొలాలకు కాపలాగా ఉంటూ క్రూర మృగాలను తరిమికొడుతున్నాయి. పౌరుషం, వేటాడే తత్వం, గాంభీర్యం .. వీటి ప్రత్యేక లక్షణాల కారణంగా ఎన్నారైల నుంచి పోలీస్ అధికారులు, ధనవంతుల వరకు ప్రతి ఒక్కరూ పందికోన గ్రామానికి వరుస కడుతున్నారు.

మగ చిరుత – ఆడ శునకాల క్రాస్‌ బ్రీడ్‌

కర్నూలు జిల్లా పత్తికొండకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న పందికోన గ్రామాన్ని బ్రిటిష్‌ కాలంలో పాలెగాళ్లు పాలించేవారు. అప్పట్లో దట్టమైన అడవుల నుంచి చిరుతలు గ్రామంలోకి వస్తుండేవి. అలా ఓసారి గ్రామ సత్రంలో ఓ చిరుత పులి ప్రసవించింది. దానికి పుట్టిన ఓ మగ చిరుత గ్రామంలోని ఆడ కుక్కలతో కలిసి సంచరించేదట. తర్వాత ఆ మగ చిరుత పెరిగి, గ్రామంలోని ఆడకుక్కలతో జత కట్టడం వల్ల చిరుత లాంటి కుక్క పిల్లలు పుట్టాయని, ఆ సంతానం వృద్ధి చెంది పందికోన శునకాల జాతి వృద్ధి చెందినట్లు గ్రామవాసులు చెబుతున్నారు. పందికోన గ్రామంలో సుమారు 700 కుటుంబాలు ఉన్నాయి. వీరంతా 1500కు పైగా శునకాలను పెంచుతున్నారు. అంతేకాదు ఈ కుక్కలకు ప్రత్యేక పేర్లు పెట్టి మరీ పిలుస్తుంటారు. ఈ శునకాలకు చిన్న వయసులోనే దేహంపై రెండు వైపులా వాతలు పెడతారు. ఈ శునకాలు యజమానులు భుజించే ఆహారాన్నే తింటాయి. పప్పుతో కలిపిన అన్నం, జొన్న రొట్టెలు, చికెన్, మటన్‌ ఎంతో ఇష్టంగా ఆరగిస్తాయి.

ఇవి కూడా చదవండి

అదే పందికోన శునకాల విశిష్ట

పందికోన శునకాలను గ్రామంలో పశువులు, మేకలు, గొర్రెల మందలకు రక్షణగా గ్రామస్తులు వినియోగిస్తున్నారు. ఎలాంటి కౄర మృగాలనైనా ఇవి వేటాడతాయని గ్రామస్తులు చెబుతున్నారు. కొత్త వ్యక్తులను నిలువరించడం, దొంగలను ముట్టడించి దాడి చేయడం వీటి ప్రత్యేకత. పంటలను నాశనం చేసే అడవి పందులను వేటాడి తింటాయి. దీంతో పందికోన శునకాల ప్రత్యేకత అనతికాలంలో దేశవిదేశాలకు పాకింది. హైదరాబాద్, అమరావతి, ఢిల్లీతోపాటు అమెరికా, ఇతర దేశాలకూ వీటి ఎగుమతి ప్రారంభమయ్యాయి. వీటి విశిష్టతను గుర్తించిన అమెరికాకు చెందిన ఓ టీం 37 యేళ్ల క్రితం ఈ గ్రామాన్ని సందర్శించి వీటికి షెల్టర్, వసతి సౌకర్యాల కోసం నిధులు ఇస్తామని చెప్పగా.. గ్రామస్తులు నిరాకరించారు. ఇక స్వదేశంలో కేంద్ర రక్షణ శాఖ, పోలీసు అధికారులు వీటిని పౌర, రక్షణ సేవలకు వినియోగిస్తున్నారు. అలాగే గృహ యజమానులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కూడా ఈ జాతి శునకాలను కొనుగోలు చేస్తున్నారు. ఏటా ఢిల్లీ నుంచి డిస్కవరీ చానల్‌ ప్రతినిధులు ఈ గ్రామానికొచ్చి శునకాలను అధ్యయనం చేసి వెళ్తుంటారని గ్రామస్థులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.