Indian Railway: ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలా..? ఆధార్ ఓటీపీ ఎంటర్ చేయాల్సిందే.. అక్రమాలకు ఇక చెల్లుచీటీ
తత్కాల్ టికెట్ల బుకింగ్‌లో రైల్వేశాఖ తీసుకొచ్చిన నూతన మార్పులపై రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం కొన్ని రైళ్లల్లో తత్కాల్ బుకింగ్‌లకు ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. త్వరలో విడతల వారీగా అన్ని రైళ్లల్లో ఈ విధానం అమల్లోకి తెస్తామని ప్రకటించారు.

Tatkal Tickets Booking: తత్కాల్ టికెట్ల బుకింగ్‌లో భారతీయ రైల్వే ఇటీవల పలు మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తత్కాల్ టికెట్ల బుకింగ్‌లో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది. అంటే తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఓటీపీ ద్వారా ఆధార్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ పూర్తయితేనే తత్కాల్ టికెట్లు మీకు బుక్ అవుతాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 322 రైళ్లల్లో తత్కాల్ టికెట్ బుకింగ్‌కు ఈ విధానం అమల్లోకి తీసకొచ్చారు. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్నా లేదా రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్‌కు వెళ్లి బుక్ చేసుకున్నా ఆధార్ ఓటీపీ ధృవీకరణ అనేది తప్పనిసరి చేశారు. దీని వల్ల అక్రమాలు తగ్గడంతో తత్కాల్ టికెట్ల లభ్యత సమయం పెరిగిందని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో వెల్లడించారు.
గురువారం పార్లమెంట్‌లో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. ఈ సందర్భంగా తత్కాల్ టికెట్ల బుకింగ్‌లో వచ్చిన మార్పులపై వివరణ ఇచ్చారు. ఆన్‌లైన్‌లో 322 రైళ్లకు ఓటీపీ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రవేశపెట్టామని, రిజర్వేషన్ కౌంటర్లలో బుకింగ్స్‌పై వెరిఫికేషన్ 211 రైళ్లల్లో తెచ్చినట్లు తెలపారు. దశలవారీగా అన్ని రైళ్లల్లో ఈ విధానం అమల్లోకి తెస్తామని ప్రకటించారు. కొత్త విధానం వల్ల 96 రైళ్లల్లో 95 శాతం ధృవీకరించబడిన తత్కాల్ టికెట్ లభ్యత సమయం పెరిగిందని స్పష్టం చేశారు. ఇక దీని వల్ల అక్రమాలకు పాల్పడేవారిని పట్టుకుని వారి ఐడీలను బ్లాక్ చేసినట్లు తెలిపారు. జనవరి 2025 నుంచి దాదాపు 3.02 కోట్ల అనుమానాస్పద వినియోగదారుల ఐడీలను నిషేధించినట్లు అశ్విని వైష్ణవ్ లోక్‌సభకు వివరించారు.
నిజమైన వినియోగదారులను ఫిల్టర్ చేయడానికి, చట్టబద్దమైన ప్రయాణికులు సజావుగా టికెట్ బుకింగ్ చేసుకోవడానికి AKAMAI వంటి యాంటీ-బాట్ సొల్యూషన్‌లను ఉపయోగించుకుంటున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. వినియోగదారుల ఖాతాలను పున:పరిశీలన, ధృవీకరణ తర్వాత ఫేక్ ఐడీలను పట్టుకుని వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక అనుమానాస్పదంగా బుక్ చేయబడిన పీఎన్‌ఆర్‌లపై నేషనల్ సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో అనేక ఫిర్యాదులు నమోదయ్యాయని అన్నారు. వీరిపై కూడా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.




